బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కోర్టు నోటీసులు
లక్నో (యూపీ):
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి పిలిభిత్ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. 2009 ఎన్నికల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని దాఖలైన కేసు గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. అయితే వరుణ్ ఈ కేసు విచారణకు గైర్హాజరు కావడంతో జిల్లా కోర్టు జడ్జి కౌటిల్య కుమార్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 30న కోర్టు ఎదుట హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
వరుణ్ 2009లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కొన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. కార్యకర్త అసద్ హయత్ ఈ విషాయంపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు. 2009 లోక్ సభ ఎన్నికలలో పిలిభిత్ ప్రాంతంలో వరుణ్ గాంధీ చేసిన ప్రసంగం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని అసద్ పేర్కొన్నారు. 2009 మార్చి8న చేసిన ప్రసంగం విషయంలో ఆ నెల 17న బార్ఖేరా పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అదే విధంగా దాల్చండ్ లో కూడా మత విద్వేష ప్రసంగాలు చేయగా మార్చి 18న సర్దార్ కొత్వాలీ పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. వరుణ్ ఈ కేసు విచారణకు హాజరుకాలేదని అసద్ తరఫు న్యాయవాది ఖాద్రీ షాకిర్ పేర్కొన్నారు.