
సాక్షి, అమరావతి: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ఇతరులెవరికీ అప్పగించకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని నవయుగ పోర్ట్ లిమిటెడ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎ.వి.రవీంద్రబాబు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్ లిమిటెడ్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ను మంగళవారం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం నవయుగ పోర్ట్ లిమిటెడ్‌కి ఏ మాత్రం లేదని, అందుకే ఒప్పందంలోని నిబంధనలను బేఖాతరు చేస్తూ వచ్చిందని చెప్పారు.
రాయితీల కల్పనకు ఉద్దేశించిన స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ (ఎస్‌ఎస్‌ఏ) ఖరారు విషయంలో కూడా ఆ సంస్థ ఏ మాత్రం చొరవ చూపలేదన్నారు. భూములన్నీ ఒకేసారి అప్పగించాల్సిన అవసరం లేదని, ఇలా అప్పగించాలని ఒప్పందంలో ఎక్కడా లేదని తెలిపారు. ప్రస్తుతం ఏ భూములు కూడా నవయుగ పోర్ట్ లిమిటెడ్ స్వాధీనంలో లేవని చెప్పారు. ఈ పోర్టు నిర్మాణంలో విస్తృత ప్రజాప్రయోజనాలు, భారీ ప్రజాధనం ముడిపడి ఉన్నట్లు తెలిపారు.
అందువల్ల ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. శ్రీరామ్ వాదనలకు నవయుగ పోర్ట్ తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం ప్రకారం నడుచుకోలేదన్నారు.
ఒప్పందం ప్రకారం అప్పగించాల్సిన భూములను అప్పగించలేదని తెలిపారు. సింగిల్ జడ్జి తీర్పు నేపథ్యంలో పోర్టు నిర్మాణ పనులను ఇతరులకు అప్పగించే ఆస్కారం ఉందన్నారు. అందువల్ల యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment