జెసికాలాల్ హత్య కేసులో మనుశర్మకు పెరోల్
న్యూఢిల్లీ: మోడల్ జెసికాలాల్ హత్య కేసులో నిందితుడు మనుశర్మకు ఢిల్లీ హైకోర్టు 15 రోజులపాటు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుగ్రాడ్యుయేట్ పరీక్షలకు హాజరు కావడానికి పెరోల్ ఇవ్వాలన్న అతని విజ్ఞప్తిని అంగీకరించింది. ఇందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు రూ.50 వేల వ్యక్తిగత బాండు సమర్పించాలని ఆదేశించింది. పెరోల్ సమయంలో ఢిల్లీని విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. జెసికా నివాసం, వాళ్ల కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేసింది. తాను ఈ నెల 19 నుంచి 24 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ హ్యూమన్రైట్స్లో పరీక్షలు రాయాల్సి ఉందని శర్మ కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు కూడా ఉందని తెలిపాడు.
జైలులో శర్మ ప్రవర్తన సంతృప్తికరంగా ఉందని, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కూడా ధ్రువీకరించారని ఇతని న్యాయవాదులు అర్పితా బాత్రా, ఎస్.నంద్రజోగ్ కోర్టుకు విన్నవించారు. ఖైదీల చిన్నారులకు చదువు చెప్పించేందుకు శర్మ తన స్వచ్ఛందసంస్థ సిద్ధార్థ్ వశిష్ట్ చారిటబుల్ ట్రస్ట ద్వారా ఎంతో కృషి చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు అందుకున్నాడని వివరించారు. అయితే 2009లో శర్మకు పెరోల్ ఇచ్చినప్పుడు ఇతని ప్రవర్తన సక్రమంగా లేనందున, ఈసారి మంజూరు చేయవద్దని పోలీసులు కోరారు. మాజీ కేంద్రమంత్రి వినోద్శర్మ కొడుకు అయిన మనుశర్మ 1999లో జెసికాలాల్ను రెస్టారెంటులో కాల్చిచంపాడు. దీంతో ఇతనికి యావజ్జీవ శిక్ష విధించారు.