చిన్న చిన్న పొరపాట్లు వాస్తవమే
► ఉమాతో పోరు లేదు
► బ్రహ్మయ్య లింగం చెరువు అభివృద్ధికి చర్యలు
► ఎమ్మెల్యే వంశీ వెల్లడి
గన్నవరం : గన్నవరం-ఆగిరిపల్లి మండలాల మధ్య ఉన్న బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. ‘మట్టి పోరు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్థానిక తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. చెరువులో మట్టి తవ్వకాల్లో చిన్నచిన్న పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, తనకు ఎటువంటి పోరూ లేదన్నారు. చెరువులో పూడికలను తొలగించి, ఆక్రమణలను ప్రక్షాళన చేయటం, గ ట్లను బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రస్తుతం పనులు చేపట్టామని తెలిపారు. దీనిని రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు సీఎంతో పాటు మంత్రి ఉమా అంగీకరించారని చెప్పారు.
పుష్కరాలకు రోడ్ల నిర్మాణం... రానున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జక్కంపూడి నుంచి గొల్లనపల్లి వరకు పోలవరం కాలువ కట్టపై నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని వంశీ తెలిపారు. పాయకాపురం వైపుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ముస్తాబాద మీదుగా కేసరపల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు విస్తరణకు రూ.21 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.