మందకృష్ణపై దాడి హేయనీయం
ప్రగతినగర్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది దళిత సమాజంపై జరిగిన దాడి అని దళిత సంఘాల చర్చా వేదిక నాయకులు అన్నారు. ఇదంతా తెలిసి కూడా కలెక్టర్, జేసీ మౌనం దాల్చడం సరికాదన్నారు. నిజామాబాద్ టీఎన్జీవోస్ కార్యాలయంలో గురువారం ఎమ్మార్పీఎస్, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. మందకృష్ణపై ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తన అనుచరులతో దాడి చేయించడం సిగ్గుచేటన్నారు.
వారంతా దళితులు కాదని, ఎమ్మెల్యే దగ్గర పనిచేసే గుండాలని ఆరోపించారు. దళితుల కోసం పోరాడేది వామపక్ష పార్టీలేనని తెలిపారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీలు కార్మికుల, దళితుల పార్టీల ని మరోసారి రుజువయిందన్నారు. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి దళితుల భూములు లాక్కోవడమే కాక, వారిపై వివిధ కేసులు బనాయించడం, దాడులు చేయడం అధికార దురహంకారమేనని విమర్శించారు. న్యాయం కోసం దళితులు తహశీల్దార్, ఆర్డీవో, పోలీస్స్టేషన్ల చుట్టు తిరిగినా.. వారు అధికార పార్టీ తొత్తులుగా మారి ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని, ఈ విషయంలో కలెక్టర్, జేసీ స్పందించాలని కోరారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని దళితుల సమస్యలను స్వయంగా మందకృష్ణ జే సీకి విన్నవించినా.. ఆ సమస్య తమ దృష్టికి రాలేదని కలెక్టర్, జారుుంట్ కలెక్టర్ చెప్పడం బాధాకరమన్నారు. కేసీఆర్ దళితుల సంక్షేమమంటూనే మరోవైపు ఆ వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఆయ న బాటలోనే నడుస్తున్నారనడానికి ఎల్లారెడ్డి ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. దళితులంతా కలిసి ఐక్యంగా పోరాడి ఎమ్మెల్యే ఆగడాలను ఎండగడతామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇత ర నాయకులతో కలిసి ఈనెల 6న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రకటించారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగభూష ణం, రామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రబాకర్, దేవారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్, నాయకులు గోవర్దన్, వెంకట్‌గౌడ్,సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న పాల్గొన్నారు.
5న కామారెడ్డి బంద్..
ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి వైఖరికి నిరసనగా ఈ నెల 5న కామరెడ్డి బంద్‌కు పిలుపునిస్తున్నట్లు న్యూడెమోక్రసీ నాయకులు వి.ప్రభాకర్ తెలిపారు.