హలో.. సీఎం కేసీఆర్‌ను మాట్లాడుతున్న...
* ‘సాక్షి’ఇన్‌బాక్స్ లేఖకు స్పందించిన ముఖ్యమంత్రి
* హుజూరాబాద్వాసికి ఫోన్
* మోడల్ చెరువు నిర్మాణంపై హామీ
* అధికారుల ఉరుకులు పరుగులు
హుజూరాబాద్: ‘‘హలో నేను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాట్లాడుతున్న... ప్రతాప శాయిరెడ్డి గారూ బాగున్నారా... మీ హుజూరాబాద్‌కు సంబంధించిన మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలని ‘సాక్షి’ పత్రికకు రాసిన లేఖను చూశాను. ఈ చెరువు కోసం రూ.60 కోట్లు మొన్ననే కేటాయించినం. ఇంకా పనులు మొదలు పెట్టలే. కచ్చితంగా పనులు ప్రారంభించి, అతి త్వరలోనే దీని ఓపెనింగ్‌కు నేనే వస్తా. గా ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుస్తా.. ’’ అంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం హుజూరాబాద్‌లోని ప్రతాపవాడకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రతాప శాయిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు ద్వారా ప్రతాప శాయిరెడ్డి ఫోన్ నంబర్ తెలుసుకున్న సీఎం ఆయనతో మాట్లాడారు.
కేసీఆర్ మాట్లాడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సీఎంవో కార్యాలయం నుంచి అధికారులు, స్థానిక అధికారులు సైతం శాయిరెడ్డితో మాట్లాడటం విశేషం. హుజూరాబాద్ పట్టణ శివారులో ఉన్న మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చాలనే డిమాండ్ దశాబ్ద కాలంగా వస్తోంది. దీనిని రిజర్వాయర్‌గా మార్చితే పట్టణ ప్రజలకు తాగునీటితోపాటు చుట్టుపక్కల వ్యవసాయభూమికి సాగునీటి సమస్య తీరుతుంది. గత ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదని, ఇప్పుడైనా పట్టించుకోవాలని రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రతాప శాయిరెడ్డి(82) పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
నగర పంచాయతీ, తహశీల్దార్, మంత్రి, ముఖ్యమంత్రిలకు కూడా లేఖలు రాశారు. స్పందన లేకపోవడంతో ‘సాక్షి’ దినపత్రికకు కూడా ఒక లేఖ రాశారు. ఇది ఆదివారం నాటి ఎడిటోరియల్ పేజీలోని ‘ఇన్‌బాక్స్’లో ప్రచురితమైంది. దీనిని చూసిన సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ప్రతాప శాయిరెడ్డికి ఫోన్ చేశారు. అంతేకాకుండా, మోడల్ చెరువు గురించి సీఎం, మంత్రి ఈటెల రాజేందర్ కార్యాలయాల నుంచి అధికారులకు కూడా సమాచారం వచ్చింది. ఈ క్రమంలో హుజూరాబాద్ తహశీల్దార్ బండి నాగేశ్వర్రావు ప్రతాప శాయిరెడ్డితో మోడల్ చెరువు గురించి చర్చించారు. నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి బ్రహ్మచారి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి రజిత, కౌన్సిలర్ చింత శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్లపల్లి రమేశ్‌గౌడ్, నాయకులు కొలిపాక శ్రీనివాస్, ఆకుల సదానందం కలిసి మోడల్ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ చెరువు విస్తీర్ణం 111.24 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు.Follow @sakshinews