MLA puspasrivani
-
బాధితులకు అండగా ఉంటా : పుష్పశ్రీవాణి
కురుపాం: తిత్లీ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి భరోసా ఇచ్చా రు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. మండలంలోని జరడ పంచాయతీలో పలు గ్రామాలకు చెందిన 56 ఇళ్లు దెబ్బతిన్న విషయం తెలుసుకున్నారు. జరడలో దెబ్బతిన్న బాధిత కుటుంబాల రేకిళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మొత్తం వివరాలు సేకరించి తుపాను బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్, ఐటీడీఏ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టేలా చూస్తానని తెలిపారు. గ్రామంలో నిలిచిపోయిన విద్యుత్, తాగునీటి సరఫరా సమస్యల పరిష్కారానికి పంచాయతీ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి, జెడ్పీటీసీ పద్మావతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇంటికుప్పల గౌరీశంకరరావు, జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయిపిల్లి శ్రీధర్, రేవు సత్తిబాబు, సువ్వాన చంటి, త్రిపుర, బి.అనంత్ తదితరులు ఉన్నారు. తక్షణమే పరిహారం చెల్లించాలి గరుగుబిల్లి: తిత్లీ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గిజబ, నందివానివలస, తోటపల్లి గ్రామాల్లో తుపాను కారణంగా దెబ్బతిన్న అరటి పంటను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తెలిపిన వివరాలు తెలుసుకొని ఎమ్మెల్యే చలించిపోయారు. ఏడాదంతా కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయామని రైతులు ఆమె వద్ద గోడు వెలిబుచ్చారు. పరిహారం అందేలా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా అధికారులతో ఇప్పటికే చర్చించామని చెప్పారు. పారదర్శకంగా పంట నష్టం నివేదికలు అందజేయాలని సూచించినట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడానని చెప్పారు. పరిహారం మంజూరులో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా పోరాట బాట పడతామని పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీటీసీ ఎం.శంకరరావుతో పాటు రైతులు పాల్గొన్నారు. -
రంజాన్ సుఖ సంతోషాలు నింపాలి
కురుపాం : సుఖ సంతోషాలతో ముస్లిం సోదరులంతా బాగుండాలని, రంజాన్ ముస్లిం కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు అన్నారు. కురుపాంలోని శివ్వన్నపేటలో ఉన్న ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో సహపంక్తిలో కూర్చొని ఫలాహారాన్ని స్వీకరించి రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా రంజాన్ పండగ సరదాగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు ఐక్యంగా కలసిమెలసి ఉంటూ ఆనందాల నడుమ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలు ఐక్యతను చాటడం ద్వారా మరింతగా ఎదగాలని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, గోరిశెట్టి గిరిబాబు, జి.వి.శ్రీనువాసరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్ గౌరీశంకరరావుతో పాటు కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం
విజయనగరం మున్సిపాలిటీ: ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడే మనుషులం తాము కాదని, పదవులకు, పచ్చనోట్లకు లొంగే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తన భార్యతోపాటు కుటుంబం, నియోజకవర్గ ప్రజలంతా జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తామన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా శత్రుచర్ల కుటుంబమంతా వైఎస్సార్సీపీలోనే ఉంటుందన్నారు. అవసరమైతే పదవులైనా వదులుకుంటాం గానీ, జగన్మోహన్రెడ్డిని వీడేది లేదన్నారు. తమపై విశ్వాసముంచి కురుపాం ఎమ్మెల్యే సీటిచ్చిన జగన్ రుణం తీర్చుకుంటామని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారుతున్న నేపథ్యంలో తమపై వస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఫ్యాన్‌గుర్తుపై పోటీ చేసి గెలిచినవారు నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికారపార్టీలోకి చేరటం దారుణమన్నారు. భవిష్యత్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకొస్తే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా పార్టీ మారిపోతారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ప్రతిపక్షం ఎక్కడుంటుందని, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అర్థం ఏముంటుందని ఆవేదన వెలిబుచ్చారు. రోజుకొక మాట, పూటకొక అబద్ధం చెప్పే చంద్రబాబు మాటల్ని ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదన్నారు. వచ్చేఎన్నికల్లో కురుపాం నుంచి గతంలో సాధించిన మెజార్టీకన్నా అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమా వెలిబుచ్చారు. స్వయానా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి, జిల్లాలోని ఎమ్మెల్సీలు తిష్టవేసినా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలుపును ఆపలేరన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు తమకు అత్యంత సన్నిహితులని, వారు పార్టీ మారటం బాధకలిగించిందనీ శత్రుచర్ల చెప్పారు. వారు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సంగంరెడ్డి బంగారునాయుడు, ఎం.ఎల్.ఎన్.రాజు పాల్గొన్నారు.