MP Varun gandhi
-
లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరిలో ఘటనలో బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకి దిగుతున్నారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయి రైతులకు మద్దతుగా మాట్లాడిన పాత వీడియో క్లిప్పుని గురువారం ఆయన ట్వీట్ చేశారు. 1980లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వ రైతు అణిచివేత విధానాలను వాజ్‌పేయి ఖండిస్తూ అన్నదాతలకు అండగా ఉంటానంటూ చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని షేర్ చేశారు. ‘‘ప్రభుత్వం రైతుల్ని అణిచివేసినా, రైతు చట్టాలను దుర్వినియోగం చేసినా, వారు శాంతియుతంగా చేసే నిరసనల్ని అణగదొక్కినా మనం రైతు పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. వారి నుంచి దూరంగా పారిపోవాలి్సన పనిలేదు’’ అని వాజ్‌పేయి ఆ వీడియోలో పేర్కొన్నారు. లోతైన హృదయం ఉన్న నాయకుడి గొప్ప మాటలు ఇవి అంటూ వరుణ్ గాంధీ కొనియాడారు. -
రేటింగ్ సంస్థల లోపాలపై నిఘా!
విశ్లేషణ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చేసే శక్తి క్రెడిట్ రేటింగ్ సంస్థలకు ఉంది కాబట్టి సెబీ వంటి ఆర్థిక రెగ్యులేటరీ వ్యవస్థలు పరపతి సంస్థల అంచనాలపై పూర్తి నిఘా ఉంచి పరిశ్రమ ప్రమాణాలను అవి పాటించేలా చేయాలి. అసాధారణ రేటింగ్‌లు, ఉన్నట్టుండి రేటింగ్లను తగ్గించడంపై అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యక్తిని, ఒక సంస్థనూ, చివరకు ఒక దేశాన్ని కూడా కొలవడం అనేది యుగాలుగా జరగుతున్న ప్రక్రియ. ప్రాచీన చరిత్ర కారుడు హెరొడోటస్ సిరీన్ పండితుడు కల్లిమచుస్తో కలిసి ప్రపంచపు ఏడు వింతల జాబితాను రూపొందించాడు. వాటి విలువను అత్యద్భుతమైన శైలితో వర్ణించాడు. అయితే ఆధునిక క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇటీవల కాలంలో మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 1837లో ఆర్థిక సంక్షోభం వెలుగులో ఇవి మొట్టమొదటి సారిగా ఉనికిలోకి వచ్చాయి. న్యూయార్క్‌లో 1841లో లెవిస్ టప్పన్ తొలి క్రెడిట్ రేటింగ్ సంస్థను నెలకొల్పాడు. వ్యాపారి రుణం చెల్లించే సామర్థ్యాన్ని కొలిచే అవసరంలో భాగంగా ఇవి పుట్టుకొచ్చాయి. అలాంటి డేటాను అప్పట్లో లెడ్జర్లలో పదిలపర్చేవారు. అచిరకాలంలోనే ఈక్విటీ వాటాలకు కూడా వీటిని వర్తింపజేశారు. తర్వాత స్వతంత్ర మార్కెట్ సమాచారం కోసం డిమాండ్ ఏర్పడింది. పరపతి విలువను నిజాయితీగా విశ్లేషించే కొలమానాలను ప్రతిపాదిస్తూ మూడీస్ రేటింగ్స్ సంస్థ ప్రచురణలు పారిశ్రామిక సంస్థలు, వాటి ప్రయోజనాలపై ఉత్తరాల రూపంలో రేటింగ్ ఇచ్చేవి. 1920 నాటికి ప్రపంచంలో మూడు అతిపెద్ద రేటింగ్ సంస్థలు (మూడీస్, ఫిచ్, స్టాండర్డ్ – పూర్) నెలకొన్నాయి. 1960ల నాటికి ఇలాంటి రేటింగ్‌లు వాణిజ్య పత్రాలు, బ్యాంక్ డిపాజిట్లు, గ్లోబల్ బ్యాండ్ మార్కెట్, సావరిన్ బాండ్లకు విస్తరించాయి. అయితే ప్రపంచ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అనిర్దిష్టమైన, అసందర్భ రేటింగులతో విశ్వసనీయత విషయంలో విఫలమవుతూ వచ్చాయి. దీంతో అమెరికా న్యాయ విభాగం 1996లో మూడీస్ వంటి సంస్థల రేటింగ్ పద్ధతులపై విచారణకు పూనుకుంది. ప్రత్యేకించి ఎన్రాన్ పతనం, అమెరికాలో ఇటీవలి సబ్ ప్రైమ్ దివాళా సంక్షోభం తర్వాత అన్ని క్రెడిట్ రేటింగ్ సంస్థలూ న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. మూడీస్ అయితే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ప్రామాణిక రేటింగ్ విధివిధానాలను పాటించనుందుకు గాను అనేక జరిమానాల పాలబడింది. ఒక్క అమెరికాలోనే మూడీస్ సబ్ ప్రైమ్ సంక్షోభంలో దాని పాత్రకు గానూ 864 మిలియన్ల డాలర్ల మేరకు జరిమానా చెల్లించవలసి వచ్చింది. స్టాండర్డ్ – పూర్ కూడా అమెరికన్ ప్రభుత్వానికి 1.4 బిలియన్ డాలర్ల జరిమానాను చెల్లించాల్సి వచ్చింది. భారత్‌లో కూడా రేటింగ్ ఏజెన్సీలకు ద్వంద్వ రికార్డు ఉంది. ఆమ్టెక్ ఆటో, రికోహ్ ఇండియా వంటి కేసుల కారణంగా రేటింగ్ సంస్థలపై సెబీ దర్యాప్తు ప్రారంభించి నిబంధనలను కఠినతరం చేసింది. పరిశ్రమ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా రేటింగ్ సంస్థలకు ముకుతాడు వేసేందుకు సెబీ రంగం సిద్ధం చేసింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సరైన అంచనాలను ఇవ్వని రేటింగ్ సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. 1990లలో తూర్పు ఆసియా సంక్షోభం దీనికి తిరుగులేని ఉదాహరణ. అమెరికా, యూరోపియన్ సావరిన్ రుణాల సంక్షోభం, గ్రీస్, పోర్చుగల్, ఐర్లండ్ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోవడం, యూరో జోన్ కనీవినీ ఎరుగని నిరుద్యోగ సంక్షోభంలో చిక్కుకుపోవడం వంటివి ఇటీవలి ఉదాహరణలు. రేటింగ్ సంస్థల వైఫల్యంతో విసిగిపోయిన రష్యా, చైనా దేశాలు తమ సొంత రేటింగ్ ఏజెన్సీలను ఏర్పర్చుకున్నాయి కూడా. వ్యవస్థాగత లోపాలు చాలా ఉన్నప్పటికీ, క్రెడిట్ రేటింగ్ సంస్థల నుంచి అధిక రేటింగ్ స్థాయిలను పొందడానికి దేశాలు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాయి. దీన్ని సాకుగా తీసుకుని క్రెడిట్ రేటింగ్ సంస్థలు రేటింగేతర కార్యకలాపాల ద్వారా ఆదాయల సాధనకు పూనుకున్నాయి. ఇలా లాభార్జన కోసం రేటింగ్ సంస్థల పాట్లు అనేవి ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తీసుకువచ్చాయి. ఏమైనప్పటికీ మన పురోగమన గమ్యంలో రేటింగ్ సంస్థలను సమర్థంగా ఉపయోగించుకోవలసిన బాధ్యత ఆయా దేశాలపై ఉంది. ఈ క్రమంలో అసాధారణ రేటింగులు, ఉన్నట్లుండి రేటింగులను తగ్గించడం వంటి పరిణామాలపై సెబీ వంటి సంస్థలు నిఘా పెంచాల్సి ఉంది. దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చేసే శక్తి క్రెడిట్ రేటింగ్ సంస్థలకు ఉంది కాబట్టి సెబీ వంటి ఆర్థిక రెగ్యులేటరీ వ్యవస్థలు పరపతి సంస్థల అంచనాలపై పూర్తి నిఘా ఉంచి పరిశ్రమ ప్రమాణాలను అవి పాటించేలా చేయాలి. అలాగే ప్రభుత్వ స్థాయిలో కూడా త్రైమాసికం తర్వాత త్రైమాసికంలో మన పరపతి రేటింగును పెంచుకోవడానికి ప్రయత్నించడం బదులుగా, మన ఆర్థిక విధాన నిర్ణయాలు సంపూర్ణ ఉపాధి, సృజన, ఆవిష్కరణ వంటి ఆర్థిక వృద్ధి విధానాలకు ముందుకు తీసుకుపోయేలా ఉండాలి. - వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు fvg001@gmail.com -
పదవీ విరమణ.. పదవులు
విశ్లేషణ కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ఇక్కడే పరస్పర ప్రయోజనాల మధ్య వైరుధ్యం తలెత్తడానికి ప్రాతిపదిక ఉంది. పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బీజీ దేశ్‌ముఖ్ రిటైర్మెంట్ తర్వాత ఒక పెద్ద ప్రైవేట్ సంస్థలో చేరవచ్చా అని 1990లో నాటి ప్రధానిని అడిగారు. దశాబ్దాలపాటు ప్రభుత్వంలో సేవలందించిన ఆయన తనను అనుమతిస్తే పదవీ విరమణ తర్వాత కార్పొరేట్ రంగానికి వెళ్లాలని ఆకాంక్షించారు. నోటిమాటతో ఆమోదించడం నుంచి రాతపూర్వకంగా నిరాకరించడం వరకు ఆయన అభ్యర్థనకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉదాసీనత దెబ్బ తీసింది. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ రాజీనామా లేదా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కార్పొరేట్ ఉద్యోగాలపై చేరడానికి సంబంధించిన ఉదాసీనతను తొలగించి, ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని–కాన్‌ఫ్లిక్టింగ్ ఆఫ్ ఇంటరెస్ట్–క్రోడీకరిం చవలసిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు నొక్కి చెబుతాయి. పాశ్చాత్య దేశాల్లో సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగం చేయడానికి మూలం ఈ ప్రయోజనాల మధ్య వైరుధ్యమే. చాలావరకు బ్రిటన్ చరిత్రలో పాలకులు, వారి అధికారుల మధ్య ఈ ప్రయోజనాల వైరుధ్యం విస్తృతంగా ఉండేది. 