ఎమ్మెల్సీ వర్సెస్ డీఈవో
అక్రమ పదోన్నతులపై డీఈవోను నిలదీసిన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు
గుంటూరు వెస్ట్: జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకు నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా కల్పించిన పదోన్నతుల అంశాన్ని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తారు. పోస్టు ఖాళీ కావడానికి రెండు రోజుల ముందే అపాయింట్మెంట్ ఇచ్చారని, తర్వాత తప్పును సరిదిద్దుకుని మరో తేదీతో పోస్టింగ్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు లేకపోయినా, కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించడంలో ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని డీఈవో కేవీ శ్రీనివాసులరెడ్డిని నిలదీశారు.
నిబంధనల ప్రకారమే పదోన్నతులు కల్పించానని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ డీఈవో సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. డీఈవో చాలా నిర్లక్ష్యంగా ఎమ్మెల్సీకి సమాధానం చెప్పడంతో సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టమని, ఎంతదూరమైనా వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని, నిబంధనలను ఉల్లంఘించిన మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.