ఉన్నంతలోనే ఉన్నత సేవలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ.. వాటితోనే ఉన్నతస్థాయి సేవలు అందించడానికి అగ్నిమాపక, విపత్తుల నియంత్రణ శాఖ శాయశక్తులా కృషి చేస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం.. పైగా వచ్చే నెలంతా తుపాన్ల సీజన్. అదే సమయంలో దీపావళి పండుగ వస్తోంది. కీలకమైన ఈ సమయంలో ప్రాణ, ఆస్తుల రక్షణకు తామున్నామంటూ ఆ శాఖ భరోసా ఇస్తోంది. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి (డీఎఫ్‌వో) జె. మోహనరావు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..
సిబ్బంది కొరత
మా శాఖకు సిబ్బంది కొరత ప్రధాన ప్రతిబంధకంగా ఉంది. జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పాలకొండ, రణస్థలం, రాజాం, కోటబొమ్మాళి, టెక్కలి, కొత్తూరు, పలాస, సోంపేట, ఇచ్చాపురాల్లో ప్రభుత్వ ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. పొందూరు, మందసల్లో ఔట్‌సోర్సింగ్ ఫైర్‌స్టేషన్లు (బయట వసతుల అగ్నిమాపక కేంద్రం) ఉన్నాయి. మొత్తం 14 ఫైర్‌స్టేషన్లకు 15 ఫైరింజన్లు, రెండు మిస్టింజన్లు (సందుల్లోకి సైతం వెళ్లగలిగే చిన్న తరహా ఇంజిన్లు) ఉన్నాయి. 129 ఫైర్‌మెన్ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 86 మంది ఉన్నారు. 40మంది హోంగార్డులున్నారు. స్టేషన్ ఫైర్ అధికారి, డ్రైవర్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, అడ్మిన్ జేఆర్ విభాగాల్లో మొత్తం ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పని చేసేందుకు వీలుగా పోర్టబుల్ పంప్‌సెట్లతో పాటు లైఫ్ జాకెట్లు, డ్రాగన్ లైట్లు, తాళ్లు, నిచ్చెన లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయి. అయితే రెండు నెలలుగా హోంగార్డులకు జీతాల్లేవు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందులున్నాయి. అయితే అవి తాత్కాలికమే.
రెండు అద్దె స్టేషన్లు
పొందూరు మార్కెట్ యార్డు, మందస ఎంపీడీవో కార్యాలయాల ఆవరణల్లో రెండు అద్దె ఫైర్‌స్టేషన్లు ఉన్నాయి. అప్పట్లో ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ద్వారా వీటిని కేటాయించాల్సివచ్చింది. అర్హులైన సిబ్బందికి తర్ఫీదు ఇచ్చి ఆ శిక్షణకు అయ్యే ఖర్చు టెండరుదారే భరించే విధంగా చట్టం తెచ్చారు. ఫైరింజిన్, నీళ్లు, ఇతర సదుపాయాలు కూడా యజమానే భరించాలి. అక్కడి సిబ్బందికి నేవీ బ్లూ యూనిఫారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఖాకీ యూనిఫారం కూడా వేసుకుంటారు. ఒక్కో ఫైర్ స్టేషన్‌లో నిబంధనల మేరకు 10మంది ఫైర్‌మెన్లు, ఇద్దరు లీడింగ్ ఫైర్‌మెన్లు, ముగ్గురు డ్రైవర్ ఆపరేటర్లు, ఒక స్టేషన్ అధికారి ఉండాల్సిందే. వీరి జీతభత్యాలనూ యజమానే భరిస్తారు. ఫైర్ స్టేషన్ నిర్వహణ, జీతభత్యాలు, మరమ్మతులు, ఇంజిన్ కొనుగోలు సంబంధిత అంశాలకు సంబంధించి ఏడాదికి సుమారు రూ.15 లక్షల నుంచి 19 లక్షల వరకు ప్రభుత్వం టెండర్‌దారుకు ఇస్తుంది. ఈ స్టేషన్ల పరిధిలో ఎక్కడ ఏ ప్రమాదం సంభవించినా అక్కడి సిబ్బంది, ఇంజిన్లే సహాయ చర్యలు చేపడుతుంటారు.
పెద్ద స్టేషన్, సౌకర్యాలు అవసరమే
పాతపట్నం నియోజకవర్గ పరిధిలో ఓ ఫైర్‌స్టేషన్ అవసరం ఉంది. ప్రభుత్వానికి కూడా నివేదించాం. వాస్తవానికి పోలీస్ శాఖ మాదిరిగా ప్రతి మండల కేంద్రంలో ఫైర్‌స్టేషన్ ఉంటే బాగుంటుంది. గతంలో నాగార్జున అగ్రికమ్ సంస్థలో భారీగా మంటలు చెలరేగినప్పుడు విశాఖ నుంచి ప్రత్యేక వాహనం తెప్పించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి అవసరాలు తీర్చేందుకు ‘బ్రాంటో స్కై లిఫ్టర్’తరహా పెద్ద వాహనం ఉంటే మరింత ఉపయోగంగా ఉంటుంది. గత ఏడాది పై-లీన్ తుపాను సమయంలో మా సిబ్బంది ఎంతో కష్టపడ్డారు.
అధికారులూ మా ప్రతిభను గుర్తించారు. జాతీయ విపత్తుల రక్షణ విభాగం (ఎన్‌డీఆర్‌ఎఫ్) మాదిరి డీజీపీ సాంబశివరావు ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర అత్యవసర, విపత్తుల సర్వీసు విభాగం) పనిచేస్తోంది. జిల్లా నుంచి మొత్తం 14 మందికి ఈ విభాగం ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. వీరికి ఈత వచ్చు. సాంకేతిక పరికరాలు ఉపయోగించడంలో సిద్ధహస్తులు. 11 తీర మండలాల్లో అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వీరి ఉపయోగం ఉంటుంది.
దీపావళికి సర్వం సిద్ధం
దీపావళికి బాణసంచా విక్రయ స్టాల్స్ ఏర్పాటుకు కలెక్టర్ నేతృత్వంలో లెసైన్సులు ఇస్తారు. బాణసంచా వ్యాపారులు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఫైర్ స్టేషన్ పరిధిలో జరిగే విక్రయాలకు అక్కడి స్టేషన్ అధికారే బాధ్యత వహిస్తారు. దుకాణాల వద్ద ఇసుక, నీళ్లు, ఫైరింజిన్, ఇతర అత్యవసర సామగ్రి అందుబాట్లో ఉంటుంది. దుకాణానికి, దుకాణానికి మధ్య 3 మీటర్ల దూరం ఉండాలి. 100 కేజీల మందుగుండుకు ప్రభుత్వం అనుమతిస్తుంది.
ఎదుర్కొనే శక్తి ఉంది
ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు సంభవించినా ఎదుర్కొనే శక్తి మాకుంది. ప్రభుత్వం ఇటీవల శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి 100 నెంబర్‌ను సెంట్రలైజ్ చేసింది. 101ను కూడా అదే విధంగా చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా రాజధానికి క్షణాల్లో సమాచారం వెళ్లి.. అక్కడి అధికారులు సంబంధిత ఫైర్‌స్టేషన్‌కు విషయం చేరవేసేలా అనుసంధానం చేస్తే అందరికీ వీలుంటుంది. మేమెంత కష్టపడినా.. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రజల సహకారం, భాగస్వామ్యం ఉంటేనే విధి నిర్వహణలో విజయం సాధించగలుగుతాం.