జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్,గుంటూరు బార్ అసోసియేషన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంయుక్త ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జి మోడల్ పరీక్ష శుక్రవారం ఉదయం గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరీక్ష పత్రాలను రెండో అదనపు జిల్లా జడ్జి వి.నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైతే సమాజానికి తమవంతు సహాయ సహకారాలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు మోడల్ పరీక్ష నిర్వహించేందుకు తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐలు జిల్లా కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష నిర్వహించే వరకు ప్రతి శని, ఆదివారాలు సెలవు దినాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు శిక్షణ తరగతులు కొనసాగిస్తామని తెలిపారు.
మోడల్ టెస్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురికి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.భాస్కరరావు బహుమతులు అందజేశారు. అనంతరం అభ్యర్థులకు న్యాయమూర్తి భాస్కరరావు కాంట్రాక్ట్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే అంశాలపై తరగతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఐలు జిల్లా అధ్యక్షుడు కట్టా కాళిదాసు, బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి ఏపీ లాలి పర్యవేక్షించారు.