రాజకీయంగా పునర్జన్మ
ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్
మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్ :రాజకీయంగా తనకు పునర్జన్మ లభించిందని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని శాసనమండలి చైర్మన్ చక్రపాణి చాంబర్లో బోస్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తప్పుడువాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వాటిని విస్మరించి ఇష్టానుసారం పరిపాలిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తూ సమయం కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే పట్టిసీమ ప్రాజెక్టు వద్దని అందరూ చెబుతున్నా పెడచెవిన బెట్టి నిర్మాణానికి పూనుకోవడం దారుణమన్నారు. డెల్టా రైతులకు నష్టం కలిగించే ఈ ప్రాజెక్టును అవకాశం ఉన్న అన్ని వేదికలపైనా ప్రశ్నిస్తామన్నారు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోనే టీడీపీకి ఎక్కువ స్థానాలు లభించాయని, అలాంటప్పుడు ఆ ప్రాంత ప్రయోజనాలకే నష్టం కలిగించడం ఏమిటని ప్రశ్నించారు.