మహిళా ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్
శివ్‌పురి: రైతులను రెచ్చ గొట్టారనే ఆరోపణలపై కాంగ్రెస్ కు చెందిన మహిళా ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు ఆదేశించింది. గత నెల 8వ తేదీన ఆందోళన చేపట్టిన రైతులను ఎమ్మెల్యే శకుంతల ఖతీక్ రెచ్చగొట్టి పోలీస్‌స్టేషన్‌పై దాడికి పురిగొల్పారని ఆమెపై కరేరా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన అదనపు చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ శరద్ లిగోరియా ఉత్తర్వులు ఇచ్చారు. ఆందోళన సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఉన్న ఓ నేత పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్ వినతిని కోర్టు తోసిపుచ్చింది.
ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుమంది రైతులు చనిపోయారు. అనంతరం ఎమ్మెల్యే శకుంతల పోలీస్‌స్టేషన్ ఎదుట అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఠాణాకు నిప్పుపెట్టాలని ఎమ్మెల్యే ఆందోళన కారులను కోరుతున్నట్లు ఉన్న వీడియో పోలీసులకు చిక్కింది. దీంతో న్యాయస్థానం ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఘటన జరిగిన నాటి నుంచి ఎమ్మెల్యే ,ఆమె అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.