
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులకు అడ్డంకి తొలగిపోయింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఎత్తివేసింది. ఆ పిటిషన్‌పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ గురువారం నిర్ణయం తీసుకోంది. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్త కాంట్రాక్టరుతో ఒప్పందం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అలాగే నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారణ ముగించింది. దీంతో నవయుగ సంస్థకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
విచారణ సందర్భంగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు ఎన్‌క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్‌ను పక్కకు పెట్టింది. దిగువ కోర్టును తప్పుబట్టింది. కాగా, పోలవరం కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండరింగ్‌తో పారదర్శకతకు పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ. 850 కోట్లు ఆదా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment