సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పోలవరం ప్రాజెక్టును అక్షయపాత్రగా మార్చుకున్నారనడానికి మరో తార్కాణం ఇది! కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ఎన్నికలకు నిధులు సమకూర్చు కుంటూ మరో భారీ స్కామ్‌కు తెర తీశారు. పోలవరం హెడ్‌వర్క్స్(జలాశయం) పనులకు సంబంధించి పాత ధరల ముసుగులో మూడు విడతలుగా రూ.3,498.12 కోట్ల విలువైన పనులను నిబంధనలకు విరుద్ధంగా నవయుగ సంస్థకు నామి నేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. తాజా ధరల ప్రకారం ఆ పనులకు బిల్లుల కింద రూ.8,733.37 కోట్లను చెల్లించనున్నారు. అంటే పాత ధరల ముసుగులో కాంట్రాక్టర్‌కు రూ.5,235.25 కోట్ల ప్రయోజనం చేకూర్చిన ప్రభుత్వ పెద్దలు.. ఇందుకు ప్రతిఫలంగా పోలవరం హెడ్‌వర్క్స్ చీఫ్ ఇంజనీర్ పీడీ (వ్యక్తిగత ఖాతా)లోని రూ.550 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి, వాటినే తిరిగి కమీషన్లుగా వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వ పెద్దలు భారీగా ఇం‘ధనం’ సమకూర్చుకోవడంలో భాగంగా ఖజానాను కొల్లగొడుతుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా పీడీ ఖాతాలో రూ.550 కోట్లు
పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకున్న తర్వాత హెడ్‌వర్క్స్ ప్రధాన కాంట్రాక్టరైన టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ మూడు విడతలుగా హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు మినహా మిగతా పనులన్నీ నవయుగ సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. దీంతో హెడ్‌వర్క్స్ నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ని సర్కార్ పూర్తిగా తప్పించేసింది. అయితే ఆ సంస్థ ప్రభుత్వం నుంచి తీసుకున్న మొబిలైజేషన్ అడ్వాన్సులకుగానూ.. బీజీ (బ్యాంకు గ్యారెంటీలు) రూపంలో రూ.380 కోట్లు, ఎస్‌డీ (సెక్యూరిటీ డిపాజిట్లు) రూపంలో రూ.170 కోట్లను జలవనరులశాఖ వద్ద డిపాజిట్ చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేసిన నేపథ్యంలో ఆ సంస్థ నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వసూలు చేయాల్సిన డబ్బులకు సంబంధించి బీజీ, ఎస్‌డీలను నగదుగా మార్చుకున్న పోలవరం చీఫ్ ఇంజనీర్ నిబంధనలకు విరుద్ధంగా పీడీ ఖాతాలో రూ.550 కోట్లను జమ చేశారు.
మరో విడత కమీషన్ల కోసం...
పోలవరం హెడ్‌వర్క్స్‌లో నామినేషన్‌పై రూ.8,733.37 కోట్ల విలువైన పనులను, టెండర్ల ద్వారా రూ.5,358.23 కోట్ల విలువైన జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులనూ నవయుగ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. అంటే.. ఒకే ప్రాజెక్టులో రూ.14,091.6 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ పెద్దలు భారీ ఎత్తున నిధుల సమీకరణలో నిమగ్నమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నవయుగ సంస్థ నుంచి మరో విడత కమీషన్లు వసూలు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
పీడీ ఖాతాలోని నిధులు నవయుగకు!
ఈ క్రమంలోనే ట్రాన్స్‌ట్రాయ్ నుంచి వసూలు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సులపై నవయుగ కళ్లు పడ్డాయి. పోలవరం చీఫ్ ఇంజనీర్ పీడీ ఖాతాలోని నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇప్పిస్తే.. వాటినే కమీషన్లుగా ముట్టజెప్పేలా ప్రభుత్వ పెద్దలతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందంలో భాగంగానే పీడీ ఖాతాలోని రూ.550 కోట్లను నవయుగకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే కీలక అధికారి ఒకరు చెప్పారు.
ముందు డబ్బులివ్వండి... తర్వాత ఆమోదిస్తాం!
నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించిన కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సీఎం చంద్రబాబు తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. తక్షణమే రూ.550 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇవ్వాలని, ఆ తర్వాత దీనికి కేబినెట్‌లో ఆమోదముద్ర వేస్తామని ఒత్తిడి తెస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలవరం చీఫ్ ఇంజనీర్ పీడీ ఖాతాలోని రూ.550 కోట్లను నవయుగకు నేడో రేపో మొబిలైజేషన్ అడ్వాన్సుగా ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment