ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్, ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీవరణ పై రగడ చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని పోడియం వద్ద ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మంగళవారం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పట్టుబట్టారు.
కానీ, ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. కానీ, టీడీపీ సభ్యులు రేవంత్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్కు చెందిన సంపత్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో మంత్రి హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దీనిపై స్పందించిన స్పీకర్ .. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా సభ్యుల సస్పెన్షన్ పై విపక్ష నేతల విజ్ఞప్తి చేయగా సస్పెన్షన్ ను ఎత్తివేశారు.