
సాక్షి, అమరావతి: పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో ఏపీ జెన్‌కో నుంచి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద తీసుకున్నది ప్రజాధనమని, ఆ డబ్బు తిరిగి ప్రభుత్వానికి చేరాల్సిందేనని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆ కంపెనీ వందల కోట్ల రూపాయలు తీసుకుని క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించలేదని వివరించారు. ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకే, ఆ సంస్థ బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజాధనాన్ని వెనక్కి తీసుకోవద్దనే అధికారం ఎవరికీ లేదన్నారు. బ్యాంకు గ్యారెంటీల విషయంలో ఆర్బిట్రేషన్ చట్టంలోని సెక్షన్ 9 కింద విజయవాడ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో నవయుగ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎంత మాత్రం విచారణార్హత లేదని ఆయన పునరుద్ఘాటించారు. అసలు ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధే ఆ కోర్టుకు లేదని శ్రీరామ్ వివరించారు.
కమర్షియల్ కోర్టుల చట్టం కింద కమర్షియల్ కోర్టు హోదా ఉన్న న్యాయస్థానంలోనే పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉందన్నారు. మచిలీపట్నం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కోర్టుకు కమర్షియల్ కోర్టు హోదానివ్వడం జరిగిందన్నారు. ఈ కోర్టుకు మాత్రమే నవయుగ పిటిషన్‌ను విచారించే పరిధి ఉందని ఆయన తెలిపారు. బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకోరాదంటూ ఉత్తర్వులు ఇచ్చిన విజయవాడ కోర్టు, కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఏకపక్షంగా వ్యవహరించిందని, అందువల్ల ఆ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఏజీ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం, నవయుగ తరఫు వాదనలు వినడానికి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ జెన్‌కో హైకోర్టులో సివిల్ మిస్లేనియస్ అప్పీల్ (సీఎంఏ) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment