more powers
-
ఎన్ఐఏకి కోరలు
న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అధికారం కూడా ఎన్ఐఏకు ఉంటుంది. 2008లో ముంబైలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 166 మందిని చంపేసిన అనంతరం, 2009లో ఉగ్రవాద కేసుల విచారణకు ప్రత్యేకంగా ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు అవసరమని 2017 నుంచీ హోం శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘జాతీయ దర్యాప్తు సంస్థ (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది. ఎన్ఐఏ చట్టాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్ అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడమేననీ, దీనికి మతంతో సంబంధం లేదనీ, ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా తాము వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపేలా పార్లమెంటు అంతా ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని అమిత్ షా కోరారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనీ, ఇప్పుడు వారి తప్పులను తాము సరిచేస్తున్నామని అన్నారు. బిల్లుకు 278 మంది సభ్యులు మద్దతు తెలపగా, ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు . ఆ మాటకు హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభకు అద్దెగర్భం బిల్లు అద్దె గర్భం (సరోగసీ) విధానాన్ని వ్యాపారంగా వాడుకోకుండా చూసేందుకు పలు నిబంధనలతో కూడిన ‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు–2019’ని కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా గతేడాది డిసెంబర్లోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ పార్లమెంటు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో గడువు చెల్లింది. దీంతో ఈ బిల్లును మళ్లీ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యి, ఇంకా పిల్లలు పుట్టని దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే అవకాశం కల్పిస్తారు. అలా పుట్టిన బిడ్డను వారు మళ్లీ ఏ కారణం చేతనైనా వదిలేయకూడదు. దంపతుల్లో భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దంపతులకు తన గర్భాన్ని అద్దెకివ్వవచ్చు. ఆమె కచ్చితంగా పిల్లలు లేని దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇప్పటివరకు అద్దెగర్భం విధానానికి సంబంధించి ఇండియాలో చట్టం ఏదీ లేదు. దీంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి, మన దేశంలోని మహిళల ద్వారా ఈ విధానంలో బిడ్డలను కంటూ ఆ మహిళకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. అలాంటి మహిళలు ఇకపై దోపిడీకి గురవకుండా ఉండటం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. -
పంచాయతీలకు మరిన్ని అధికారాలు
- ఈ సమావేశాల్లోనే చట్టం తీసుకువద్దాం: సీఎం కేసీఆర్ - పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు - అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేస్తాం - మంత్రి ఆధ్వర్యంలో విధివిధానాలపై అధ్యయనానికి ఆదేశం - క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీలను పటిష్టం చేయాలని, వాటి బాధ్యతను మరింత పెంచేలా విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే దీనికి సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువద్దామని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని, అన్ని గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. దీంతోపాటు గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని, ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, పోచారం, ఈటల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకమైందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పాటు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పిచ్చిమొక్కల తొలగింపు, పిచ్చికుక్కల నివారణ, మురికి గుంటలు లేకుండా చూడటం లాంటి కార్యక్రమాలు పంచాయతీలే నిర్వహించాలన్నారు. అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు అంటు వ్యాధుల బారినపడుతున్నారని, పరిశుభ్రత పాటిస్తే ఆ దుస్థితిని నియంత్రించవచ్చని సీఎం చెప్పారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు గ్రామాభివృద్ధిలో, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని... ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం గ్రామ పంచాయతీలకు 25 వేల సైకిల్ రిక్షాలను వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని, క్లస్టర్ల వారీగా కార్యదర్శులను నియమించాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గ్రామాల్లో డంప్ యార్డుల ఏర్పాటు, స్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంచాయతీల ద్వారా ప్రజలకు కావాల్సిన పనులు, రావాల్సిన అనుమతులు సకాలంలో వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామ పంచాయతీలకు అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించే అంశంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.