కురుపాం: తిత్లీ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి భరోసా ఇచ్చా రు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం ఆమె పర్యటించారు. బాధిత కుటుంబాల సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. మండలంలోని జరడ పంచాయతీలో పలు గ్రామాలకు చెందిన 56 ఇళ్లు దెబ్బతిన్న విషయం తెలుసుకున్నారు. జరడలో దెబ్బతిన్న బాధిత కుటుంబాల రేకిళ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మొత్తం వివరాలు సేకరించి తుపాను బాధితులను ఆదుకునేందుకు కలెక్టర్, ఐటీడీఏ అధికారులతో మాట్లాడతానని చెప్పారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టేలా చూస్తానని తెలిపారు. గ్రామంలో నిలిచిపోయిన విద్యుత్, తాగునీటి సరఫరా సమస్యల పరిష్కారానికి పంచాయతీ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి, జెడ్పీటీసీ పద్మావతి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇంటికుప్పల గౌరీశంకరరావు, జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయిపిల్లి శ్రీధర్, రేవు సత్తిబాబు, సువ్వాన చంటి, త్రిపుర, బి.అనంత్ తదితరులు ఉన్నారు.
తక్షణమే పరిహారం చెల్లించాలి
గరుగుబిల్లి: తిత్లీ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని గిజబ, నందివానివలస, తోటపల్లి గ్రామాల్లో తుపాను కారణంగా దెబ్బతిన్న అరటి పంటను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తెలిపిన వివరాలు తెలుసుకొని ఎమ్మెల్యే చలించిపోయారు. ఏడాదంతా కష్టపడి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయామని రైతులు ఆమె వద్ద గోడు వెలిబుచ్చారు. పరిహారం అందేలా చూడాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా అధికారులతో ఇప్పటికే చర్చించామని చెప్పారు. పారదర్శకంగా పంట నష్టం నివేదికలు అందజేయాలని సూచించినట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడానని చెప్పారు. పరిహారం మంజూరులో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా పోరాట బాట పడతామని పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీటీసీ ఎం.శంకరరావుతో పాటు రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment