mother milk week
-
తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. మహోన్నతమైన ఆ తల్లి మనసుకు వందనం! ఒక తల్లి నుంచి మరో తల్లి బిడ్డకు... పాలు అందించే సేవ మహోత్కృష్టం. ఆ సేవలో తరిస్తున్నాయి పాలబ్యాంకులు. బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. తల్లిపాలు ఆహారం మాత్రమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా దేహం తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న తల్లిపాలను నిర్లక్ష్యం చేయరాదని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపిస్తోంది. కొంతమంది తల్లులకు పాలు పడవు. అలాగే కొంతమందికి డెలివరీ సమయంలో ఇతర కారణాల రీత్యా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలను కొన్ని రోజులు, నెలలపాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచాలి. ఇలాంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు ఉద్భవించాయి. హైదరాబాద్ నగరంలో ధాత్రి మిల్క్ బ్యాంకు అలాంటిదే. ఈ బ్యాంకు ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్‌కు సేవలందిస్తోంది. ‘‘అక్కడ డెలివరీల్లో అల్పాదాయ కుటుంబాల వాళ్లే ఎక్కువ. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఫార్ములా మిల్క్‌ను జీర్ణం చేసుకోలేరు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కష్టమే. అందుకే మా సర్వీస్ ప్రధానంగా ఆ బిడ్డలకే’’ అన్నారు డాక్టర్ భవాని. చైతన్యప్ర‘దాత’లు... రక్తపరీక్ష చేసి హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి మరికొన్ని అనారోగ్యాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిల్క్ డొనేషన్‌ను ప్రోత్సహిస్తారు. డెలివరీ అయి హాస్పిటల్లో ఉన్న తల్లులతోపాటు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తల్లుల నుంచి కూడా పాలను సేకరిస్తారు. ఇంట్లో ఉన్న తల్లులకు 250 మి.లీ, 500 మి.లీ. కెపాసిటీ కలిగిన ‘బ్రెస్ట్‌మిల్క్ స్టోరేజ్ పౌచ్’లను ఇస్తారు. తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను స్టెరిలైజ్ చేసిన పాత్రలోకి సేకరించి వాటిని పౌచ్‌లో పోసి ఇంట్లోనే డీప్‌ఫ్రీజర్‌లో పెడతారు. వారం లేదా పది రోజులకొకసారి మిల్క్ బ్యాంకు వాళ్లు వచ్చి ఆ పౌచ్‌లను కోల్డ్ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి బ్యాంకుకు చేరుస్తారు. బ్యాంకులో పాలను పాశ్చరైజ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ కారకాలైమేనా ఉన్నాయేమోనని పరీక్ష చేస్తారు. ఆ తర్వాత పాలను చల్లబరిచి డీప్‌ఫ్రీజర్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఇలా మిల్క్ బ్యాంకులో నిల్వ చేసిన పాలను నాలుగు నుంచి ఆరునెలల వరకు ఉపయోగించవచ్చు. ‘పాలను సేకరించడం, మిల్క్ బ్యాంకుకు తరలించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, అవసరమైన బిడ్డకు అందించడం’ ఇన్ని దశలుంటాయి. సాధారణంగా బ్లడ్‌బ్యాంకుల గురించి తెలిసినంతగా మిల్క్ బ్యాంకుల గురించి జనానికి పెద్దగా తెలియదు. కానీ చదువుకున్న మహిళల్లో చైతన్యం బాగా వచ్చిందని, హైదరాబాద్ నగరంలో 18వందలకు పైగా తల్లులు ధాత్రితో అనుసంధానమై పాలదానం చేస్తున్నారని తెలియచేశారు ధాత్రి నిర్వహకులు. పాలదాతలు తల్లి నుంచి పాలను సేకరించిన తర్వాత మామూలుగా నిల్వ ఉంచితే గంట లేదా రెండు గంటల్లో ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆరుగంటల వరకు వాడవచ్చు. ప్రసవం సెలవు పూర్తి చేసుకుని డ్యూటీలకు వెళ్లే తల్లులు ఇదే పద్ధతి పాటిస్తుంటారు. నెలల కొద్దీ నిల్వ ఉండేవి మిల్క్ బ్యాంకులో నిల్వ చేసినవి మాత్రమే. మిల్క్ డోనర్ మదర్లకు మేము