ఢిల్లీలో ఎంపీటీసీల ధర్నా
తొగుట: గ్రామాలాభివృద్ధిలో ఎంపీటీసీ సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంపీటీసీ సభ్యుల ఫోరం ఆధ్యర్వంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మండలం నుంచి ఎంపీటీసీ సభ్యులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంటి యాదగిరి ధర్నా విషయాలను ఢిల్లీ నుంచి స్థానిక విలేకరులకు వివరించారు.
14వ ఆర్థిక సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులను స్థానిక సంస్థలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఎంపీటీసీ సభ్యులకు గ్రామ పంచాయతీ తరహాలో అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఎంపీటీసీ సభ్యులు పిట్ల సత్తయ్య, ఎల్లం తదితరులు ఉన్నారు.