జాత్యహంకారం: 'ఈశాన్య' యువతికి అవమానం
న్యూఢిల్లీ: అమెరికాలో నల్ల జాతీయులపై దాడులు, ప్రతిదాడులను ప్రపంచమంతా ఖండిస్తున్నవేళ.. దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య పౌరుల పట్ల 'అహంకారం' మరోసారి పురివిప్పింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్ అధికారి.. ఓ మణిపురి యువతిపై జాత్యంహకార వ్యాఖ్యలుచేశాడు. అంతర్జాతీయ సదస్సుకు భారత ప్రతినిధిగా బయలుదేరిన ఆమెను 'నువ్వు భారతీయురాలిలా లేవే' అని అవమానించాడు. తాను ఎదుర్కొన్న జాతి వివక్షను వివరిస్తూ ఫేస్ బుక్ లో ఆ యువతి పోస్ట్ చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే..
పాతికేళ్ల యువతి మోనికా కంగెంబం.. ఇంపాల్(మణిపూర్) కేంద్రంగా సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకుంటోంది. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో 'ప్రత్యేక ఆయుధ చట్టాం'కు వ్యతిరేకంగా పోరాడిన ఆమె.. ప్రస్తుతం విమెన్ అండ్ యూత్ ఫర్ పీస్ అండ్ డెవలప్ మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈశాన్య రాష్ట్రాల యువత, మహిళల జీవన స్థితిగతుల బాగు కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థినిగా ఉన్నప్పుడే గ్లోబల్ ఛేంజ్ మేకర్స్, ఆసియా యూత్ సమ్మిట్ లాంటి పలు అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతినిధిగా పాల్గొన్న మోనికా.. జులై రెండో వారంలో సియోల్ (దక్షిణ కొరియా)లో జరగనున్న ప్రపంచ మహిళా సదస్సుకు కూడా భారత్ ప్రతినిధిగా ఎంపికయ్యారు. సియోల్ వెళ్లేందుకు శనివారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన ఆమెను ఇమిగ్రేషన్ అధికారి తీవ్రంగా అవమానించినట్లు మోనికా ఆరోపిస్తున్నారు.
'నా పాస్ పోర్టును తీక్షణంగా పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారి.. 'నువ్వు భారతీయురాలిలా కనిపించట్లేదే' అని అన్నాడు. 'ఇండియాలో ఎన్ని రాష్ట్రాలున్నాయో చెప్పు..'అని ప్రశ్నించాడు. అంతవరకు ఓపిక పట్టిన నేను లేట్ అవుతోందనగానే.. 'మిమ్మల్ని వదిలేసి విమానం ఎక్కడికీ పోదు. ముందు నా ప్రశ్నలకు జవాబులు చెప్పండి' అని అన్నాడు. ఆ అధికారి పక్కనున్న మహిళ కూడా మొత్తం వ్యవహారాన్ని ముసిముసి నవ్వులతో చూసిందే తప్ప అతణ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు' అని మోనికా తన లేఖలో వివరించింది. 'ఇది కచ్చితంగా జాత్యహంకారమే. అయితే నేను మాత్రం నా స్పూర్తిని వదులుకోను' అంటూ లేఖకు ముక్తాయింపునిచ్చారామె. గతంలోనూ దేశ రాజధాని ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పౌరులపై దాడులు జరిగిన నేపథ్యంలో మోనికాకు జరిగిన అవమానంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్పందిచాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మోనికాపై గతంలో పలు జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాల్లో కొన్ని..