పౌచ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. పౌచ్‌ను డీప్ ఫ్రీజర్‌లోనే పెట్టాలి. ఆ ఫ్రీజర్‌లో మరేదీ పెట్టకూడదు. ఇలా నిల్వ చేసిన పాలను వారం పది రోజుల్లో బ్యాంకుకు తెప్పించుకుంటాం. కరెంట్ పోతే అప్పటి వరకు ఇంట్లో నిల్వ చేసిన పాలను వెంటనే బ్యాంకుకు చేర్చాలి. మిగులు పాలు ఉన్న తల్లులనే ఎంపిక చేసుకుంటాం. కాబట్టి మిల్క్ డోనర్ల బిడ్డల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూనే మరొక బిడ్డకు ప్రాణం పోయవచ్చు. డా. భవాని కలవలపల్లి పీడియాట్రీషియన్ , వైస్ ప్రెసిడెంట్, సుశేన హెల్త్ ఫౌండేషన్ సీఈవో, ఐడియా క్లినిక్స్ ఏడాదికి ఎనిమిది లక్షల మంది శిశువులు తల్లిపాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలన్నీ బిడ్డకు ఆరు నెలలు నిండేలోపే సంభవిస్తున్నట్లు డబ్లు్యహెచ్‌వో లెక్కలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో టైప్ టూ డయాబెటిస్, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేసే బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవేర్నెస్ కోసం ఏటా ఆగస్టు మొదటి వారం రోజులను కేటాయించింది డబ్లు్యహెచ్‌వో. ఈ ఏడాది ‘స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్–ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్’ థీమ్‌తో ముందుకెళ్తోంది. – వాకా మంజులారెడ్డి -
బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఇంకా..
World Breastfeeding Week 2022: శిశువు భూమ్మీదకు వచ్చి ‘కేర్’మనగానే తల్లి స్థనం పాలతో ఉప్పొంగుతుంది. పాలా అవి? శిశువు పాలిటి అమృతం. పుట్టిన బిడ్డ నోటికి స్థన్యమందించడం పాలిచ్చే ప్రతి జీవరాశిలో అత్యంత సహజం. కాని మనిషికి తెలివి జాస్తి. కొందరు తల్లులు కొన్ని కారణాల రీత్యా పిల్లలకు తల్లిపాలను నిరాకరిస్తారు. ‘తల్లి పాలు ఇవ్వండి’ అని వారోత్సవాలు జరపడమే ఒక రకంగా ప్రకృతి విరుద్ధం. బిడ్డకు తల్లి పాలివ్వడమే కదా ప్రకృతి సహజం. తల్లి పాలకు దూరమైన బిడ్డ అమృతానికి దూరమైనట్టు కాదా? ఇంతకాలం తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం అనుకుంటూ వచ్చాం. కాని తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎంత ప్రయోజనమో తల్లికీ అంతే ప్రయోజనం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘తల్లి తన బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవానంతర కుంగుబాటుకు దూరమయ్యి ఆనందం, సంతృప్తి పొందుతుంది. ఆరోగ్య లాభాలు! ఆమెకు భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అన్నింటి కంటే మించి బ్రెస్ట్ కాన్సర్ ప్రమాదం కూడా తప్పుతుంది. ప్రపంచంలో తల్లిపాలు ఇవ్వాలనే చైతన్యం వల్ల తల్లిపాలు ఇచ్చే తల్లుల సంఖ్య పెరగడంతోపాటు బ్రెస్ట్ కాన్సర్ బారిన పడే స్త్రీల సంఖ్య ఏటా 20 వేల చొప్పున తగ్గుతోంది’ అంటారు ఆగ్రాకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ నిహారికా మల్హోత్రా. ముగ్గురికి ఇద్దరు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి తల్లిపాలు అందడం లేదు. ‘తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి. పసిపిల్లలకు వచ్చే వ్యాధులను నివారించే శక్తి తల్లిపాలకు ఉంది. బిడ్డ పుట్టాక మొదటి గంటలోనే మొదలెట్టి కనీసం 6 నెలల పాటు తల్లి పాలు ఇవ్వడం మేలని డబ్యు.ఎచ్.ఓ అధ్యయనం తెలుపుతోంది’ అంటారు నిహారిక మల్హోత్రా. పిల్లలకు కూడా! తల్లిపాలు తాగిన పిల్లల కంటే పోతపాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం, అధిక బరువు కనిపిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం మిగిలిన పిల్లల్లో కనిపించడం లేదని నిర్థారణ అయింది. అంతే కాదు తల్లిపాలు తాగిన పిల్లల్లో మాటలు తొందరగా రావడం, భాషను గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటం కూడా గుర్తించారు. తల్లికి సహాయంగా... బిడ్డకు పాలు ఇవ్వడం బిడ్డను అనుక్షణం గమనించుకోవడం ఇవి తల్లికి చాలా ముఖ్యం అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఇంటి వాతావరణం ఉండాలి. అందుకే పెద్దలు కాన్పుకు పుట్టింటికి పంపేవారు. పుట్టింట్లో తల్లిదండ్రులు తల్లిని చూసుకునేవారు. కాని రెండో కాన్పుకు వచ్చేసరికి ఈ మర్యాదను తప్పిస్తారు. తప్పించవచ్చు... అంతే విశ్రాంతి... చూసుకునే మనుషులు ఉంటే. ఆహారం విషయంలో.. కాన్పు తర్వాత బిడ్డను చూసుకునే తల్లికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వీటి మధ్య వంట– వార్పు ఇతర సంతానం బాగోగులు చూసుకోవడం కూడా భారంగా మారతాయి. భర్త, తల్లిదండ్రులు, అత్తామామలు ఈ విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు... పాలిచ్చే తల్లి ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఏవి తింటే ఎక్కువ శక్తి వచ్చి పాలు బాగా పడతాయో తల్లి ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకొని ఆ ఆహారం ఇవ్వాలి. లేకపోవడం తప్పు కాదు... కొందరు తల్లులు ఉద్యోగాలకు వెంటనే వెళ్లాల్సి రావడం వల్ల తల్లి పాలు ఇవ్వడం వీలవదని అంటారు. కొందరికి థైరాయిడ్ వంటి సమస్యల వల్ల తక్కువ పాలు పడవచ్చు. కొందరు తల్లుల్లో ఏ సమస్యలూ లేకపోయినప్పటికీ తగినన్ని పాలు ఉండవు. ఈ సందర్భాలను కూడా కుటుంబం అర్థం చేసుకోవాలి తప్ప ఒత్తిడి పెట్టడం సరి కాదు. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోందంటే తల్లిపాలు ఏ మాత్రం కల్తీ కాలేవు. కాని కలుషితమైన నీటిలో కలిపే పౌడర్, పోతపాల వల్ల జరుగుతున్న పసికందుల మరణాలను తల్లిపాలు ఇవ్వడం ద్వారా 13 శాతం నివారించవచ్చు అని. పోతపాలు తప్పనిసరి అయితే రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు పెట్టుకోవాలి. కాని తల్లిపాలు పొందడం పిల్లల ప్రాథమిక హక్కు. ఎందుకంటే ‘బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ మిల్క్’ అనేదే అందరు నిపుణుల నినాదం. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? -
అమ్మపాలే ‘అమృతం’
గుంటూరు మెడికల్: శిశుమరణాల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. అందులో భాగంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా 1992లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించి 210 దేశాల్లో అమలు చేస్తోంది. తల్లిపాల ఆవశ్యకత గురించి వరల్డ్ అలయన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఆగస్టు ఒకటో నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిసస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. తల్లిపాలతో ప్రయోజనాలు... ♦ తల్లిపాలలో సహజ సిద్ధమైన ప్రొటీన్లు లాక్టొఫెరిన్, కోలోస్ట్రమ్, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి. ♦ తల్లిపాలు తాగే పిల్లలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. డబ్బాపాలు తాగే పిల్లల కంటే చురుగ్గా ఉంటారు. ♦ తల్లి బిడ్డకు పాలు ఇవ్వటంతో తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెనవేసుకుంటుంది. ♦ మంచి గుణాలు, మానవ సంబంధాలు శిశువులో పుట్టుక నుంచే అలవడతాయి. ♦ పాలిచ్చే తల్లులకు క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ♦ పొత్తికడుపు త్వరగా తగ్గిపోతుంది. పాలు ఇస్తున్నంతకాలం వెంటనే గర్భం రాకుండా కృత్రిమంగా ఆగిపోతుంది. ♦ ప్రసవ సమయంలో అయ్యే బ్లీడింగ్ కూడా త్వరగా తగ్గిపోతుంది. -
అవిగో టాయ్‌లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు!
గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పల్లెజనం పట్టణాల నుంచి ఏం నేర్చుకుంటున్నారో తెలియదు కానీ చాలా విషయాల్లో గ్రామీణ ప్రజల్లోని మానవత్వం, అమాయకత్వం, ప్రేమా మన మనసుల్ని పల్లెలవైపు పరుగులు తీయిస్తుంటుంది. అది గుర్తొచ్చినప్పుడల్లా మననుంచి దూరమైనవేవో మనసుని నొప్పిస్తుంటాయి. ఇటీవల ఆగస్టు తొలివారంలో తల్లిపాల ప్రాధాన్యతను చాటిచెప్పే వారోత్సవాలను గురించి చదివినప్పుడు గుండెల్లో అలాంటిదే ఏదో నొప్పి బయలుదేరింది. కొద్దినెలల క్రితం చదివిన ఓ విషయం గుర్తొచ్చింది. బహుశా అలాంటి నొప్పినే, అలాంటి బరువునే గుండెల్లో నింపుకొని భారంగా, బాధగా బతుకులీడుస్తోన్న లక్షలాది మంది పట్టణాల్లోని పసిబిడ్డల తల్లులు గుర్తొచ్చి నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో కుప్పలు తెప్పలుగా నిర్మితమౌతోన్న అమానవీయ, అనాగరిక కట్టడాలపై ఏహ్యభావం ఏర్పడింది. బహుళంతస్తుల సెంట్రలైజ్డ్ ఏసీ భవనాల్లో ఆరోగ్యం కోసం కూడా నాలుగు మెట్లు ఎక్కే బాధే లేకుండా ఎస్కులేటర్లు చాలా సుఖవంతమైనవే. అలాంటి చాలా సౌకర్యవంతమైన ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్‌లూ, మల్టీప్లెక్స్‌లూ నగరం నిండా జనానికి చోటే లేకుండా అవే భవనాలు. అలా సకల సౌకర్యాలతో విలసిల్లుతోన్న షాపింగ్ ‘పెద్ద’ బజారుల్లో ఓ తల్లి కళ్లు దేనికోసమో వెతుకుతూనే ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని ట్రయల్ రూం ముందున్న సింగిల్ స్టూల్‌పై కూర్చొని జీన్స్ పైన సౌలభ్యం కోసం వేసుకున్న లూజ్ టీషర్టుని ఓ వారగా గబగబా పైకి లాగి చిన్నారి నోటికి స్థనాన్ని అందించిందో చిన్నపిల్ల తల్లి. అంతే! అంతలోనే అక్కడికొచ్చిన ఓ వ్యక్తి అది పిల్లలకు పాలివ్వడం కోసం ఏర్పాటుచేసిన స్థలం కాదనీ, తక్షణమే ఖాళీ చేయాలనీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడు. మరి ఏడుస్తున్న బిడ్డకి పాలెక్కడివ్వాలి? ఆమె ప్రశ్నకి సమాధానంగా ప్రతీకాత్మక చిత్రం : ‘పాలిచ్చే తల్లులకుకాస్త చోటు చూపించండి’ అంటూ ఇటీవలేఆన్లైన్ వేదికగా ఒక ఉద్యమం మొదలైంది. ‘అదిగో అక్కడుంటాయి టాయ్‌లెట్స్.. అందులో కూర్చొని ఇవ్వొచ్చు’ అని ఉచిత సలహా ఒకటి పారేసి వెళ్లాడు. తల్లిపాలు కల్తీ లేనివి. కల్తీ చేయలేనివి. గుండెల్నిండుగా హత్తుకుని ఇచ్చే తల్లిపాలు బిడ్డ ఆకలి మాత్రమే తీర్చవు. ప్రేమతో నిండిన పాలిండ్ల స్పర్శ బిడ్డకూ, తల్లికీ కూడా ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటిది అపరిశుభ్రమైన ప్రాంతంలో, దుర్గంధంతో నిండిన విసర్జిత ప్రాంతంలో బిడ్డకు పాలివ్వమని చెప్పే పరిస్థితి ఈ పట్టణాల్లో మనం మిస్సవుతోన్నదేమిటో మనకు గుర్తు చేస్తోంది. అంతెందుకు చాలా రోజుల క్రితం రోడ్డుపక్కగా (మిగిలిన వాహనదారులకు ఏ ఆటంకం లేకుండా) కారు ఆపుకుని బిడ్డకు పాలిస్తోన్న తల్లిపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన రుబాబూ, రాద్ధాంతం టీవీ చూసినవారందరికీ గుర్తుండే ఉంటుంది. రోడ్డుపైన అడ్డదిడ్డంగా కార్లు పార్కుచేసినా కిమ్మనకుండా వెళ్లిపోయే వాళ్లు కూడా పసిబిడ్డకు పాలిచ్చేప్పుడు ఆటంక పరచకూడదనే ఇంగితం లేకుండా పోయింది. అయితే ఆ ఇంగితం ఉండాల్సిందెవరికి? నిజానికి నగరాలకే. పర్యావరణాన్ని గాలికి వదిలేసి, అనుమతులకు చెల్లుచీటీ ఇచ్చేసి, కుప్పలుతెప్పలుగా కట్టేసోన్న బహుళంతస్థుల భవనాల్లో మహిళలకు కావాల్సిందేమిటో ఎవ్వరైనా ఆలోచించారా? పసిబిడ్డలకు పాలిచ్చే ఓ రెండడుగుల ప్రైవసీ స్థలం. ఓ చిన్ని కుర్చీ. ఇంత చిన్న విషయం కొన్ని వేల మంది సమస్య అయినప్పుడు ఇదెందుకు తట్టదు ఎవరికీ? అంటే అది స్త్రీల సమస్య మాత్రమే కాబట్టి. ఆడపిల్లలకి ఏరకంగానూ అక్కరకు రాని నగరాలను నాగరికంగా మార్చగలమా? – అరుణ అత్తలూరి -
