Mosquito nets
-
Banjara Hills: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని..
సాక్షి, బంజారాహిల్స్: అస్సాంలోని దోమ తెరలు, బ్లాంకెట్ల సరఫరాకు సంబంధించి 60 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన కె.నర్సింహారెడ్డి వ్యాపారి. ఆయనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.నారాయణతో పరిచయం ఉంది. కొద్ది రోజుల కిత్రం నారాయణ ద్వారా మాదాపూర్ జైహింద్ రోడ్డులో నివాసం ఉండే గుండుబోయిన వినయ్, కాకాని మనోహర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు తమకు వివిధ ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని నమ్మించారు. అనంతరం అస్సాం రాష్ట్రంలో 60 కోట్ల రూపాయల విలువ చేసే దోమ తెరలు, బ్లాంకెట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగింత పని తమ చేతిలో ఉందని తెలిపారు. ఎవరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నర్సింహారెడ్డికి ఆశ కల్పించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ తామే తీసుకుంటున్నట్టు చెప్పడంతో కొంత పెట్టుబడి పెడితే వాటా ఇస్తామని చెప్పారు. నర్సింహారెడ్డి వారి మాటలను నమ్మి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరు మోసగాళ్లని తెలిసింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని నర్సింహారెడ్డి ఇద్దరిని పలుమార్లు అడిగాడు. కాని వారు స్పందించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా జూబ్లీహిల్స్ పోలీసులు వినయ్, కాకాని మనోహర్‌రెడ్డిలపై ఐపీసీ 406,420, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్
ముంబై: చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్ నిండా నింపుకుని కోర్డుకు వచ్చాడు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా. వాటిని జడ్జికి చూపిస్తూ దోమతెర కావాలని కోరాడు. సదరు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు. అతనిపై మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లక్డావాలాని 2020లో పోలీసులు అరెస్టు చేసి నావీ ముంబైలోని తలోజా జైల్లో పెట్టారు. ఈమేరకు లక్డావాలా సెషన్ కోర్టులో దోమతెర కావాలంటూ అప్పీల్ పెట్టుకున్నాడు. అందుకోసం అని కోర్టుకి చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుని తీసుకువచ్చి...కోర్టులో చూపిస్తూ తాను తన సాటి ఖైదీలు వీటితో ఇబ్బందిపడుతున్నామని చెప్పాడు. పోలీసులు భద్రతా దృష్ట్యా దోమతెరలు అందించడం లేదని వాపోయాడు. ఐతే కోర్టు ఆ ఆపీల్ని తిరస్కరించింది. దోమతెరకు బదులు ఓడోమోస్ వంటి దోమల నివారిణులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించింది. అంతేగాక జైలు అధికారులు దోమల బెడద అరికట్టే చర్యలను తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పలు ఫిర్యాదులు గతంలో కోర్టు ముంగిటకి వచ్చాయి. ఐతే వాటిలో కొందరికి దోమతెర వెసులుబాటు కల్పించారు కానీ కొందరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వడం లేదు. (చదవండి: దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...) -
తెర..చిరిగింది
మన్యంలో పంపిణీకాని దోమ తెరలు దృష్టి సారించని సర్కారు మలేరియాతో ఆదివాసీలు సతమతం పాడేరు: మన్యంలో గిరిజనులకు పంపిణీ చేసిన దోమ తెరల కాలం చెల్లింది. ప్రస్తుతం ఆదివాసీలకు ఇవి అందుబాటులో లేవు. గ్రామాలలో దోమల బెడద ఎక్కువైంది. ఏజెన్సీ అంతటా మలేరియా ప్రబలుతోంది. ఏటా ఎపిడమిక్‌లో ఆదివాసీలు మలేరియాతో సతమతం కావడం సాధారణం. ఈ మహమ్మారి తీవ్రత దృష్ట్యా 2011-12లో 3,566 గ్రామాలలో 1,17,806 కుటుంబాలకు 3 లక్షల 866 దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమల నివారణకు దోహదపడేలా సింథటిక్ పెరిథ్రిన్ మందు పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన దోమ తెరలను ఉగాండా దేశం నుంచి తెప్పించారు. 3 నుంచి 5గురు సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున, ఆరుగురు పైబడిఉన్న కుటుంబాలకు 3 చొప్పున అందజేశారు. వీటి వల్ల ఏజెన్సీలో మలేరియా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. వీటి వినియోగకాలం రెండేళ్లే. అంటే 2013-14లో వీటిని మళ్లీ పంపిణీ చేయాలి. ఈమేరకు దోమ తెరల కోసం అధికారులు ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏజెన్సీలో ఏటా ఏప్రిల్ నుంచి నవంబరు వరకు మలేరియా విజృంభిస్తుంటుంది. ఈ కాలంలో ఇక్కడి వారికి దోమ తెరల వినియోగం తప్పనిసరి. నిద్రించే సమయంలో దోమలు కుట్టడం వల్లే మలేరియా ప్రబలుతున్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. దోమల నివారణకు గ్రామాల్లో ఆల్ఫాసైనో మైథీన్(మలేరియా నివారణ మందు)ను పిచికారీ చేస్తున్నప్పటికీ మలేరియా అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాది రెండు విడతలుగా హైరిస్క్ గ్రామాలు (2,550)లో స్ప్రేయింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వ్యాధి తగ్గుముఖం పట్టే చాయలు లేవు. ఇప్పటికే ఏజెన్సీలో 5వేలకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనాఫిలస్ దోమ కారణంగా ఫాల్సీఫారం మలేరియా ప్రబలుతోంది. ఇది సెరిబ్రెల్కు దారి తీసి మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీని నివారణకు దోమ తెరల పంపిణీయే శ్రేయస్కరమని వైద్య నిపుణుల బృందం అధ్యయనం ద్వారా తేలింది. అయితే వీటి పంపిణీ ఒక్కసారికే పరిమితమైంది. పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న గిరిజనులు మలేరియా జ్వరాలతో మృత్యువాత పడుతున్నారు.