ఆధార్‌కు ఆందోళన
పెదబయలులో రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు
రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం
రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్
పెదబయలు : మండలంలో ఆధార్ మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ లబ్ధిదారులు శనివారం పెదబయలు అంబేద్కర్ కూడలిలో బైఠాయించి నినాదాలు చేశారు. పెదబయలు మండలంలో ఐదు చోట్ల మోబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మండల తహాశీల్దార్ చొరవ చూపాలని నినాదాలు చేశారు. పెదబయలు మండలంలోని 23 గ్రామ పంచాయితీలలో ఎక్కువ మందికి ఆధార్ నమోదు కాలేదని వీరు ఆందోళన వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో రోజుకు 50 మందిని కూడా నమోదు చేయడం లేదని చెప్పారు. దీనివల్ల 23 పంచాయతీల నుంచి వేలాది మంది వచ్చి మండల కేంద్రంలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. నాలుగు నుంచి ఐదు రోజులు నిరీక్షిస్తున్నా ఆధార్ నమోదు కావడం లేదని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చి అవ స్థలు పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పారు. తహశీల్దార్ జాడేలేదన్నారు.
ఈ నెల చివరి కల్లా అధార్ నమోదు పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా, ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేదని, దీని వల్ల తాము ప్రభుత్వ పథకాలు కోల్పోయే ప్రమాద ం ఉందని అన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఆధార్ మండలానికి ఎక్కువ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని మండలాలతో పోలిస్తే పెదబయలు మండలంలోనే ఎక్కువ మందికి ఆధార్ నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, టీడీపీ నాయకులు సీకరి సన్యాసిదొర, వెచ్చంగి కొండయ్య తదితరులు, సీకరి సర్పంచ్ వనల్భ సన్యాసి, గుల్లేలు సర్పంచ్ నాగరాజు, వివిధ గ్రామాల ఆధార్ అబ్ధిదారులు పాల్గొన్నారు.