తల్లిపాలే పిల్లలకు శ్రేయస్కరం
♦ అంగన్వాడి కార్యకర్తలకు దీర్ఘకాలిక లక్ష్యాలు అవసరం ♦ పూర్వప్రాథమిక విద్యా ఎంతో అవసరం ♦ తల్లిపాల మాసోత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్‌రెడ్డి పరిగి: పుట్టగానే ముర్రుపాలతో పాటు తదనంతరం తల్లిపాలు తాగించటం వల్ల దీర్ఢకాలంలో వారి ఎదుగుదలకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే టీ. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగిలోని కేఎన్ఆర్ గార్డెన్లో ఐసీడీఎస్ ఆద్వర్యంలో తల్లిపాల మాసోత్సవాల్లో బాగంగా నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు స్వల్పకాలిక లక్ష్యాలను సాధిస్తూనే దీర్ఘకాలిక లక్ష్యాలకోసం పనిచేయాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్య ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అయితే అది అంగన్వాడి సెంటర్ల ద్వారానే అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలకు అనుబందంగా జరగాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. మాతా శిశు మరణాలను తగ్గించటంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన తెలిపారు. కార్యకర్తలకు నిరంతరం శిక్షణ తోపాటు వారిలో వత్తిడిని తగ్గించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు అవసరమని అధికారులకు సూచించారు. అంగన్వాడి కార్యకర్తల సమస్యలు, పోస్టుల భర్తి తదితర అంశాలు అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. అనంతరం పరిగి జ్యోతి, గండేడ్ ఎంపీపీ శాంత మాట్లాడుతూ సమాజాం అంగన్వాడీలను సరియైన విదంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసవం తల్లికి పునర్జన్మ అని అలాంటి తల్లులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన వ్యవస్థపై ఉందని పరిగి సర్పంచ్ విజయమాల అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే గ్రామ స్థాయిలోనే చాలా రకాల హెల్త్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంపీడీఓ విజయప్ప, ఎస్పీ హెచ్ఓ డాక్టర్ ధశరథ్ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని సీడీపీఓ ప్రియదర్శిని అన్నారు. తల్లిపాలు పిల్లల పాలిట సంజీవిని అని వివరించారు. చిన్నతనంలో తల్లిపాలు తాగిన చిన్నారుల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు సరళ, ఆదిలక్ష్మి, ప్రమిళ, రాణి, నిర్మళ, దివ్య, నీలవేణి, పద్మ, జ్యోతి, కాంగ్రెస్ నాయకులు టీ. వెంకటేష్, అశోక్‌రెడ్డి అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాళ్లు. అంగన్వాడి కార్యకర్తలు ఊర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఇందులో బాగంగా అంగన్వాడి కార్యకర్తలు చిన్నారులకు చిన్నతనంలో ఆటల కోసం, సృజనాత్మకతను పెంచేందుకు వినియోగించే పరికరాలు, వస్తులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శించారు. తీసుకోవాల్సిన ఆహార పధార్థాల తయారు చేసి స్టాళ్లలో ఉంచారు వాటివల్ల కలిగే ఉపయోగాలను అక్కడ రాసి ఉంచారు. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబందించిన పరికరాలు ప్రదర్శించారు.