mother roll
-
రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!
హీరోలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. వారితో పోలిస్తే – హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే.. హీరో ఎప్పటికీ హీరోనే! 50 – 60 ఏళ్లు దాటినా హీరోగా చేయొచ్చు. కానీ హీరోయిన్‌కు 30 మహా అయితే 40 టచ్ అయ్యేవరకూ ఓకే. అది కూడా ఏ కొందరో 30 దాటినా హీరోయిన్లుగా చేయగలుగుతారు. చాలామటుకు 30 టచ్ అయ్యాక అక్కా, వదిన పాత్రలకు అడుగుతారు. 40 దాటితే అమ్మ పాత్రలు ఆఫర్ చేస్తారు. మేల్ యాక్టర్, ఫీమేల్ యాక్టర్‌కి ఉన్న ఈ వ్యత్యాసం గురించి ఓ కార్యక్రమంలో నటి రాధిక మాట్లాడుతూ – ‘‘నేను ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు బిజినెస్ ఉమన్ (సినిమా, సీరియల్ నిర్మాణం) గానూ మారాను. ఎందుకంటే నా కెరీర్ నా కంట్రోల్లో ఉండాలనుకున్నాను. భవిష్యత్తులో నన్ను రజనీకాంత్‌కి అమ్మ (రజనీ సరసన తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించారు రాధిక)గా చేయమని అడుగుతారని నాకు ముందే తెలుసు. నటుల విషయంలో ఎవరికీ ఎలాంటి ముందస్తు ఆలోచనలు ఉండవు. కానీ నటీమణుల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనా కెరీర్ పరంగా దాటుతున్న ప్రతి మైలురాయికీ నేనింకా బెటర్ అవుతున్నాను’’ అన్నారు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ – ‘‘చూసేవారికి నా కెరీర్ చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలున్నాయి. అసలు నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఒక డైరెక్టర్ నన్ను నటించమని అడిగారు. నేను లెజండరీ యాక్టర్ ఎం.ఆర్. రాధ కూతుర్ని అని ఆయనకు తెలియదు. వాస్తవానికి నేనప్పుడు అంత అందంగా కూడా ఉండేదాన్ని కాదు. ‘నా ముఖాన్ని ఎవరు చూస్తారు’ అని ఆయనతో అన్నాను. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండానే కెమెరా ముందుకొచ్చాను. ఇంతదాకా వచ్చేశాను’’ అన్నారు రాధిక. -
కూతురే టీచర్ అయితే..
చిన్నప్పుడు పిల్లలకు అమ్మా, ఆవు అని పలక మీద దిద్దిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల వల్ల తల్లిదండ్రులతో డిజిటల్ పలక (ఐపాడ్, ఐఫోన్)పై కొత్త విషయాలను దిద్దిస్తున్నారు పిల్లలు. బాలీవుడ్ నటి కాజోల్ కూడా తన కూతురు దగ్గర టెక్నాలజీ పాఠాలు కొన్ని నేర్చుకున్నారట. కొన్ని వారాల పాటు కూతురి దగ్గర క్రాష్ కోర్స్ చేశారట. కాజోల్ లేటెస్ట్ సినిమా ‘హెలికాఫ్టర్ ఈల’. ఇందులో న్యూ జనరేషన్ మదర్‌గా యాక్ట్ చేశారామె. దాని కోసం కూతురి దగ్గర ఇన్స్టాగ్రామ్, ట్వీటర్ హ్యాష్ ట్యాగ్స్, చాటింగ్‌లో షార్ట్ కట్స్ నేర్చుకున్నారట. ఈ లేటెస్ట్ టెక్నికల్ షార్ట్‌కట్స్‌ను త్వరగానే నేర్చుకోగలిగారట కాజల్. ‘హెలికాఫ్టర్ ఈల’ ఈ నెల 12న రిలీజ్ కానుంది. -
తల్లి పాత్రలో...
