ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం | ysrcp leader satrucharla parikshit raju comments | Sakshi
Sakshi News home page

ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం

Published Thu, Apr 21 2016 9:35 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM

ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం - Sakshi

ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడం

విజయనగరం మున్సిపాలిటీ: ఎంగిలి మెతుకులకు కక్కుర్తిపడే మనుషులం తాము కాదని, పదవులకు, పచ్చనోట్లకు లొంగే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తన భార్యతోపాటు కుటుంబం, నియోజకవర్గ ప్రజలంతా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తామన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా శత్రుచర్ల కుటుంబమంతా వైఎస్సార్‌సీపీలోనే ఉంటుందన్నారు. అవసరమైతే పదవులైనా వదులుకుంటాం గానీ, జగన్‌మోహన్‌రెడ్డిని వీడేది లేదన్నారు.

తమపై విశ్వాసముంచి కురుపాం ఎమ్మెల్యే సీటిచ్చిన జగన్ రుణం తీర్చుకుంటామని చెప్పారు. బొబ్బిలి ఎమ్మెల్యే పార్టీ మారుతున్న నేపథ్యంలో తమపై వస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఫ్యాన్‌గుర్తుపై పోటీ చేసి గెలిచినవారు నియోజకవర్గం అభివృద్ధి పేరుతో అధికారపార్టీలోకి చేరటం దారుణమన్నారు. భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకొస్తే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వారంతా పార్టీ మారిపోతారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ప్రతిపక్షం ఎక్కడుంటుందని, ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అర్థం ఏముంటుందని ఆవేదన వెలిబుచ్చారు.

రోజుకొక మాట, పూటకొక అబద్ధం చెప్పే చంద్రబాబు మాటల్ని ఎలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదన్నారు. వచ్చేఎన్నికల్లో కురుపాం నుంచి గతంలో సాధించిన మెజార్టీకన్నా అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమా వెలిబుచ్చారు. స్వయానా సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి, జిల్లాలోని ఎమ్మెల్సీలు తిష్టవేసినా నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపును ఆపలేరన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు తమకు అత్యంత సన్నిహితులని, వారు పార్టీ మారటం బాధకలిగించిందనీ శత్రుచర్ల చెప్పారు. వారు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమావేశంలో సంగంరెడ్డి బంగారునాయుడు, ఎం.ఎల్.ఎన్.రాజు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement