పునరాలోచనలో ఎస్ బీఐ?
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) అమల్లోకి తీసుకురానున్న చార్జీల బాదుడు నుంచి ఖాతాదారులకు ఉపశమనం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. చార్జీల మోత నిర్ణయంపై పునరాలోచించాలని ఎస్ బీఐని కేంద్ర ప్రభుత్వం కోరిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కనీస నిల్వ పరిమితిపై పెనాల్టీ, ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణలపై చార్జీలు వేయొద్దని ప్రైవేటు బ్యాంకులతో సహా ఎస్ బీఐని కేంద్రం కోరినట్టు తెలిపాయి.
ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు తమ నిర్ణయంపై పునరాలోచన చేసే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ బీఐ చార్జీల బాదుడును ఉపసంహరించుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధించాలని ఎస్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఏటీఎం సహా పలు ఇతర సేవల చార్జీలను కూడా ఎస్బీఐ సవరించింది.