విమ్స్ ప్రారంభించండి
సాలూరు: విశాఖపట్నంలో విమ్స్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని శాసనసభలో కోరినట్టు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌నుంచి ఫోన్లో స్థానిక విలేకరులకు శాసనసభ సమావేశ వివరాలను తెలిపారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు తొలుత ఈవిషయాన్ని లేవనెత్తారన్నారు. విశాఖలోని కేజీహెచ్‌కు రోగుల తాకిడి అదికమవడంతో ఉత్తరాంధ్రతోపాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
గిరిజన రోగుల సౌకర్యార్థం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సేవలందడంలేదని, కొన్ని రకాల పరీక్షలను బయట చేయమంటున్న విషయాన్ని తాను సభ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అందువల్ల రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.100కోట్ల వ్యయంతో 110 ఎకరాల్లో నిర్మించిన విమ్స్ ఆస్పత్రిని ప్రారంభించాలని కోరామన్నారు. నిర్మాణం పూర్తయి 3ఏళ్లు పైబడుతోందని రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని విమ్స్‌ను ప్రారంభించాలని కోరామన్నారు.
దీంతో స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా జోక్యం చేసుకుని విమ్స్‌ను తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో 60కోట్ల రూపాయలు మంజూరుచేస్తామని ప్రకటించారని గుర్తుచేశారన్నారు. దీనిపై స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని 3నెలల్లో విమ్స్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నారు.