MLA Satyanarayana
-
న్యాయం జరగడం లేదు
జాయింట్ సీపీ చెప్పినా చర్యలు శూన్యం ఎమ్మెల్యే గోవిందు అనుచరులపై నమోదు కాని కేసు పోలీసులు స్పందించడం లేదని బాధితుల ఆవేదన పెందుర్తి : 25 ఏళ్లుగా ఉన్న ఇంటిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తూ భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ కేసులో తమకు పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇది సివిల్ తగదా అయినప్పటికీ నిందితులు తమపై దాడికి దిగడం, ఇంటి ప్రహరీని దౌర్జన్యంగా పడగొట్టడం వంటి క్రిమినల్ చర్యలపై పోలీసులు దృష్టి సారించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. బాధితులు ముమ్మన రాజేష్‌బాబు(ఫోన్ ద్వారా), ఆయన చిన్నాన్న ముమ్మన సూర్యారావు మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తమపై జరుగుతున్న దౌర్జన్యకాండపై కమిషనర్ యోగానంద్‌కు ఫిర్యాదు చేయగా దానిపై జాయింట్ కమిషనర్ సత్తార్‌ఖాన్ విచారణ జరిపారన్నారు. తాము ఇచ్చిన ఆధారాల ప్రకారం గోడ కూలగొట్టేందుకు వినియోగించిన జేసీబీలను సీజ్ చేయడంతో పాటు, ఎమ్మెల్యే గోవిందు అనుచరుడు రమేష్‌ను కస్టడీకి తీసుకోవాల్సిందిగా జాయింట్ సీపీ పెందుర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదని చెబుతున్నారు. కోర్టు తీర్పును సైతం ధిక్కరించి తమ ఇంటిపై దాడికి దిగినా పూర్తిస్థాయిలో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరోసారి ఈ కేసు విషయంలో కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 2016లో రిజిస్ట్రేషన్ : మరోవైపు ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణదిగా చెబుతున్న స్థలం 2016లో రిజిస్ట్రేషన్ జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. తాము మాత్రం 1990లో 330 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. పీలా గోవిందు స్థలం ఉన్న సర్వే నెంబర్, తమ స్థలం ఉన్న సర్వే నంబరు వేర్వేరు అని స్పష్టం చేశారు. అయినా 2001లో తాము ఇళ్లు నిర్మించుకున్నామని, అప్పటికి పీలా గోవిందు కొనుగోలు చేసిన స్థలం చెరువని గుర్తు చేశారు. 25 ఏళ్ల క్రితం స్థలం కొనుగోలు చేసిన తాము ఈ మధ్యనే భూమి కొన్న పీలా గోవిందు స్థలాన్ని ఎలా ఆక్రమించుకుంటామని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా స్టేటస్ కో ఇచ్చినా ఎమ్మెల్యే అనుచరులు అధికార బలంతో తమపై దౌర్జన్యానికి దిగి కోర్టు తీర్పును సైతం ధిక్కరించారని ఆరోపించారు. రంగంలోకి ప్రభుత్వ పెద్ద లు: ఇదిలా ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యే పీలా గోవిందు పై భూ ఆక్రమణ కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రతిష్ట కాపాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగినట్లు వినికిడి. పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులపై మంగళవారం కొందరు అధికార పార్టీ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాదాస్పద స్థలంలో ఉన్న వాస్తవ పరిస్థితులు బహిర్గతం కావడంతో రికార్డుల పరంగా తమకు అనుకూలంగా మార్చు కునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు బోగట్టా. గతంలోనే ఈ స్థలానికి సంబంధించిన రెవెన్యూ అంశాల్లో సంబంధిత అధికారులు ఎమ్మెల్యే పట్ల స్వామి భక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తే నిజానిజాలు బయటపడతాయని బాధితులు అంటున్నారు. -
గోవిందా... గోవిందా
