జీవో 101లో షరతులు తొలగించాలి
Published Tue, Jan 21 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జీవో ఎం.ఎస్. నంబరు 101లోని కొన్ని షరతులను తక్షణమే తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బేసి మోహనరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. వీటిని వినియోగించుకుని పలువురు ఉపాధి పొందుతున్నారని వివరించారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 101 నంబరు ఉత్తర్వుల్లో పొందుపరచిన కొన్ని షరతుల వల్ల బ్యాంకుల నుంచి సబ్సి డీ రుణాలు పొందటానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని, రుణాల మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతోందని తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతల దుర్గారావు మాట్లాడుతూ పంచాయతీ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, అంబేద్కర్ ఆలోచన విధానం, రాజ్యాంగపరంగా దళితులకు దక్కాల్సిన హక్కులపై జిల్లాలో కొత్తగా ఎన్నికైన 143 మంది ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లకు త్వరలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా సహాధ్యక్షుడు కె.వేణు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ నియామకాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సమితి ప్రతినిధులు బి.కామరాజు, టి.సత్యవతి, టి.మధుసూదనరావు, ఎం.కాళిదాస్ పాల్గొన్నారు.
Advertisement