Mohamed Nasheed
-
స్పీకర్‌గా ఆ దేశ మాజీ అధ్యక్షుడు
మాలీ: మాల్దీవులు రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్‌గా మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీ నషీద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికుంటున్నట్లు ప్రకటించింది. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడిగా 2008-2012 కాలంలో నషీద్ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్ నషీద్ కావడం విశేషం. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్ 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహీం మహ్మద్ నల్హీ అఖండ విజయం సాధించారు. దీంతో కొత్తగా స్వీకర్‌ను ఎన్నుకోవల్సి ఉంది. -
మహ్మద్ నషీద్‌కు ఊరట
జెనీవా: మాల్దీవులు మాజీ ఆధ్యక్షుడు మహ్మద్ నషీద్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఊరటనిచ్చింది. నషీద్‌పై 16 సంవత్సరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని యూఎన్‌హెచ్‌ఆర్‌సి తెలిపింది. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారానికి దూరమైన నషీద్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. సోమవారం సమావేశమైన సివిల్, రాజకీయ హక్కుల స్వతంత్ర కమిటీ మాజీ అధ్యక్షుడిపై ఆరోపణలు అస్పష్టంగా ఉన్నందున ఆయనపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ... తదుపరి ఎన్నికల్లో పోటికి అనుమతినిచ్చింది. ‘రాజకీయ హక్కులు కేవలం అసాధారణమైన, నిర్థిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే నియంత్రించబడతాయి. న్యాయ విచారణ పేరిట నషీద్ రాజకీయ హక్కులను నియంత్రించడం సబబు కాదు’ అని కమిటీ సభ్యుడు సారా క్లెవ్యాండ్ ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్ 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తన అనారోగ్య పరిస్థితుల రీత్యా వైద్య సేవల కోసం ప్రస్తుతం బ్రిటన్‌లో చికిత్స పొందుతున్నారు. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్ నషీద్ కావడం విశేషం. కాగా ప్రస్తుత ఆధ్యక్షుడు అబ్దుల్ యామీన్ మాల్దీవులులో అత్యయిక పరిస్థితిని విధించారు. తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలను విడుదల చేయవలసిందిగా అబ్దుల్ యమీన్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రతిపక్ష నేతలను ఆయన జైలులో నిర్భంధించిన విషయం తెలిసిందే. -
మాజీ అధ్యక్షుడికి వారెంట్
మాలే: అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడన్న కేసులో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌కు అరెస్టు వారెంట్ జారీ అయింది. ప్రజాస్వామ్య దేశంగా మాల్దీవులు అవతరించిన తర్వాత ఎన్నికైన మొదటి అధ్యక్షుడు నషీద్. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రుజువవడంతో గతేడాది మార్చిలో నషీద్‌కు జైలు శిక్ష విధించారు. అయితే ఈ శిక్షను అంతర్జాతీయ స్థాయిలో పలువురు ఖండించారు. అనంతరం అనారోగ్య కారణాలతో నషీద్ ఏడాది కాలంపాటు ఇంగ్లండ్‌లో చికిత్స పొందాడు. ఇటీవలే మాల్దీవులు వచ్చిన నషీద్‌కు తాజాగా నిధుల దుర్వినియోగం కేసులో క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. -
చిన్న దేశం.. పెద్ద సంక్షోభం
మతోన్మాదం, ప్రజాస్వామ్యం పట్ల బద్ధవైరం కలగలసి ఇప్పుడు మాల్దీవులను కల్లోలానికి గురి చేస్తున్నాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అరెస్ట్ (ఫిబ్రవరి 22, 2015), 13 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ వచ్చిన తీర్పు (మార్చి 13, 2015), వీటిని నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతున్నాయి. మూడు ద శాబ్దాల పాటు నియంతృత్వంతో పాలించిన అబ్దుల్ గయూం మీద పోరాడి, తొలిసారి (2008) ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహ్మద్ నషీద్. మాల్దీవియన్ డెమాక్రటిక్ పార్టీ తరఫున ఆయన ఆ పదవికి ఎంపికయ్యాడు. ఆ క్రమంలో ఆయన ఎన్నోసార్లు అరె స్టయ్యి, జైలు పాలైనాడు. ఆయన మీద నమోదైన అభియోగం- ఉగ్రవాదానికి ప్రోత్సాహం. అందుకే 1990 నాటి ఉగ్రవాద చట్టం ప్రకారమే మల్దీవుల న్యాయస్థానం ఈ మాజీ అధ్యక్షుడిని విచారించింది. 2012లో అబ్దుల్లా మహ్మద్ అనే ఒక న్యాయమూర్తిని నషీద్ అరెస్టు చేయించిన మాట నిజమే. అయితే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను బట్టి నషీద్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దానినే కిడ్నాప్ అభియోగంగా మోపి ఈ శిక్ష విధించారు. ఇతర ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు కూడా న్యాయస్థానం ఆరోపణలు చేసింది. ఇరవై దీవులతో, నాలుగు లక్షలలోపు జనాభాతో పర్యాటకుల స్వర్గధా మంగా వెలుగొందుతున్న మాల్దీవుల అంతరంగ చిత్రం నిజానికి వికృతమైనది. అబ్దుల్ గయూం నియంతృత్వానికి చరమగీతం పాడి, అధికారంలోకి వచ్చిన నషీద్ ఫిబ్రవరి, 2012లో ఆ దేశ టీవీ చానెళ్ల ఎదుట కనిపించి, తాను స్వచ్ఛం దంగా రాజీనామా చేస్తున్నట్టు నాటకీ యంగా ప్రకటించారు. అయితే వెంటనే తనను తుపాకీతో బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. తరువాత అన్నీ ఒక్కొక్కటే బయటపడ్డాయి. పోలీసు యంత్రాంగం సాయం తో, సైన్యం నషీద్‌ను పదవీచ్యుతుడిని చేసింది. తరువాత 2013లో జరిగిన ఎన్నికలలో నషీద్ పైచేయి సాధించినట్టు వెల్లడైన ప్రతిసారి ఆ దేశ ఉన్నత న్యాయస్థానం దానిని నిరాకరిస్తూ వచ్చింది. చివరికి స్వల్ప ఆధిక్యంతో గెలిచిన అబ్దుల్ యామీన్ పాలకుడయ్యారు. ఈయన అబ్దుల్ గయూం సన్నిహిత బంధువే. ఆ ఇద్దరి తల్లులు వేరు, తండ్రి ఒక్కరే. ఒక్కొక్క అంశం వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో నషీద్ 2013 ఫిబ్రవరి నుంచి రాజధాని మాలె లోని భారత రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. న్యాయమూ ర్తి కిడ్నాప్ కేసుతోపాటు, ఆయన ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించాడని ప్రభు త్వం ఆరోపించింది. అతడు ఇస్లాంకు వ్యతిరేకి అని, నిజానికి రహస్య క్రైస్త వుడని కూడా ముద్రవేశారు. ప్రస్తుత పరిణామాల మీద భారత్‌తోపాటు, అమె రికా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మాజీ అధ్యక్షుడు అయినప్పటికీ నషీద్‌ను సాధారణ నేరగాడిని ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి తీసుకువెళ్లడం ప్రపంచాన్ని నివ్వెరపోయేటట్టు చేసింది. దీనితో మాల్దీవుల ప్రజానీకమే కాకుండా, చాలా దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. మాల్దీవుల విపక్ష శిబిరంలో నషీద్ ఇప్పటికీ ప్రముఖుడు. ఎక్కువ దీవులలో ఆయన పట్లే ఆదరణ ఉంది. దీనికి తోడు ప్రస్తుతం అధికారంలో ఉన్న యామీన్‌ను అభిశంసించే యోచన ఉన్నట్టు తాజాగా వదంతులు గుప్పుమనడంతో ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది. ఇదంతా 2018లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో నషీద్‌ను పోటీ లేకుండా చేయడానికేనని ఒక మాట ఉంది. గతంలో నషీద్‌ను బంధించి ఉంచిన ధూనిధూ ద్వీపానికే తీసుకువెళ్లారు. కేసును వాదిస్తుండగానే ఆయన న్యాయవాదిని కూడా బయటకు గెంటేశారు. అయితే ఆయన దేశం నుంచి పారిపోకుండా జాగ్రత్త పడే క్రమంలోనే అరెస్టు చేయడం జరిగిందని దేశాధ్యక్షుడు ప్రకటన ఇవ్వడం విశేషం. నషీద్ పట్ల యామీన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకతను పెంచుకున్నదంటే, ఆయన హయాంలో మాలే విమానాశ్రయానికి సంబంధించి, జీఎంఆర్ సంస్థకు వచ్చిన పనులను మొన్న సెప్టెంబర్‌లో రద్దుచేసింది. ఈ అంశం మీద జీఎంఆర్కూ, యామీన్ ప్రభుత్వానికీ మధ్య సింగపూర్ కోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తున్నది. మాలే విమానాశ్రయం అభివృద్ధికి 500 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను నషీద్ సర్కారు ఇచ్చింది. మాల్దీవులు చిన్న దేశమే కావచ్చు. కానీ అక్కడ జరిగిన పరిణామం మతోన్మాదానికీ, ఉగ్రవాదానికీ మద్దతు ఇచ్చే క్రమంలో జరిగింది. అందుకే నషీద్ ఉదంతం ఇంత సంచలనం సృష్టించింది. -
మాల్దీవుల అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నిక