మరో టీడీపీ ఎమ్మెల్యే అతిక్రమణ దందా వాసుపల్లి మాదిరే నగరంలో అనకాపల్లి ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం గెడ్డకు ఆనుకునే జీ ప్లస్ 4 భవనం జీ ప్లస్ 2 నిర్మాణానికే అనుమతులు గెడ్డ, మెయిన్‌రోడ్డు నుంచి కనీస దూరం పాటించని వైనం పీలా గోవిందు దగ్గరుండి మరీ పనుల పర్యవేక్షణ నోటీసులతో సరిపెట్టి.. నిద్ర నటిస్తున్న అధికారులు పక్కనే పెద్ద గెడ్డ ఉంది.. దాన్ని అనుకొని ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలూ ఉన్నాయి.. అవేవీ ఆయనగారిని అడ్డుకోలేకపోయాయి.. పైగా జీ ప్లస్ 2కి అనుమతి తీసుకొని.. జీ ప్లస్ 4 నిర్మించేస్తున్నా అధికారులు మౌనం వహిస్తున్నారు.. ఎందుకని ఆరా తీస్తే.. అది అధికార టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన నిర్మాణమని తేలింది..! ఒక వాసుపల్లి.. ఒక పీలా గోవిందు.. ఇలా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే.. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఇష్టారాజ్యంగా భారీ భవంతులు నిర్మించేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు?.. ఇదే ప్రశ్న జీవీఎంసీ అధికారులకు వేస్తే వచ్చిన సమాధానమేంటంటే.. ‘మా దృష్టికి వచ్చింది.. నోటీసులిచ్చాం’.. ఎప్పుడడిగినా ఇదే సమాధానం రెడీగా పెట్టుకునే అధికారులు.. సదరు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే చర్యలు మాత్రం చేపట్టరు.. విశాఖపట్నం: సామాన్యుడు చిన్నపాటి ఇల్లు కట్టుకునే క్రమంలో పొరపాటున ఏదైనా అతిక్రమణ జరిగితే చాలు.. వెంటనే జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించేస్తారు. నిర్మాణాలను అడ్డుకుని అక్కడున్న సామాగ్రిని సైతం తీసుకుపోతారు. వేలకు వేల జరిమానాలు విధిస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రమాదకరమైన గెడ్డ పక్కనే నిబంధనలను పాటించకుండా.. ఐదంతస్తుల భవనం కట్టేస్తున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసేసుకున్నారు. అక్కడేమీ జరగనట్టే వ్యవహరిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నోటీసులిచ్చాం.. ఆపేస్తామని షరా మామూలుగానే బీరాలు పోతున్నారు. వాసుపల్లి బాటలోనే పీలా.. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాదిరే టీడీపీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా నగరంలో అక్రమాల అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే గోవింద్ భార్య పి.విజయలక్ష్మి పేరిట నగరంలోని ద్వారకానగర్ బీవీకే కళాశాల రోడ్డులోని సర్వే నెంబర్ 32లో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల మేరకు నిర్మాణం జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ సదరు ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా నిర్మాణం చేసేస్తున్నారు. ఆ స్థలానికి అనుకొని దక్షిణ భాగంలో భారీ గెడ్డ ఉంది. వాస్తవానికి 168 జీవో ప్రకారం.. బఫర్ జోన్ కింద గెడ్డ నుంచి పది అడుగులు, భవనం కాంపౌండ్ నుంచి మరో పది అడుగులు.. మొత్తంగా 20 అడుగులు వదిలి నిర్మాణం చేపట్టాలి. గెడ్డ పక్కన సామాన్యుడు పూరిల్లు వేసుకున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. కానీ ఎమ్మెల్యే ఈ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గెడ్డను ఆనుకునే బహుళ అంతస్తుల భవన నిర్మాణం కానిచ్చేస్తున్నారు. భారీ వర్షాల సమయంలో గెడ్డలు పొంగి పొర్లి చుట్టుపక్కల స్థలాలు కోతకు గురయ్యే ప్రమాదముంది. హైదరాబాద్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు ఇటువంటి విపత్తులే చోటుచేసుకున్నాయి. కానీ ఇక్కడ బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధి అయిన గోవిందు గెడ్డను ఆనుకునే భారీ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమవుతోంది.