గొప్పలకు పోతే.. అసలుకే ఎసరు
కౌన్సిల్లో బడ్జెట్‌పై చర్చలో కాంగ్రెస్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సర్వజన హితం కోసం అన్నట్లు కాకుండా, కొంతమంది సుఖం కోసం అన్నట్లుగా ఉందని శాసనమండలిలో కాంగ్రెస్ దుయ్యబట్టింది. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న భద్రాద్రి రాముని కోసం గుడి నిర్మించి, ఆభరణాలు కూడా చేయించాడని, ముఖ్యమంత్రి మాత్రం భద్రాద్రి రాముని సంగతే మరిచిపోయారని అన్నారు.
యాదగిరిగుట్టకు రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ధనిక రాష్ట్రమని తెలంగాణ ప్రభుత్వం గొప్పలకుపోతే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముందని సుధాక ర్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.61,711 కోట్ల అప్పులు ఉన్నాయన్న సంగతిని గుర్తు చేశారు. రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సర్కారు అంతడబ్బు ఎక్కడ్నుంచి తెస్తుందో మాత్రం వివరించలేదన్నారు.
సుధాకర్ వర్సెస్ సుధాకర్: బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా.. ప్రతిపక్షం తరఫున ప్రసంగిస్తున్న పొంగులేటిని, పాతూరి పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల ఎంతో శ్రమించి బడ్జెట్‌ను రూపొం దిచారని, ఇది జనరంజక బడ్జెట్ అని పాతూరి చెప్పుకొచ్చారు. దీంతో పాతూరి తాను ఎమ్మెల్సీని మాత్రమేనన్న విషయాన్ని మరిచి, తనను తాను ప్రభుత్వ ప్రతి నిధిగా ఫీలవుతున్నారని పొంగులేటి చురక అంటించారు. పాతూరి తీరుపట్ల ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్ కూడా తీవ్ర అభ్యంతరం చెప్పడంతో.. ఆయన మిన్నకుండిపోయారు.