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఆర్థికవేత్త అబ్దుల్లా యమీన్(54) ఎన్నికయ్యారు. మాజీ నియంతృత్వ పాలకుడు మౌమూన్ గయూమ్‌కు సవతి సోదరుడైన అబ్దుల్లా ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అభ్యర్థిగా పోటీచేసి 51.39 శాతం ఓట్లు సాధించి, ఊహించని విజయం సొంతం చేసుకున్నారు. సమీప ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌కు 48. 61 శాతం ఓట్లు లభిం చాయి. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లోనూ మెజారిటీ సాధించిన నషీద్ ఈ పరాజయం ఊహించలేదు. ఆ రెండు పర్యాయాలు కూడా 50 శాతం ఓట్లు సాధించకపోవడంతో ఆయనను విజేతగా ప్రకటించలేదు. మజ్లిస్(మాల్దీవుల పార్లమెంట్)లో అబ్దుల్లా ఆదివారం ప్రమాణస్వీకారం చేస్తారు. -
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు 16కు వాయిదా
మాలే: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల తుది అంకం వారంపాటు వాయిదా పడింది. శనివారం జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఎవరికీ అవసరమైన మెజారిటీ(50 శాతం ఓట్లు) రాకపోవడంతో ఆదివారం మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఎన్నికలు జరిగిన మరుసటిరోజే మళ్లీ ఎన్నికలు జరిపితే ప్రజల రాజ్యాంగ హక్కులను బలహీనపరచినట్లవుతుందని కోర్టు ఆదివారం వేకువజామున ఇచ్చిన తీర్పులో పేర్కొంది. శనివారం నాటి ఎన్నికల్లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అధినేత, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌కు 46.4 శాతం, మాల్దీవ్స్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఆయన సమీప ప్రత్యర్థి అబ్దుల్లా యామీన్‌కు 30.3 శాతం, జుమ్‌హూరీ పార్టీ అభ్యర్థి గాసిమ్ ఇబ్రహీమ్‌కు 23.4 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో తన మద్దతుదారులు నషీద్, యామీన్లలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని ఇబ్రహీం కోర్టును కోరారు. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడం రెండు నెలల్లో ఇది మూడోసారి. సెప్టెంబర్ 7 నాటి ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికీ పూర్తి మెజారిటీ రాకపోవడం తెలిసిందే. కాగా, ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ఆదివారంతో పూర్తయింది కనుక అధ్యక్ష స్థానంలో ఉన్న మహమ్మద్ వహీద్ పాలనలో ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఆయన రాజీనామా చేయాలని నషీద్ డిమాండ్ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు వహీదే అధ్యక్షుడిగా కొనసాగాలని సుప్రీంకోర్టు శనివారం సూచించింది. -
భారత రాయబారి వాహనంపై దాడిని ఖండించిన మహమ్మద్ నషీద్
మాల్దీవుల రాజధాని మాలెలో భారత రాయబారి రాజీవ్ షహరి వాహనంపై నిన్న సాయంత్రం ఆగంతకులు రాళ్ల దాడిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటన వెంటనే విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ఘటనకు పాల్పడిన ఆగంతకుల చర్యను మతిలేని చేష్టలుగా వ్యాఖ్యానించారు. మాలెలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఆగి ఉన్న రాజీవ్ షహరి వాహనంపైన మొటర్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి రాళ్ల దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని, కానీ రాళ్ల దాడితో కిటికి అద్దాలు పగిలిపోయాయని, అలాగే కారు ధ్వంసమైందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో నషీద్ ముందంజ
మాలె: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తొలి రౌండ్లో ముందంజలో కొనసాగారు. అయితే, ఆయనకు కీలకమైన 50 శాతం మెజారిటీ లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో దేశంలోని మొత్తం 2.30 లక్షల ఓటర్లలో 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 470 బ్యాలట్ బాక్సుల్లో 315 బాక్సుల్లోని ఓట్లను లెక్కించారు. ప్రారంభంలో నషీద్ గణనీయంగా ముందంజలోనే ఉన్నా, తర్వాత స్వల్పంగా వెనుకబడ్డారు. ఇప్పటిదాకా నషీద్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. నిబంధనల ప్రకారం అభ్యర్థులెవరికీ 50 శాతం ఓట్లు లభించనట్లయితే, తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల నడుమ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.