తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం | World Breastfeeding Week 2022: Salute to the life-savers | Sakshi
Sakshi News home page

తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం

Published Sun, Aug 7 2022 3:48 AM | Last Updated on Sun, Aug 7 2022 3:48 AM

World Breastfeeding Week 2022: Salute to the life-savers - Sakshi

బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో?
ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది.
మహోన్నతమైన ఆ తల్లి మనసుకు వందనం! ఒక తల్లి నుంచి మరో తల్లి బిడ్డకు... పాలు అందించే సేవ మహోత్కృష్టం. ఆ సేవలో తరిస్తున్నాయి పాలబ్యాంకులు.


బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. తల్లిపాలు ఆహారం మాత్రమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా దేహం తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న తల్లిపాలను నిర్లక్ష్యం చేయరాదని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపిస్తోంది.  కొంతమంది తల్లులకు పాలు పడవు. అలాగే కొంతమందికి డెలివరీ సమయంలో ఇతర కారణాల రీత్యా వేరే హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి వస్తుంది.

నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలను కొన్ని రోజులు, నెలలపాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచాలి. ఇలాంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు ఉద్భవించాయి. హైదరాబాద్‌ నగరంలో ధాత్రి మిల్క్‌ బ్యాంకు అలాంటిదే. ఈ బ్యాంకు ప్రధానంగా నీలోఫర్‌ హాస్పిటల్‌కు సేవలందిస్తోంది. ‘‘అక్కడ డెలివరీల్లో అల్పాదాయ కుటుంబాల వాళ్లే ఎక్కువ. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఫార్ములా మిల్క్‌ను జీర్ణం చేసుకోలేరు, ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షణ కూడా కష్టమే. అందుకే మా సర్వీస్‌ ప్రధానంగా ఆ బిడ్డలకే’’ అన్నారు డాక్టర్‌ భవాని.

చైతన్యప్ర‘దాత’లు... రక్తపరీక్ష చేసి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ వంటి మరికొన్ని అనారోగ్యాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిల్క్‌ డొనేషన్‌ను ప్రోత్సహిస్తారు. డెలివరీ అయి హాస్పిటల్‌లో ఉన్న తల్లులతోపాటు డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన తల్లుల నుంచి కూడా పాలను సేకరిస్తారు. ఇంట్లో ఉన్న తల్లులకు 250 మి.లీ, 500 మి.లీ. కెపాసిటీ కలిగిన ‘బ్రెస్ట్‌మిల్క్‌ స్టోరేజ్‌ పౌచ్‌’లను ఇస్తారు.

తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను స్టెరిలైజ్‌ చేసిన పాత్రలోకి సేకరించి వాటిని పౌచ్‌లో పోసి ఇంట్లోనే డీప్‌ఫ్రీజర్‌లో పెడతారు. వారం లేదా పది రోజులకొకసారి మిల్క్‌ బ్యాంకు వాళ్లు వచ్చి ఆ పౌచ్‌లను కోల్డ్‌ స్టోరేజ్‌ బాక్స్‌లో పెట్టి బ్యాంకుకు చేరుస్తారు. బ్యాంకులో పాలను పాశ్చరైజ్‌ చేస్తారు. ఇన్‌ఫెక్షన్‌ కారకాలైమేనా ఉన్నాయేమోనని పరీక్ష చేస్తారు. ఆ తర్వాత పాలను చల్లబరిచి డీప్‌ఫ్రీజర్‌లో మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు.

ఇలా మిల్క్‌ బ్యాంకులో నిల్వ చేసిన పాలను నాలుగు నుంచి ఆరునెలల వరకు ఉపయోగించవచ్చు. ‘పాలను సేకరించడం, మిల్క్‌ బ్యాంకుకు తరలించడం, ప్రాసెస్‌ చేయడం, నిల్వ చేయడం, అవసరమైన బిడ్డకు అందించడం’ ఇన్ని దశలుంటాయి. సాధారణంగా బ్లడ్‌బ్యాంకుల గురించి తెలిసినంతగా మిల్క్‌ బ్యాంకుల గురించి జనానికి పెద్దగా తెలియదు. కానీ చదువుకున్న మహిళల్లో చైతన్యం బాగా వచ్చిందని, హైదరాబాద్‌ నగరంలో 18వందలకు పైగా తల్లులు ధాత్రితో అనుసంధానమై పాలదానం చేస్తున్నారని తెలియచేశారు ధాత్రి నిర్వహకులు.

పాలదాతలు  
తల్లి నుంచి పాలను సేకరించిన తర్వాత మామూలుగా నిల్వ ఉంచితే గంట లేదా రెండు గంటల్లో ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆరుగంటల వరకు వాడవచ్చు. ప్రసవం సెలవు పూర్తి చేసుకుని డ్యూటీలకు వెళ్లే తల్లులు ఇదే పద్ధతి పాటిస్తుంటారు. నెలల కొద్దీ నిల్వ ఉండేవి మిల్క్‌ బ్యాంకులో నిల్వ చేసినవి మాత్రమే. మిల్క్‌ డోనర్‌ మదర్‌లకు మేము పౌచ్‌ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. పౌచ్‌ను డీప్‌ ఫ్రీజర్‌లోనే పెట్టాలి. ఆ ఫ్రీజర్‌లో మరేదీ పెట్టకూడదు. ఇలా నిల్వ చేసిన పాలను వారం పది రోజుల్లో బ్యాంకుకు తెప్పించుకుంటాం. కరెంట్‌ పోతే అప్పటి వరకు ఇంట్లో నిల్వ చేసిన పాలను వెంటనే బ్యాంకుకు చేర్చాలి. మిగులు పాలు ఉన్న తల్లులనే ఎంపిక చేసుకుంటాం. కాబట్టి మిల్క్‌ డోనర్‌ల బిడ్డల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూనే మరొక బిడ్డకు ప్రాణం పోయవచ్చు.  
డా. భవాని కలవలపల్లి
పీడియాట్రీషియన్‌ , వైస్‌ ప్రెసిడెంట్, సుశేన హెల్త్‌ ఫౌండేషన్‌ సీఈవో, ఐడియా క్లినిక్స్‌

ఏడాదికి ఎనిమిది లక్షల మంది శిశువులు తల్లిపాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలన్నీ బిడ్డకు ఆరు నెలలు నిండేలోపే సంభవిస్తున్నట్లు డబ్లు్యహెచ్‌వో లెక్కలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో టైప్‌ టూ డయాబెటిస్, ఒవేరియన్‌ క్యాన్సర్, బ్రెస్ట్‌ క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేసే బ్రెస్ట్‌ ఫీడింగ్‌ పట్ల అవేర్‌నెస్‌ కోసం ఏటా ఆగస్టు మొదటి వారం రోజులను కేటాయించింది డబ్లు్యహెచ్‌వో. ఈ ఏడాది ‘స్టెప్‌ అప్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌–ఎడ్యుకేట్‌ అండ్‌ సపోర్ట్‌’ థీమ్‌తో ముందుకెళ్తోంది.

– వాకా మంజులారెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement