ఒక్క రోజే హడావుడి
తాత్కాలికంగా రోగుల తరలింపు ప్రక్రియ నిలిపివేత
అడ్మిట్ అయిన రోగులను నేరుగా కింగ్‌కోఠికి
సగానికి పైగా తగ్గిన అడ్మిషన్లు
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. బుధవారం ఆగమేఘాలపై 24 మంది ఆర్థోపెడిక్ రోగులను తరలించిన ప్రభుత్వం గురువారం ఒక్క రోగిని కూడా తరలించలేదు. దశల వారిగా రోగులను తరలిస్తామని చెప్పిన వైద్యులు తమకు ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పేర్కొన్నారు. ఆర్థో విభాగంలోని రోగులను తరలించాలన్నా వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతలను బేరీజు వేసుకుని గురువారం తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది.
ఓపీ నుంచి నేరుగా కింగ్‌కోఠికి...
ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో చికిత్సలు నిర్వహించిన వైద్యులు ఆర్థోపెడిక్ ఇన్పేషెంట్లను నేరుగా కింగ్‌కోఠి ఆసుపత్రికి తరలిస్తున్నారు. గురువారం 6 గురు రోగులను కింగ్‌కోఠికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రోగులకు పూర్తి వైద్యసేవలు అందించి ఇక్కడి నుంచే డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించనట్లు వైద్యులు తెలిపారు.
పూర్తి వైద్యసేవలు ఇక్కడే....
ఉస్మానియా ఆసుపత్రి పాత భవనంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారికి ఇక్కడే పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందించి డిశ్చార్జ్ చేయాలని, కొత్త అడ్మిషన్లను నేరుగా కింగ్‌కోఠికి తరలించేలా చర్యలు తీసుకున్నాట్లు సమాచారం.
తగ్గిన రోగుల సంఖ్య...
ఉస్మానియా ఆసుపత్రిని తరలిస్తున్నారన్న వార్తలతో ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఓపీ బ్లాక్‌లో రోజు సగటున 150 నుంచి 200 మంది అడ్మిట్ అవుతుండగా, ప్రస్తుత వారి సంఖ్య 70 నుంచి 80 వరకు ఉంది. ఇక ఔట్ పేషెంట్ల సంఖ్య రోజుకు సగటున 1500 నుంచి 1800ల వరకు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 800 నుంచి 900 పడిపోయింది. ఉస్మానియాను తరలిస్తున్నారని తెలియడంతో రోగులు ఆస్పత్రికి రావడంలేదని వైద్యులు తెలిపారు.