
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు దక్కించుకున్న నవయుగ పోర్టు లిమిటెడ్.. తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని, అందుకే ఆ కంపెనీతో ఒప్పందాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఏ దశలో కూడా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు వివరించారు.
ప్రాజెక్టు పనులను కనీస స్థాయిలో కూడా ప్రారంభించలేదన్నారు. నిధుల లభ్యతనూ చూపలేదని తెలిపారు. తప్పులన్నీ వారి వైపు పెట్టుకుని, ప్రభుత్వమే ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసుకుందంటూ ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ఒప్పందంలోని నిబంధనలకు అనుగుణం ఏ రోజూ నడుచుకోలేదని తెలిపారు. 5,342 ఎకరాల భూమిని ఏకమొత్తంగా అప్పగిస్తే ఆ భూమిని తాకట్టు పెట్టి తద్వారా నిధులు లభ్యతను చూపుతామని నవయుగ చెప్పిందన్నారు.
సముద్రానికి పక్కనే ఉన్న 2,601 ఎకరాల భూమిని ఇస్తామని చెప్పినా వినిపించుకోలేదన్నారు. నిబంధనల ప్రకారం 2018 మార్చికల్లా నిధుల లభ్యతను చూపాల్సి ఉండగా, అందులో నవయుగ విఫలమైందని, ఇది ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించడమేనని శ్రీరామ్ వివరించారు. పోర్టు పనులు ప్రారంభం కాకపోవడానికి నవయుగ వైఖరే కారణమని.. అందుకే ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దుచేసుకున్నామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని చెప్పారు.
ఏజీ వాదనల కొనసాగింపు నిమిత్తం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందం రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సమర్థిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, నవయుగ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూమి మొత్తాన్ని ఏకమొత్తంగా అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని దమ్మాలపాటి తెలిపారు. దశల వారీగా భూమిని అప్పగిస్తామనడం సరికాదన్నారు. పైపెచ్చు తమకు అప్పగించిన 2,900 ఎకరాల భూమి ఆక్రమణలతో పాటు పలు వివాదాల్లో ఉందన్నారు. ప్రభుత్వమే ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.