
గోవిందా... గోవిందా
మరో టీడీపీ ఎమ్మెల్యే అతిక్రమణ దందా వాసుపల్లి మాదిరే నగరంలో అనకాపల్లి ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం గెడ్డకు ఆనుకునే జీ ప్లస్ 4 భవనం జీ ప్లస్ 2 నిర్మాణానికే అనుమతులు గెడ్డ, మెయిన్‌రోడ్డు నుంచి కనీస దూరం పాటించని వైనం పీలా గోవిందు దగ్గరుండి మరీ పనుల పర్యవేక్షణ నోటీసులతో సరిపెట్టి.. నిద్ర నటిస్తున్న అధికారులు పక్కనే పెద్ద గెడ్డ ఉంది.. దాన్ని అనుకొని ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలూ ఉన్నాయి.. అవేవీ ఆయనగారిని అడ్డుకోలేకపోయాయి.. పైగా జీ ప్లస్ 2కి అనుమతి తీసుకొని.. జీ ప్లస్ 4 నిర్మించేస్తున్నా అధికారులు మౌనం వహిస్తున్నారు.. ఎందుకని ఆరా తీస్తే.. అది అధికార టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన నిర్మాణమని తేలింది..! ఒక వాసుపల్లి.. ఒక పీలా గోవిందు.. ఇలా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే.. చట్టాలను చట్టుబండలు చేస్తూ ఇష్టారాజ్యంగా భారీ భవంతులు నిర్మించేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నట్లు?.. ఇదే ప్రశ్న జీవీఎంసీ అధికారులకు వేస్తే వచ్చిన సమాధానమేంటంటే.. ‘మా దృష్టికి వచ్చింది.. నోటీసులిచ్చాం’.. ఎప్పుడడిగినా ఇదే సమాధానం రెడీగా పెట్టుకునే అధికారులు.. సదరు అక్రమ నిర్మాణాలను అడ్డుకునే చర్యలు మాత్రం చేపట్టరు..
విశాఖపట్నం: సామాన్యుడు చిన్నపాటి ఇల్లు కట్టుకునే క్రమంలో పొరపాటున ఏదైనా అతిక్రమణ జరిగితే చాలు.. వెంటనే జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించేస్తారు. నిర్మాణాలను అడ్డుకుని అక్కడున్న సామాగ్రిని సైతం తీసుకుపోతారు. వేలకు వేల జరిమానాలు విధిస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రమాదకరమైన గెడ్డ పక్కనే నిబంధనలను పాటించకుండా.. ఐదంతస్తుల భవనం కట్టేస్తున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసేసుకున్నారు. అక్కడేమీ జరగనట్టే వ్యవహరిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నోటీసులిచ్చాం.. ఆపేస్తామని షరా మామూలుగానే బీరాలు పోతున్నారు.
వాసుపల్లి బాటలోనే పీలా..
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాదిరే టీడీపీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా నగరంలో అక్రమాల అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే గోవింద్ భార్య పి.విజయలక్ష్మి పేరిట నగరంలోని ద్వారకానగర్ బీవీకే కళాశాల రోడ్డులోని సర్వే నెంబర్ 32లో 300 గజాల స్థలం ఉంది. ఈ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నిబంధనల మేరకు నిర్మాణం జరిగితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ సదరు ఎమ్మెల్యే నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా నిర్మాణం చేసేస్తున్నారు. ఆ స్థలానికి అనుకొని దక్షిణ భాగంలో భారీ గెడ్డ ఉంది. వాస్తవానికి 168 జీవో ప్రకారం.. బఫర్ జోన్ కింద గెడ్డ నుంచి పది అడుగులు, భవనం కాంపౌండ్ నుంచి మరో పది అడుగులు.. మొత్తంగా 20 అడుగులు వదిలి నిర్మాణం చేపట్టాలి. గెడ్డ పక్కన సామాన్యుడు పూరిల్లు వేసుకున్నా ఈ నిబంధన పాటించాల్సిందే. కానీ ఎమ్మెల్యే ఈ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గెడ్డను ఆనుకునే బహుళ అంతస్తుల భవన నిర్మాణం కానిచ్చేస్తున్నారు.
భారీ వర్షాల సమయంలో గెడ్డలు పొంగి పొర్లి చుట్టుపక్కల స్థలాలు కోతకు గురయ్యే ప్రమాదముంది. హైదరాబాద్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు ఇటువంటి విపత్తులే చోటుచేసుకున్నాయి. కానీ ఇక్కడ బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధి అయిన గోవిందు గెడ్డను ఆనుకునే భారీ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమవుతోంది.