సాగుకు పూర్వ వైభవం తేవాలి
* బడ్జెట్‌లో ఈ రంగానికి సరిపోయేలా నిధులు: సీఎం కేసీఆర్
* డిమాండ్‌కు తగ్గ పంటలు వేసేలా చూడండి
* 46 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలి
* సాగుపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి సూచన
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది రైతులు ఆధారపడి బతికే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ శాఖ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు.
రైతులకు మేలు చేసే విధానాలు అనుసరించాలన్నారు. వ్యవసాయ శాఖకు చాలినన్ని నిధులివ్వాలని స్పష్టంచేశారు. బడ్జెట్‌పై చేస్తున్న శాఖల వారీ సమీక్షలో భాగంగా గురువారం సీఎం వ్యవసాయ శాఖ ప్రతిపాదనలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. శాస్త్రీయ పద్ధతిలో రైతులకు మేలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అధిక వర్షాలున్నప్పుడు ఒక రకంగా వర్షాలు లేనప్పుడు మరో రకంగా వ్యూహం ఉండాలని వివరించారు.
పత్తి వద్దు.. మక్క, సోయాబీన్ మేలు
డిమాండ్‌కు తగినట్లు పంటలను సాగు చేసేలా రైతులను సన్నద్ధపరచాలని అధికారులకు సీఎం సూచించారు. ‘‘పత్తి ఎగుమతులపై విధించే సుంకం కారణంగా భవిష్యత్‌లో ఆ పంటకు మంచి ధర రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించాలి. తక్కువ పెట్టుబడి, గ్యారంటీ మార్కెట్ ఉన్న మొక్కజొన్నను ప్రోత్సహించాలి.
డిమాండ్ ఉన్న సోయాబీన్ పంట సాగు దిశగా చైతన్యపరచాలి. సోయాబీన్ రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో ఉంచాలి’’ అని చెప్పారు. మిర్చి, పసుపు, అల్లం వంటివి పండించడానికి అనువైన భూములను గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు. యార్డుల్లో సరుకు తడవకుండా మార్కెటింగ్ శాఖతో కలసి పనిచేయాలన్నారు.
కేంద్ర నిధులు వచ్చేలా ప్రణాళికలు
కేంద్ర నిధులు అధిక మొత్తంలో పొందేందుకు ప్రణాళికలు రచించాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రానికి అవసరమయ్యే కూరగాయలన్నీ ఇక్కడే పండించాలని, ఎన్ని విత్తనాలు కావాలో అన్నీ ఇక్కడే ఉత్పత్తి చేయాలన్నారు. ఇందుకు తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారితో సమన్వయం కుదుర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రమంతటికీ పాలు ఇక్కడే ఉత్పత్తి కావాలని చెప్పారు. మాంసం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా గొర్రెలు, మేకల పెంపకం పెరగాలన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించే 46 వేల చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలని అన్నారు.
యూనివర్సిటీతో అనుసంధానం
వ్యవసాయ వర్సిటీని బలోపేతం చేయాలని, విత్తనాలు ఉత్పత్తి చేయాలని, కొత్త వంగడాలు సృష్టించాలని, పరిశోధనలు విసృ్తతంగా జరగాలని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఐప్యాడ్‌లు కొనివ్వాలని ఆదేశించారు. పంటలకు వచ్చే చీడ పీడలను గుర్తించి, ఫొటోలు తీసి ఫోన్లు, ఐప్యాడ్‌ల ద్వారా పంపాలని, ఆగ్రానమిస్ట్‌లు విరుగుడు చర్యలు సూచించాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.