Mohana Rao
-
తండ్రిని చంపిన తనయుడు
నాగాయలంక (అవనిగడ్డ): చెడు వ్యసనాలకు బానిసైన ఓ కొడుకు అప్పులు తీర్చేందుకు ఇంటి స్థలం విక్రయించ లేదని తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బండే హరిమోహనరావు(48) భార్య 20 ఏళ్ల కిందటే చనిపోయింది. కుమార్తెకు వివాహం చేశారు. 25 సంవత్సరాల కుమారుడు పవన్ కల్యాణ్ ఇదే గ్రామంలోని అమ్మమ్మగారి ఇంటివద్ద ఉంటున్నాడు. దీంతో చిన్న పూరిపాకలో హరిమోహనరావు ఒక్కడే నివసిస్తున్నాడు. కొడుకు పవన్ కల్యాణ్ చెడు వ్యసనాలకు బానిసగా మారి తెలిసిన వారందరి దగ్గర అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికి హరిమోహనరావు ఉంటున్న ఇంటి స్థలాన్ని విక్రయించాల్సింగా తరచూ గొడవపడుతున్నాడు. దీనికి తండ్రి అంగీకరించడంలేదు. దీనిని మనసులో పెట్టుకున్న పవన్‌కల్యాణ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తండ్రి ఉంటున్న ఇంటికి వచ్చి గొడవపడి బలమైన ఆయుధంతో అతని తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఆపై డీజిల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి పారిపోయాడు. హరిమోహనరావు మృతదేహం ఇంట్లోనే మంచంపై పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
సిక్కోలులో కలకలం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ, ఎఫ్ఏసీ)గా పనిచేస్తున్న తూతిక మోహనరావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగవారం దాడులు చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురంలలో మంగళవారం తెల్లవారుజాము నుంచి మోహనరావు ఇళ్లపై దా డులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆదా యానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఈఈ స్థిరాస్తులు, బంగారం, వెండి, గృహోపకరణాలు, గృహాలంకరణ, నగదు అంతా కలిపి ప్రస్తుత మార్కెట్ విలువను అంచనా వేశారు. దీని ప్రకారం మొత్తం రూ.10కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు డీఎస్పీ విలేకరులకు తెలిపారు. దీనిలో బంగారం580 గ్రాములు విలువ రూ.27లక్షలుగాను, వెండి రెండు కేజీలు రూ.1.50లక్షలుగాను, గృహాలంకరణాల విలువ రూ.16లక్షలు, ఆయన ఇంట్లో నగదు రూ.7లక్షలు, బ్యాంక్ ఖాతాలో రూ.30లక్షలున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తూతిక మోహనరావు వాస్తవానికి డిప్యూ టీ ఇంజనీర్ (డీఈ) కేడర్‌లో పార్వతీపురం, ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు. ఈయన గతంలో సీతంపేట, నర్సీపట్నంలలో ఐటీడీఏల్లో డీఈగా కూడా పనిచేశారు. అనంతరం పార్వతీపురంలో ఈఈ పోస్టు ఖాళీగా ఉండడంతో విషయం తెలుసుకున్న మోహనరావు తన పలుకుబడితో ఈఈగా అదనపు బాధ్యతలు చేపట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోహనరావు ఇంట్లో దస్త్రాలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు సిక్కోలులో కలకలం శ్రీకాకుళం నగరంలోని ఎల్బీఎస్ కాలనీలో సొంత నివాసంలో ఉంటున్న మోహనరావుకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో కూడా అద్దె ఇల్లు కూడా ఉంది. ఈ ఇళ్లల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి మంగళవారం దాడులు నిర్వహించారు. తెల్లవారు జామునే పార్వతీపురంలో తొలుత దాడులు చేశారు. అనంతరం మోహనరావును శ్రీకాకుళంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో మోహనరావు ఇళ్లల్లో పెద్ద మొత్తంలో నగదు, వెండి, బంగారం, విలువైన ఆస్తుల పత్రాలు గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురంలో ఆయన ఉన్న అద్దె ఇంటిలో రూ.3.5 లక్షలు, శ్రీకాకుళంలో రూ.3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తాం: ఏసీబీ డీఎస్పీ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న తూతిక మోహనరావును బుధవారం విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సాక్షికి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు మహేశ్వరరావు, భాస్కర్, సత్యారావులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సింగూరు ఇసుక ర్యాంపు తాత్కాలికంగా మూసివేత ఆమదాలవలస రూరల్: పొందూరు మండలం సింగూరు ఇసుక ర్యాంపును తాత్కాలికంగా మూసివేశారు. సింగూరు రెవెన్యూలో సేకరించిన ఇసుకను దూసిలో నిల్వ చేసి అవసరాలకు ఏపీఎండీసీ ద్వారా తరలించేవారు. ఇసుక ర్యాంపుపై ఇటీవల పోలీసులు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు హరనాథరావు, భరత్, వాసులతో పాటు ముగ్గురు మైన్స్ అధికారులపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిపై కేసులు నమోదు చేయడంతో ర్యాంపులో ఉన్న వారు భయపడి ర్యాంపును ఆపేసినట్లు తెలిపారు. అందుకే ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇసుక ర్యాంపులో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా విధు ల నుంచి అధికారులు తొలగించారు.ఇసుక ర్యాంపు నిర్వహణలో వారి విధానాల వల్ల అక్రమంగా ఇసుక తరలిపోయినట్లు గుర్తించిన మైన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి మోహన్‌రావు
⇒ జగన్ పోరాటానికి ఆకర్షితుడినై పార్టీలో చేరానని వెల్లడి ⇒ వైఎస్ జగన్‌ను సీఎం చేయాలన్నదే లక్ష్యం సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కేవీసీహెచ్ మోహనరావు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన అనుచరులతో వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులకు జగన్.. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ముఖ్యనేతలు చలమశెట్టి సునీల్, పెండెం దొరబాబు (మాజీ ఎమ్మెల్యే), ఇతర నేతలు అనంతబాబు, చెన్ను పెద్దిరాజు, కర్రి వెంకటరమణ హాజరయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మోహన్‌రావు చేరికతో ఆ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూరిందని భావిస్తున్నారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ రాజీలేని పోరాటం : మోహనరావు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేతా చేయని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని వైఎస్ఆర్సీపీలో చేరిన మోహనరావు ప్రశంసించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేస్తున్న పోరాటానికి తాను ఆకర్షితుడనై అనుచరులతో సహా పార్టీలో చేరానన్నారు. పేద, బడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలన్నీ అమలు చేయగల సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం గట్టిగా కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కూడా గెలిపిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. పెండెం దొరబాబు మాట్లాడుతూ మోహనరావు చేరికతో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. అక్కడ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. -
జిల్లా పరిషత్ సీఈఓకు బదిలీ
విజయనగరం ఫోర్ట్: జిల్లా పరిషత్ సీఈఓ నేపల మోహనరావుకు బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో సీఈఓగా గనియా రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. మోహనరావు జిల్లా పరిషత్ సీఈఓగా 2012 జూలై 5వతేదీన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో రెండేళ్ల నాలుగు నెలల పాటు పనిచేశారు. ఈయనకు ఇంకా పోస్టు కేటాయించాల్సి ఉంది. నూతన సీఈఓగా నియమితులైన రాజకుమారికి ఇదివరకే జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది. విజయనగరం ఆర్డీఓగా, డీసీసీబీలో ఆమె ఇక్కడ పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్నారు. -
ఉన్నంతలోనే ఉన్నత సేవలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాటితోనే ఉన్నతస్థాయి సేవలు అందించడానికి అగ్నిమాపక, విపత్తుల నియంత్రణ శాఖ శాయశక్తులా కృషి చేస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం.. పైగా వచ్చే నెలంతా తుపాన్ల సీజన్. అదే సమయంలో దీపావళి పండుగ వస్తోంది. కీలకమైన ఈ సమయంలో ప్రాణ, ఆస్తుల రక్షణకు తామున్నామంటూ ఆ శాఖ భరోసా ఇస్తోంది. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి (డీఎఫ్‌వో) జె. మోహనరావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే.. సిబ్బంది కొరత మా శాఖకు సిబ్బంది కొరత ప్రధాన ప్రతిబంధకంగా ఉంది. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పాలకొండ, రణస్థలం, రాజాం, కోటబొమ్మాళి, టెక్కలి, కొత్తూరు, పలాస, సోంపేట, ఇచ్చాపురాల్లో ప్రభుత్వ ఫైర్స్టేషన్లు ఉన్నాయి. పొందూరు, మందసల్లో ఔట్సోర్సింగ్ ఫైర్స్టేషన్లు (బయట వసతుల అగ్నిమాపక కేంద్రం) ఉన్నాయి. మొత్తం 14 ఫైర్స్టేషన్లకు 15 ఫైరింజన్లు, రెండు మిస్టింజన్లు (సందుల్లోకి సైతం వెళ్లగలిగే చిన్న తరహా ఇంజిన్లు) ఉన్నాయి. 129 ఫైర్‌మెన్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 86 మంది ఉన్నారు. 40మంది హోంగార్డులున్నారు. స్టేషన్ ఫైర్ అధికారి, డ్రైవర్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, అడ్మిన్ జేఆర్ విభాగాల్లో మొత్తం ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పని చేసేందుకు వీలుగా పోర్టబుల్ పంప్‌సెట్లతో పాటు లైఫ్ జాకెట్లు, డ్రాగన్ లైట్లు, తాళ్లు, నిచ్చెన లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయి. అయితే రెండు నెలలుగా హోంగార్డులకు జీతాల్లేవు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందులున్నాయి. అయితే అవి తాత్కాలికమే. రెండు అద్దె స్టేషన్లు పొందూరు మార్కెట్ యార్డు, మందస ఎంపీడీవో కార్యాలయాల ఆవరణల్లో రెండు అద్దె ఫైర్స్టేషన్లు ఉన్నాయి. అప్పట్లో ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ద్వారా వీటిని కేటాయించాల్సివచ్చింది. అర్హులైన సిబ్బందికి తర్ఫీదు ఇచ్చి ఆ శిక్షణకు అయ్యే ఖర్చు టెండరుదారే భరించే విధంగా చట్టం తెచ్చారు. ఫైరింజిన్, నీళ్లు, ఇతర సదుపాయాలు కూడా యజమానే భరించాలి. అక్కడి సిబ్బందికి నేవీ బ్లూ యూనిఫారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఖాకీ యూనిఫారం కూడా వేసుకుంటారు. ఒక్కో ఫైర్ స్టేషన్లో నిబంధనల మేరకు 10మంది ఫైర్మెన్లు, ఇద్దరు లీడింగ్ ఫైర్మెన్లు, ముగ్గురు డ్రైవర్ ఆపరేటర్లు, ఒక స్టేషన్ అధికారి ఉండాల్సిందే. వీరి జీతభత్యాలనూ యజమానే భరిస్తారు. ఫైర్ స్టేషన్ నిర్వహణ, జీతభత్యాలు, మరమ్మతులు, ఇంజిన్ కొనుగోలు సంబంధిత అంశాలకు సంబంధించి ఏడాదికి సుమారు రూ.15 లక్షల నుంచి 19 లక్షల వరకు ప్రభుత్వం టెండర్‌దారుకు ఇస్తుంది. ఈ స్టేషన్ల పరిధిలో ఎక్కడ ఏ ప్రమాదం సంభవించినా అక్కడి సిబ్బంది, ఇంజిన్లే సహాయ చర్యలు చేపడుతుంటారు. పెద్ద స్టేషన్, సౌకర్యాలు అవసరమే పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఓ ఫైర్‌స్టేషన్ అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా నివేదించాం. వాస్తవానికి పోలీస్ శాఖ మాదిరిగా ప్రతి మండల కేంద్రంలో ఫైర్‌స్టేషన్ ఉంటే బాగుంటుంది. గతంలో నాగార్జున అగ్రికమ్ సంస్థలో భారీగా మంటలు చెలరేగినప్పుడు విశాఖ నుంచి ప్రత్యేక వాహనం తెప్పించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి అవసరాలు తీర్చేందుకు ‘బ్రాంటో స్కై లిఫ్టర్’తరహా పెద్ద వాహనం ఉంటే మరింత ఉపయోగంగా ఉంటుంది. గత ఏడాది పై-లీన్ తుపాను సమయంలో మా సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. అధికారులూ మా ప్రతిభను గుర్తించారు. జాతీయ విపత్తుల రక్షణ విభాగం (ఎన్డీఆర్ఎఫ్) మాదిరి డీజీపీ సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ (రాష్ట్ర అత్యవసర, విపత్తుల సర్వీసు విభాగం) పనిచేస్తోంది. జిల్లా నుంచి మొత్తం 14 మందికి ఈ విభాగం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. వీరికి ఈత వచ్చు. సాంకేతిక పరికరాలు ఉపయోగించడంలో సిద్ధహస్తులు. 11 తీర మండలాల్లో అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వీరి ఉపయోగం ఉంటుంది. దీపావళికి సర్వం సిద్ధం దీపావళికి బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటుకు కలెక్టర్ నేతృత్వంలో లెసైన్సులు ఇస్తారు. బాణసంచా వ్యాపారులు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఫైర్ స్టేషన్ పరిధిలో జరిగే విక్రయాలకు అక్కడి స్టేషన్ అధికారే బాధ్యత వహిస్తారు. దుకాణాల వద్ద ఇసుక, నీళ్లు, ఫైరింజిన్, ఇతర అత్యవసర సామగ్రి అందుబాట్లో ఉంటుంది. దుకాణానికి, దుకాణానికి మధ్య 3 మీటర్ల దూరం ఉండాలి. 100 కేజీల మందుగుండుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎదుర్కొనే శక్తి ఉంది ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు సంభవించినా ఎదుర్కొనే శక్తి మాకుంది. ప్రభుత్వం ఇటీవల శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి 100 నెంబర్‌ను సెంట్రలైజ్ చేసింది. 101ను కూడా అదే విధంగా చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా రాజధానికి క్షణాల్లో సమాచారం వెళ్లి.. అక్కడి అధికారులు సంబంధిత ఫైర్‌స్టేషన్‌కు విషయం చేరవేసేలా అనుసంధానం చేస్తే అందరికీ వీలుంటుంది. మేమెంత కష్టపడినా.. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రజల సహకారం, భాగస్వామ్యం ఉంటేనే విధి నిర్వహణలో విజయం సాధించగలుగుతాం. -
జీవో 101లో షరతులు తొలగించాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జీవో ఎం.ఎస్. నంబరు 101లోని కొన్ని షరతులను తక్షణమే తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బేసి మోహనరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. వీటిని వినియోగించుకుని పలువురు ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 101 నంబరు ఉత్తర్వుల్లో పొందుపరచిన కొన్ని షరతుల వల్ల బ్యాంకుల నుంచి సబ్సి డీ రుణాలు పొందటానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని, రుణాల మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతోందని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతల దుర్గారావు మాట్లాడుతూ పంచాయతీ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, అంబేద్కర్ ఆలోచన విధానం, రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన హక్కులపై జిల్లాలో కొత్తగా ఎన్నికైన 143 మంది ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లకు త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా సహాధ్యక్షుడు కె.వేణు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ నియామకాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమితి ప్రతినిధులు బి.కామరాజు, టి.సత్యవతి, టి.మధుసూదనరావు, ఎం.కాళిదాస్ పాల్గొన్నారు.