చింతమనేనికి క్లాస్ పీకిన చంద్రబాబు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం ‘దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత’పై నిర్వహించిన సభ వెలవెలబోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీతో పాటు సభకు విద్యార్థులు హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభాముఖంగానే విప్ చింతమనేని ప్రభాకర్‌ను చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థులను సమీకరించడంలో విఫలమయ్యారంటూ నేతలు, అధికారులపై సీఎం రుసరుసలాడారు.
కాగా ప్రత్యేక హోదా ఆవశ్యకతపై ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22న ఏలూరులో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. యువభేరికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై... ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై తూర్పారబట్టారు. దీంతో వైఎస్ జగన్ యువభేరికి దీటుగా ఉండాలని చంద్రబాబు సభకు ముందస్తు ఏర్పాట్లు చేసినా ...అది కాస్త అట్టర్ ప్లాప్ అయ్యింది.
సీఎం సభకు హాజరు కావాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేసినా విద్యార్థులు ఆ సభకు హాజరు కాలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా శనివారం ఏలూరులో దోమలపై దండయాత్ర ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జెడ్పీ ఆఫీసు నుంచి సురేశ్‌చంద్ర బహుగుణ స్కూల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.