అనుమతులు ఎవరి కోసం?
సీఎంను ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజన్న దొర
సాక్షి, హైదరాబాద్: ‘బాక్సైట్ తవ్వకాలు జరిపితే ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తి కలుషితం అవుతాయని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే అసెంబ్లీలో మాట్లాడారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్కు 2011 డిసెంబర్ 24న లేఖ రాశారు. బాక్సైట్ తవ్వకాల వల్ల అక్కడ నదులన్నీ ఎండిపోతాయన్నారు. పర్యావరణం పాడైపోతుందన్నారు. గిరిజనులందరూ నిరాశ్రయులవుతార ని చెప్పారు. ఆ ప్రాంతాల్లో తాగడానికైనా మంచినీళ్లు దొరకవన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక ఈ రోజు బాక్స్ట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబరు 97 జారీ చేశారు. ఇప్పుడు గిరిజనులు నిరాశ్రయులు కారా? బాక్సైట్ తవ్వితే నీరు లేక ఆ ప్రాంతం ఎండిపోదా? పర్యావరణం దెబ్బతినదా? కాలుష్యం ఉండదా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అప్పుడో మాట, ఇప్పుడో తీరు..
చంద్రబాబుదీ, తెలుగుదేశం పార్టీదీ ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి రాగానే మరో తీరని రాజన్నదొర దుయ్యబట్టారు. అప్పుడు గవర్నర్కు రాసిన లేఖను, ఇప్పటి జీవో 97 ప్రతులను మీడియాకు చూపించారు. గవర్నర్కు గతంలో రాసిన లేఖకు చంద్రబాబు కట్టుబడి ఉండాలని రాజన్న దొర సూచించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టారు. పార్టీ నేతలతో ఆ ప్రాంతంలో ధర్నాలు చేయించారు. బాక్సైట్ తవ్వకాలకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన అనుమతులను.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 97 రద్దు చేయండని గిరిజనులందరి తరుఫున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.