1660లో రాయల్ నేవీలో గొప్ప సంస్కర్త శామ్యూల్ పెపీస్ సైతం స్మగ్లింగ్‌లో పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చాయి. కానీ కాలానుగుణంగా పాలక సంస్కృతిలో మార్పు వచ్చింది. చక్రవర్తి కింద పనిచేసే మంత్రులు ఉన్నతోద్యోగ వర్గంలో సమర్థతను పెంచేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అప్పట్లో బ్రిటన్ అనేక యుద్ధాల్లో మునిగి ఉన్నందున ప్రత్యేకించి పన్నుల సేకరణలో సమర్థ పాలన అత్యవసరమైంది. స్వతంత్ర న్యాయవ్యవస్థతోపాటు వికసిస్తున్న ప్రెస్ వల్ల కార్యనిర్వాహక వర్గానికి, దాని అధికార దుర్వినియోగానికి పరిమితులు విధిం చాయి. విద్యా వ్యాప్తి వల్ల, ప్రజల్లో తమ హక్కుల పట్ల అప్రమత్తత పెరి గింది. ఇక జాతీయ ఆడిటర్ ఆఫీసు ఏర్పాటుతో పాలనా వ్యవహారాల్లో అవినీతిని తగ్గించడానికి దారితీసింది. 20వ శతాబ్ది నాటికి బ్రిటన్‌లో అవినీతి గణనీయంగా బలహీనపడింది. కొంతమంది ఉన్నతోద్యోగులు పబ్లిక్ సర్వీసులోని సుగుణాలను, రిటైర్మెంట్ సమయంలో ప్రైవేట్ లాభంతో కలిపేశారు. తమ చర్యలు, వైఖరుల కారణంగా వీరు ప్రయోజనాల మధ్య వైరుధ్యం బారిన పడ్డారు. దీనికి బదులుగా సామాజిక చైతన్యపరులు, నేతలు వీటిపై ప్రశ్నలు సంధించినప్పుడు వారి వాదనలు వృద్ధికి, పెట్టుబడికి వ్యతిరేకం అని ఆరోపిస్తూ ప్రశ్నించినవారినే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తూ వచ్చారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రయోజనాల మధ్య వైరుధ్యం విషయంలో మన ఉదాసీన సంçస్కృతిని మార్చేవైపుగా సరైన న్యాయ యంత్రాంగాన్ని కూడా నెలకొల్పాల్సి ఉంది. ఇకపోతే, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారక సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ) ఉదాహరణను తీసుకుంటే, వ్యవస్థలోని రెగ్యులేటరీ బోర్డులను స్వార్థ ప్రయోజనాలు క్రమేణా కమ్మేస్తూ వచ్చాయి. ఆహారభద్రతను పర్యవేక్షించడంలో ఈ రెగ్యులేటర్ సూత్రరీత్యా స్వతంత్రంగా ఉండాలని భావించారు కానీ, 2014 వరకు ఆహార పరిశ్రమ ప్రతినిధులే దీనికి సంబంధించిన శాస్త్రీయ కమిటీలలో నియమితులవుతూ వచ్చారు. పురుగు మందులు, ఆహారాన్ని లేబుల్ చేయడం, వేడి చేసి మళ్లీ కావలసిన రూపంలో చల్లబర్చడం వంటి అంశాల్లో ప్రమాణాల కల్పనలో అధికారులను అనుసంధానించేవారు. ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక సైన్స్ విభాగాల్లో పలు పరిశోధన ప్యానెళ్లకు కార్పొరేట్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను నియమిస్తూ వచ్చారు. ఉదాహరణకు, మానవులపై జరిపే క్లినికల్ పరీక్షలకు చెందిన ఒక ప్యానెల్లో నియమితుడైన నిపుణుడు అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ పరీక్షల విభాగాధిపతిగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ నియమావళిలో ఎలాంటి విధానాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందనుకోవద్దు. భారత ఉద్యోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో దీనికి సంబంధించి ఓ అధికారిక విధానం ఉంది. దీని ప్రకారం సీనియర్ ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత వాణిజ్య రంగంలో ఉపాధి పొందాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవలసిందే. కానీ, ఇలాంటి పరిమితిని మంజూరు చేయడం ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండేది కానీ దీనిపై ఎలాంటి క్రోడీకరణ యంత్రాంగం ఉండేది కాదు. చిట్టచివరకు