మాలె: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ తొలి రౌండ్‌లో ముందంజలో కొనసాగారు. అయితే, ఆయనకు కీలకమైన 50 శాతం మెజారిటీ లభించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో దేశంలోని మొత్తం 2.30 లక్షల ఓటర్లలో 70 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 470 బ్యాలట్ బాక్సుల్లో 315 బాక్సుల్లోని ఓట్లను లెక్కించారు. ప్రారంభంలో నషీద్ గణనీయంగా ముందంజలోనే ఉన్నా, తర్వాత స్వల్పంగా వెనుకబడ్డారు. ఇప్పటిదాకా నషీద్‌కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. నిబంధనల ప్రకారం అభ్యర్థులెవరికీ 50 శాతం ఓట్లు లభించనట్లయితే, తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల నడుమ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.