
‘‘అప్పుడే అమ్మ పాత్రలా? ఏమంత వయసైపోయిందని?’’ అని అమ్మ పాత్రలకు అడిగినప్పుడు కొందరు హీరోయిన్లు అంటుంటారు. ఒకసారి అమ్మగా కనిపిస్తే.. ఆ తర్వాత అలాంటి పాత్రలకే ఫిక్స్ చేసేస్తారని భయం. కానీ, సాయి పల్లవికి అలాంటి భయాలేవీ లేవు. ‘ప్రేమమ్’, ‘ఫిదా’ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారీ బ్యూటీ.
భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే, తను చేసిన పాత్రల గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలన్నది ఆమె అభిప్రాయం. అందుకే అమ్మ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారు. నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో నాలుగేళ్ల పాపకు తల్లిగా నటిస్తున్నారు సాయిపల్లవి. తెలుగులో ‘కణం’, తమిళంలో ‘కురు’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.