విశ్లేషణ
కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ఇక్కడే పరస్పర ప్రయోజనాల మధ్య వైరుధ్యం తలెత్తడానికి ప్రాతిపదిక ఉంది.
పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి బీజీ దేశ్‌ముఖ్ రిటైర్మెంట్ తర్వాత ఒక పెద్ద ప్రైవేట్ సంస్థలో చేరవచ్చా అని 1990లో నాటి ప్రధానిని అడిగారు. దశాబ్దాలపాటు ప్రభుత్వంలో సేవలందించిన ఆయన తనను అనుమతిస్తే పదవీ విరమణ తర్వాత కార్పొరేట్ రంగానికి వెళ్లాలని ఆకాంక్షించారు. నోటిమాటతో ఆమోదించడం నుంచి రాతపూర్వకంగా నిరాకరించడం వరకు ఆయన అభ్యర్థనకు ఆమోదం తెలిపే ప్రక్రియను ఉదాసీనత దెబ్బ తీసింది. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ రాజీనామా లేదా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కార్పొరేట్ ఉద్యోగాలపై చేరడానికి సంబంధించిన ఉదాసీనతను తొలగించి, ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని–కాన్‌ఫ్లిక్టింగ్ ఆఫ్ ఇంటరెస్ట్–క్రోడీకరిం చవలసిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు నొక్కి చెబుతాయి.
పాశ్చాత్య దేశాల్లో సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగం చేయడానికి మూలం ఈ ప్రయోజనాల మధ్య వైరుధ్యమే. చాలావరకు బ్రిటన్ చరిత్రలో పాలకులు, వారి అధికారుల మధ్య ఈ ప్రయోజనాల వైరుధ్యం విస్తృతంగా ఉండేది. 1660లో రాయల్ నేవీలో గొప్ప సంస్కర్త శామ్యూల్ పెపీస్ సైతం స్మగ్లింగ్‌లో పాత్ర పోషించాడని ఆరోపణలు వచ్చాయి. కానీ కాలానుగుణంగా పాలక సంస్కృతిలో మార్పు వచ్చింది. చక్రవర్తి కింద పనిచేసే మంత్రులు ఉన్నతోద్యోగ వర్గంలో సమర్థతను పెంచేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. అప్పట్లో బ్రిటన్ అనేక యుద్ధాల్లో మునిగి ఉన్నందున ప్రత్యేకించి పన్నుల సేకరణలో సమర్థ పాలన అత్యవసరమైంది.
స్వతంత్ర న్యాయవ్యవస్థతోపాటు వికసిస్తున్న ప్రెస్ వల్ల కార్యనిర్వాహక వర్గానికి, దాని అధికార దుర్వినియోగానికి పరిమితులు విధిం చాయి. విద్యా వ్యాప్తి వల్ల, ప్రజల్లో తమ హక్కుల పట్ల అప్రమత్తత పెరి గింది. ఇక జాతీయ ఆడిటర్ ఆఫీసు ఏర్పాటుతో పాలనా వ్యవహారాల్లో అవినీతిని తగ్గించడానికి దారితీసింది. 20వ శతాబ్ది నాటికి బ్రిటన్‌లో అవినీతి గణనీయంగా బలహీనపడింది. కొంతమంది ఉన్నతోద్యోగులు పబ్లిక్ సర్వీసులోని సుగుణాలను, రిటైర్మెంట్ సమయంలో ప్రైవేట్ లాభంతో కలిపేశారు. తమ చర్యలు, వైఖరుల కారణంగా వీరు ప్రయోజనాల మధ్య వైరుధ్యం బారిన పడ్డారు. దీనికి బదులుగా సామాజిక చైతన్యపరులు, నేతలు వీటిపై ప్రశ్నలు సంధించినప్పుడు వారి వాదనలు వృద్ధికి, పెట్టుబడికి వ్యతిరేకం అని ఆరోపిస్తూ ప్రశ్నించినవారినే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తూ వచ్చారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడమే కాకుండా ప్రయోజనాల మధ్య వైరుధ్యం విషయంలో మన ఉదాసీన సంçస్కృతిని మార్చేవైపుగా సరైన న్యాయ యంత్రాంగాన్ని కూడా నెలకొల్పాల్సి ఉంది.
ఇకపోతే, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారక సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) ఉదాహరణను తీసుకుంటే, వ్యవస్థలోని రెగ్యులేటరీ బోర్డులను స్వార్థ ప్రయోజనాలు క్రమేణా కమ్మేస్తూ వచ్చాయి. ఆహారభద్రతను పర్యవేక్షించడంలో ఈ రెగ్యులేటర్ సూత్రరీత్యా స్వతంత్రంగా ఉండాలని భావించారు కానీ, 2014 వరకు ఆహార పరిశ్రమ ప్రతినిధులే దీనికి సంబంధించిన శాస్త్రీయ కమిటీలలో నియమితులవుతూ వచ్చారు. పురుగు మందులు, ఆహారాన్ని లేబుల్ చేయడం, వేడి చేసి మళ్లీ కావలసిన రూపంలో చల్లబర్చడం వంటి అంశాల్లో ప్రమాణాల కల్పనలో అధికారులను అనుసంధానించేవారు. ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక సైన్స్ విభాగాల్లో పలు పరిశోధన ప్యానెళ్లకు కార్పొరేట్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను నియమిస్తూ వచ్చారు. ఉదాహరణకు, మానవులపై జరిపే క్లినికల్ పరీక్షలకు చెందిన ఒక ప్యానెల్‌లో నియమితుడైన నిపుణుడు అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ పరీక్షల విభాగాధిపతిగా ఉండటం గమనార్హం.
ప్రభుత్వ నియమావళిలో ఎలాంటి విధానాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతోందనుకోవద్దు. భారత ఉద్యోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో దీనికి సంబంధించి ఓ అధికారిక విధానం ఉంది. దీని ప్రకారం సీనియర్ ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత వాణిజ్య రంగంలో ఉపాధి పొందాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవలసిందే. కానీ, ఇలాంటి పరిమితిని మంజూరు చేయడం ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండేది కానీ దీనిపై ఎలాంటి క్రోడీకరణ యంత్రాంగం ఉండేది కాదు. చిట్టచివరకు అలాంటి అభ్యర్థనలపై ప్రభుత్వాలు ఒక ఉదార వైఖరిని చేపట్టాయి. ఉదాహరణకు, ఒక రెవెన్యూ కార్యదర్శి ఒకటి కాకుండా అయిదు సంస్థల్లో పలుహోదాల్లో చేరడానికి అనుమతించారు. ట్రాయ్ మాజీ అధిపతి రిటైరైన కొద్ది నెలల్లోపే అపఖ్యాతి చెందిన ఒక కార్పొరేట్ లాబీయిస్ట్ ప్రమోట్ చేసిన సంస్థలో పనిచేయడానికి అనుమతించారు. ఇకపోతే, కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ సంస్థలో భారీ ప్యాకేజీతో చేరినప్పుడు అంత పెద్ద చెల్లింపులు వారి నైపుణ్యాల కోసం కాకుండా వారి పలుకుబడి కారణంగా దక్కాయన్న సందేహాలు తలెత్తాయి. ప్రయోజనాల మధ్య వైరుధ్యాన్ని తొలగిస్తూ నిబంధనలను అమలుచేస్తే అలాంటి బ్యూరోక్రాట్లు ప్రైవేట్ రంగంలో తమ అనుభవాన్ని ఉపయోగిస్తే తప్పులేదు.
ప్రయోజనాల మధ్య వైరుధ్యంలో తమ పాత్రను బహిర్గతం చేయని వారిని శిక్షించేలా మనం చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఇఎమ్‌ఎస్ నాచియప్పన్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్ 2012 ప్రకారం, ఇలాంటి చట్టం న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వంటి పాలనా రంగాలన్నింటికీ వర్తించాల్సి ఉంది. రిటైరయ్యాక ప్రైవేట్ రంగంలో చేరాలని ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా రిటైర్ అయ్యేలా నిబంధనలను మార్చాలని, కనీసం అయిదేళ్ల పాటు ప్రవేట్ రంగంలో పనిచేయకుండా వారిపై ఆంక్షలు విధించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది కూడా. అప్పుడే రిటైరైన ఉన్నతాధికారి ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని తాను చేరే ప్రైవేట్ సంస్థకు ఉపయోగించలేడు.
అదే సమయంలో అలాంటి సంస్థలలో చేరతామని రిటైర్డ్ అధికారులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చడానికి కారణాలను కూడా స్పష్టంగా ఈ చట్టంలో పొందుపర్చాలి. అంతిమంగా పారదర్శకతా సంస్కృతిని పెంపొందించాల్సి ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ వ్యవహారాల్లో పాలు పంచుకోలేదని స్పష్టం చేయడమే కాకుండా ఉన్నతాధికారులు కూడా తమ రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి ముందే బహిరంగ పర్చడం చాలా అవసరం. ఇలాంటి పారదర్శకత లేనిదే భారతీయ సమాజం, పాలనా వ్యవస్థ, దాని ప్రైవేట్ రంగం ఇన్ సైడర్ ట్రేడింగుతో ఘర్షిస్తూనే ఉంటుంది.
-వరుణ్ గాంధీ
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు fvg001@gmail.com
Comments
Please login to add a commentAdd a comment