ఎన్ ఫర్ ‘నర్మద’. ప్రస్తుతం ఇలాగే చెబుతున్నారు కథానాయిక నందితా శ్వేత. ఎందుకంటే ఆమె నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఇది. ఇందులో ఏడేళ్ల బాబుకి తల్లి పాత్రలో నటించడానికి నందిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కథ బాగా నచ్చడంతో తల్లి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారట. గీతా రాజ్‌పుత్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. ‘‘మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంది. నందితకు ఇది డిఫరెంట్ క్యారెక్టర్’’ అన్నారు దర్శకుడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో మంచి అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన నందిత ఇప్పుడు నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’లో ఓ నాయికగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా మరో నాయిక. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులోపు రిలీజ్ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. -
నాలుగేళ్ల పాపకు తల్లి!
‘‘అప్పుడే అమ్మ పాత్రలా? ఏమంత వయసైపోయిందని?’’ అని అమ్మ పాత్రలకు అడిగినప్పుడు కొందరు హీరోయిన్లు అంటుంటారు. ఒకసారి అమ్మగా కనిపిస్తే.. ఆ తర్వాత అలాంటి పాత్రలకే ఫిక్స్ చేసేస్తారని భయం. కానీ, సాయి పల్లవికి అలాంటి భయాలేవీ లేవు. ‘ప్రేమమ్’, ‘ఫిదా’ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారీ బ్యూటీ. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే, తను చేసిన పాత్రల గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలన్నది ఆమె అభిప్రాయం. అందుకే అమ్మ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నారు సాయిపల్లవి. తెలుగులో ‘కణం’, తమిళంలో ‘కురు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తోంది! - జెనీలియా
జెనీలియా... ఈ పేరు చెప్పగానే ‘బాయ్స్’ చిత్రంలోని టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్రధారిణి దాకా ఎన్నో వెండితెర దృశ్యాలు గుర్తుకొస్తాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్రస్థాయికి చేరుకొని, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళి చేసుకున్న ఈ అందాల నటి కొద్ది నెలల క్రితమే ఒక బాబుకు తల్లి అయ్యారు. అమ్మగా కొత్త బాధ్యతలు మీద పడ్డ జెనీలియా ఈ కొత్త పాత్రను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లల డయాపర్ల బ్రాండ్ ‘ప్యాంపర్స్’ ప్రకటనకు ఎండార్స్మెంట్ చేసిన జెనీలియా తన తల్లి పాత్ర గురించి తొలిసారిగా పంచుకున్న విశేషాలు... ♦ ఏకకాలంలో ఇంటి పని, చంటిబాబు పని చూసుకోవడం కొద్దిగా కష్టమే. కానీ, నా తొలి ప్రాధాన్యం బాబుకే! ఆ తరువాతే ఇంటి వ్యవహారాలు. మా బాబు రియాన్‌కు మూడు నెలలే. అదృష్టం ఏమిటంటే - రియాన్ రాత్రంతా నిద్రపోతాడు. అందువల్ల తల్లిగా నేను హ్యాపీ. నేను సంతోషంగా ఉండడం వల్ల అన్ని పనులూ సవ్యంగా చేసుకోగలుగుతున్నా. సానుకూలంగా స్పందించగలుగుతున్నా. బాబును హాయిగా ఆడించగలుగుతున్నా. ♦ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాబు పనులన్నీ స్వయంగా నేనే చేసుకోవడం వల్ల బాగా అలసిపోతున్నా. అయితే, కొత్తగా వచ్చిన ఈ తల్లి పాత్రను బాగా ఆస్వాదిస్తున్నా. తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభూతి. నాకు పదే పదే మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. మనకంటూ ఒక బిడ్డ పుట్టాక, మనకు మన అమ్మ మీద అమితంగా ప్రేమ పెరుగుతుందంటే నమ్మండి. ♦ చంటిపిల్లాణ్ణి పెంచడంలో మా అమ్మ నుంచి, మా అత్త గారి నుంచి బోలెడన్ని సలహాలు తీసుకుంటూ ఉంటా. అయితే, నా బుద్ధికి తోచినట్లు చేస్తా. చంటిపిల్లాడికి ఏం కావాలన్నది తల్లికి తెలిసినట్లుగా వేరెవరికీ తెలియదు. అయినా ఎవరో అన్నట్లు, చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు మాత్రం ఉండరు! ♦ మా ఆయన రితేశ్ దేశ్‌ముఖ్ కూడా పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. నేను గర్భవతినన్న సంగతి తెలిసిన క్షణమే ఆయన ఒక మాట అన్నారు... ‘నిజానికి, నువ్వొక్కదానివే కాదు, మన ఇద్దరం ఇప్పుడు ప్రెగ్నెంటే!’ జీవిత భాగస్వామి నుంచి ఏ స్త్రీకైనా అంతకు మించి ఇంకేం కావాలి! తండ్రి కాబోతున్న క్షణంలో ఆయనకొచ్చిన గొప్ప ఆలోచన అది. ఇలాంటి ఆలోచన వల్ల జీవిత భాగస్వాములిద్దరూ ఆ గర్భధారణ సమయాన్నీ, ప్రసవాన్నీ కలసి ఆస్వాదిస్తారు. అలాగే, తల్లితండ్రులుగా వచ్చిపడ్డ కొత్త బాధ్యతల్ని పంచుకుంటారు. రితేశ్ కూడా మా బాబుకి డయాపర్స్ మారుస్తారు, స్నానం చేయిస్తారు. బాబు నిద్రపోకపోతే, నాతో పాటే రాత్రంతా మెలకువగా ఉంటారు. పసిపిల్లల్ని పెంచడం కేవలం తల్లి బాధ్యతే కాదు, తండ్రి బాధ్యత కూడా అని గ్రహిస్తే, ఆ సంసారంలో అంతకన్నా ఆనందం ఏముంటుంది! ♦ నన్నడిగితే తల్లులకు మాతృత్వపు సెలవు ఇచ్చినట్లే, తండ్రులకు ‘పేటర్నిటీ లీవ్’ ఇవ్వాలి. దాన్ని చట్టబద్ధం చేయాలి. లేకపోతే, ఇతర పనుల్లో పడిపోయి, భార్యాబిడ్డలతో గడిపే తీరికే వాళ్ళకు ఉండదు. ♦ పెళ్ళయ్యాక మీలో వచ్చిన మార్పేమిటి? తల్లయ్యాక వచ్చిన మార్పేమిటి? అని నన్ను అందరూ అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే, మనం మనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూ పిల్లల్ని పెంచాలి. అది చంటిపిల్లల పెంపకంలో ప్రతిఫలిస్తుంది. అలా కాకుండా మరొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడిక మొత్తం కుప్పకూలిపోతుంది. హుషారుగా, ఆనందంగా ఉండే అమ్మాయి మా అమ్మ అని గుర్తించేలా మా అబ్బాయి పెరగాలనుకుంటున్నా. ♦ పసిబిడ్డకు తల్లి అయ్యాక సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా శారీరక మార్పులు తప్పవు. గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఎంతైనా లావు కావచ్చు. బిడ్డ పుట్టాక మళ్ళీ క్రమంగా అందం మీద దృష్టి పెట్టక తప్పదు. అలాగే, తల్లి పాత్ర వల్ల నటిగా లైమ్‌లైట్‌కు దూరమయ్యానని అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, జీవితంలో నేనేమీ మిస్సవడం లేదు. తల్లి పాత్ర అలవాటయ్యాక ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నా. మొన్నటిదాకా నటిగా, నిన్న గర్భవతిగా, ఇప్పుడు తల్లిగా - ఇలా ప్రతి దశనూ ఆస్వాదిస్తూనే ఉన్నా.