Mobilization Advance
-
నవయుగకు ఇచ్చింది ప్రజాధనమే!
సాక్షి, అమరావతి: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ఏపీ జెన్కో నుంచి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద తీసుకున్నది ప్రజాధనమని, ఆ డబ్బు తిరిగి ప్రభుత్వానికి చేరాల్సిందేనని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆ కంపెనీ వందల కోట్ల రూపాయలు తీసుకుని క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించలేదని వివరించారు. ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకే, ఆ సంస్థ బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజాధనాన్ని వెనక్కి తీసుకోవద్దనే అధికారం ఎవరికీ లేదన్నారు. బ్యాంకు గ్యారెంటీల విషయంలో ఆర్బిట్రేషన్ చట్టంలోని సెక్షన్ 9 కింద విజయవాడ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎంత మాత్రం విచారణార్హత లేదని ఆయన పునరుద్ఘాటించారు. అసలు ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధే ఆ కోర్టుకు లేదని శ్రీరామ్ వివరించారు. కమర్షియల్ కోర్టుల చట్టం కింద కమర్షియల్ కోర్టు హోదా ఉన్న న్యాయస్థానంలోనే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉందన్నారు. మచిలీపట్నం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కోర్టుకు కమర్షియల్ కోర్టు హోదానివ్వడం జరిగిందన్నారు. ఈ కోర్టుకు మాత్రమే నవయుగ పిటిషన్‌ను విచారించే పరిధి ఉందని ఆయన తెలిపారు. బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోరాదంటూ ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ కోర్టు, కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఏకపక్షంగా వ్యవహరించిందని, అందువల్ల ఆ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఏజీ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం, నవయుగ తరఫు వాదనలు వినడానికి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ జెన్కో హైకోర్టులో సివిల్ మిస్లేనియస్ అప్పీల్ (సీఎంఏ) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఎన్నికల ఇం‘ధనం’ కోసం...
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పోలవరం ప్రాజెక్టును అక్షయపాత్రగా మార్చుకున్నారనడానికి మరో తార్కాణం ఇది! కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ఎన్నికలకు నిధులు సమకూర్చు కుంటూ మరో భారీ స్కామ్‌కు తెర తీశారు. పోలవరం హెడ్‌వర్క్స్(జలాశయం) పనులకు సంబంధించి పాత ధరల ముసుగులో మూడు విడతలుగా రూ.3,498.12 కోట్ల విలువైన పనులను నిబంధనలకు విరుద్ధంగా నవయుగ సంస్థకు నామి నేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. తాజా ధరల ప్రకారం ఆ పనులకు బిల్లుల కింద రూ.8,733.37 కోట్లను చెల్లించనున్నారు. అంటే పాత ధరల ముసుగులో కాంట్రాక్టర్‌కు రూ.5,235.25 కోట్ల ప్రయోజనం చేకూర్చిన ప్రభుత్వ పెద్దలు.. ఇందుకు ప్రతిఫలంగా పోలవరం హెడ్‌వర్క్స్ చీఫ్ ఇంజనీర్ పీడీ (వ్యక్తిగత ఖాతా)లోని రూ.550 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి, వాటినే తిరిగి కమీషన్లుగా వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వ పెద్దలు భారీగా ఇం‘ధనం’ సమకూర్చుకోవడంలో భాగంగా ఖజానాను కొల్లగొడుతుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పీడీ ఖాతాలో రూ.550 కోట్లు పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత హెడ్‌వర్క్స్ ప్రధాన కాంట్రాక్టరైన టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ మూడు విడతలుగా హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు మినహా మిగతా పనులన్నీ నవయుగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీంతో హెడ్‌వర్క్స్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ని సర్కార్ పూర్తిగా తప్పించేసింది. అయితే ఆ సంస్థ ప్రభుత్వం నుంచి తీసుకున్న మొబిలైజేషన్ అడ్వాన్సులకుగానూ.. బీజీ (బ్యాంకు గ్యారెంటీలు) రూపంలో రూ.380 కోట్లు, ఎస్డీ (సెక్యూరిటీ డిపాజిట్లు) రూపంలో రూ.170 కోట్లను జలవనరులశాఖ వద్ద డిపాజిట్ చేసింది. ట్రాన్స్ట్రాయ్పై వేటు వేసిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వసూలు చేయాల్సిన డబ్బులకు సంబంధించి బీజీ, ఎస్డీలను నగదుగా మార్చుకున్న పోలవరం చీఫ్ ఇంజనీర్ నిబంధనలకు విరుద్ధంగా పీడీ ఖాతాలో రూ.550 కోట్లను జమ చేశారు. మరో విడత కమీషన్ల కోసం... పోలవరం హెడ్‌వర్క్స్‌లో నామినేషన్‌పై రూ.8,733.37 కోట్ల విలువైన పనులను, టెండర్ల ద్వారా రూ.5,358.23 కోట్ల విలువైన జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులనూ నవయుగ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. అంటే.. ఒకే ప్రాజెక్టులో రూ.14,091.6 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ పెద్దలు భారీ ఎత్తున నిధుల సమీకరణలో నిమగ్నమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నవయుగ సంస్థ నుంచి మరో విడత కమీషన్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పీడీ ఖాతాలోని నిధులు నవయుగకు! ఈ క్రమంలోనే ట్రాన్స్ట్రాయ్ నుంచి వసూలు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సులపై నవయుగ కళ్లు పడ్డాయి. పోలవరం చీఫ్ ఇంజనీర్ పీడీ ఖాతాలోని నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇప్పిస్తే.. వాటినే కమీషన్లుగా ముట్టజెప్పేలా ప్రభుత్వ పెద్దలతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందంలో భాగంగానే పీడీ ఖాతాలోని రూ.550 కోట్లను నవయుగకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే కీలక అధికారి ఒకరు చెప్పారు. ముందు డబ్బులివ్వండి... తర్వాత ఆమోదిస్తాం! నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించిన కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సీఎం చంద్రబాబు తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. తక్షణమే రూ.550 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇవ్వాలని, ఆ తర్వాత దీనికి కేబినెట్లో ఆమోదముద్ర వేస్తామని ఒత్తిడి తెస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలవరం చీఫ్ ఇంజనీర్ పీడీ ఖాతాలోని రూ.550 కోట్లను నవయుగకు నేడో రేపో మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
పైసా పనిచేయకుండా రూ.500 కోట్ల బిల్లు
పోలవరం కాంట్రాక్టర్ మాయాజాలం ♦ మరో రూ.400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌కు అర్హతుందంటూ లేఖ ♦ మొత్తం రూ.900 కోట్లు చెల్లించడానికి రంగం సిద్ధం ♦ పోలవరం నిర్మాణ ప్రగతిపై వాస్తవ నివేదికలిచ్చిన ఇంజనీర్‌పై బదిలీ వేటు సాక్షి, హైదరాబాద్: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరున కూర్చున్నా అన్నీ అందుతాయి.. అన్న సామెత పోలవరం కాంట్రాక్టర్‌కు బాగా సరిపోతుంది. పైసా పనిచేయకుండా రూ. 500 కోట్ల విలువైన పనులు చేసినట్లు ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ బిల్లులు సమర్పించగా.. అందుకు పోలవరం అధికార యంత్రాంగం వత్తాసు పలికింది. సదరు కాంట్రాక్టు సంస్థ చెబుతున్న మేరకు పని చేసిందంటూ ఏకంగా ధ్రువీకరించింది. ప్రాజెక్టు నిర్మాణ పని ఒక్క సెంటీమీటర్ కూడా ముందుకు సాగలేదని హైదరాబాద్‌లో కూర్చున్న నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు తెలుసు. అయినప్పటికీ సదరు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలకడానికి వెనుక సర్కారు పెద్దల హస్తమున్నట్టు ఇంజనీర్లు చెబుతుండడం గమనార్హం. పరిశీలన.. నాణ్యత తనిఖీ.. అన్నీ ఒక్కరే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టర్ ఎంత పనిచేశారనే విషయాన్ని నిర్ధారించడం, చేసిన పనిలో నాణ్యత ఉందో లేదో తనిఖీ చేసి ధ్రువీకరించడం, కాంట్రాక్టర్ పెట్టిన బిల్లులను ప్రభుత్వానికి పంపించడం.. ఇలా అన్ని బాధ్యతలనూ ఒకే అధికారికి ప్రభుత్వం అప్పగించింది. కాంట్రాక్టు సంస్థ పైసా పని చేయకున్నా రూ.500 కోట్ల పనిచేసినట్లు బిల్లులు సమర్పించడానికి ఈ అధికారి సహకరించినట్టు పోలవరం ఇంజనీర్లు చెబుతున్నారు. వాస్తవ నివేదికలిచ్చిన ఇంజనీర్‌పై బదిలీ వేటు పోలవరంలో వాస్తవంగా జరుగుతున్న నిర్మాణ ప్రగతిని వివరిస్తూ ఈఈ స్థాయి ఇంజనీర్ ప్రతినెలా ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. గత మూడు నెలలుగా అక్కడ పనులేమీ జరగట్లేదని, చూట్టానికి కొన్ని డొక్కు వాహనాలు అక్కడ ఉంచారని, వాటిల్లో సగం వాహనాలకు టైర్లు కూడా లేవంటూ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఆ నివేదికలను పరిగణనలోకి తీసుకుంటే, కాంట్రాక్టర్‌కు అప్పనంగా రూ.500 కోట్లు బిల్లులు చెల్లించడానికి వీలుకాదని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఆ నివేదికలను బుట్టదాఖలు చేయడమేగాక..ౠ ఈఈపై బదిలీ చేయడం విశేషం. మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపునకు రంగం సిద్ధం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టు సంస్థకు రూ.250 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద చెల్లించింది. కానీ ఆ సంస్థ గత ఏడాదికాలంగా.. అంత మొత్తానికి సరిపడా పనులను కూడా చేయలేదు. కానీ తాజాగా జీవో-22 ప్రకారం మరో రూ.400 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడానికి తమకు అర్హతుందని, ఆమేరకు సొమ్మివ్వాలని కోరుతూ ట్రాన్స్ట్రాయ్ సర్కారుకు లేఖ రాసింది. కాంట్రాక్టర్ అడిగిందే తడవుగా మొబిలైజేషన్ కాంట్రాక్టర్ పెట్టిన రూ.500 కోట్ల బిల్లుతో కలిపి.. మొత్తం రూ.900 కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.