అఫ్ఘాన్‌లో పెళ్లి వేడుకపై మోర్టార్ దాడి
మహిళలు సహా 30 మంది దుర్మరణం
కాబూల్: అఫ్ఘానిస్థాన్లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో ఓ పెళ్లి వేడుకపై జరిగిన మోర్టార్ దాడిలో సుమారు 30 మంది మృత్యువాతపడ్డారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. సంగిన్ జిల్లాలోని మయ్యన్ దాజు గ్రామంలో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగిందని అధికారులను ఉటంకిస్తూ జింగ్హు పేర్కొంది. ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు తెలిపింది.
భద్రతా దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య పోరు జరుగుతుం డగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు పేర్కొంది. ఈ ఘటనలో 40 మంది వరకూ గాయపడ్డారని, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అయితే గాయపడిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. అఫ్ఘాన్‌లో తాలిబా న్ దాడులు, భద్రతా దళాలు, ఉగ్రవాదుల ఘర్షణల్లో గత ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకూ సుమారు 3,180 మంది పౌరులు మరణించగా.. సుమారు 6,430 మంది గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.