అలాంటి అభ్యర్థనలపై ప్రభుత్వాలు ఒక ఉదార వైఖరిని చేపట్టాయి. ఉదాహరణకు, ఒక రెవెన్యూ కార్యదర్శి ఒకటి కాకుండా అయిదు సంస్థల్లో పలుహోదాల్లో చేరడానికి అనుమతించారు. ట్రాయ్ మాజీ అధిపతి రిటైరైన కొద్ది నెలల్లోపే అపఖ్యాతి చెందిన ఒక కార్పొరేట్ లాబీయిస్ట్ ప్రమోట్ చేసిన సంస్థలో పనిచేయడానికి అనుమతించారు. ఇకపోతే, కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తొలగిస్తూ నిబంధనలను అమలుచేస్తే అలాంటి బ్యూరోక్రాట్లు ప్రైవేట్ రంగంలో తమ అనుభవాన్ని ఉపయోగిస్తే తప్పులేదు. ప్రయోజనాల మధ్య వైరుధ్యంలో తమ పాత్రను బహిర్గతం చేయని వారిని శిక్షించేలా మనం చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఇఎమ్‌ఎస్ నాచియప్పన్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ 2012 ప్రకారం, ఇలాంటి చట్టం న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వంటి పాలనా రంగాలన్నింటికీ వర్తించాల్సి ఉంది. రిటైరయ్యాక ప్రైవేట్ రంగంలో చేరాలని ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా రిటైర్ అయ్యేలా నిబంధనలను మార్చాలని, కనీసం అయిదేళ్ల పాటు ప్రవేట్ రంగంలో పనిచేయకుండా వారిపై ఆంక్షలు విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది కూడా. అప్పుడే రిటైరైన ఉన్నతాధికారి ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని తాను చేరే ప్రైవేట్ సంస్థకు ఉపయోగించలేడు. అదే సమయంలో అలాంటి సంస్థలలో చేరతామని రిటైర్డ్ అధికారులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చడానికి కారణాలను కూడా స్పష్టంగా ఈ చట్టంలో పొందుపర్చాలి. అంతిమంగా పారదర్శకతా సంస్కృతిని పెంపొందించాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ వ్యవహారాల్లో పాలు పంచుకోలేదని స్పష్టం చేయడమే కాకుండా ఉన్నతాధికారులు కూడా తమ రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి ముందే బహిరంగ పర్చడం చాలా అవసరం. ఇలాంటి పారదర్శకత లేనిదే భారతీయ సమాజం, పాలనా వ్యవస్థ, దాని ప్రైవేట్ రంగం ఇన్ సైడర్ ట్రేడింగుతో ఘర్షిస్తూనే ఉంటుంది. -వరుణ్ గాంధీ వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు fvg001@gmail.com -
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కోర్టు నోటీసులు
లక్నో (యూపీ): బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి పిలిభిత్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. 2009 ఎన్నికల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని దాఖలైన కేసు గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. అయితే వరుణ్ ఈ కేసు విచారణకు గైర్హాజరు కావడంతో జిల్లా కోర్టు జడ్జి కౌటిల్య కుమార్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 30న కోర్టు ఎదుట హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. వరుణ్ 2009లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కొన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. కార్యకర్త అసద్ హయత్ ఈ విషాయంపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో పిలిభిత్ ప్రాంతంలో వరుణ్ గాంధీ చేసిన ప్రసంగం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని అసద్ పేర్కొన్నారు. 2009 మార్చి8న చేసిన ప్రసంగం విషయంలో ఆ నెల 17న బార్ఖేరా పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే విధంగా దాల్చండ్ లో కూడా మత విద్వేష ప్రసంగాలు చేయగా మార్చి 18న సర్దార్ కొత్వాలీ పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వరుణ్ ఈ కేసు విచారణకు హాజరుకాలేదని అసద్ తరఫు న్యాయవాది ఖాద్రీ షాకిర్ పేర్కొన్నారు.