ఇంటర్కే.. నాసాలో రూ.1.8కోట్ల ఉద్యోగమట!
భోపాల్: తాను నాసాలో ఉద్యోగినని చెప్పి అందరినీ మోసం చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చేసుకున్న ప్రచారం, ఆ పేరిట పొందిన సత్కారాలు చూసి అవాక్కయ్యారు. మధ్యప్రదేశ్లో అన్సార్ ఖాన్(20) అనే యువకుడు ఉన్నాడు. అతడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. అయితే, తనకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)లో జాబ్ వచ్చిందని తమ ప్రాంతంలో ప్రచారం చేసుకున్నాడు. ఆ సంస్థలో స్పేస్ అండ్ ఫుడ్ ప్రోగ్రాంలో తాను ఉద్యోగం సంపాధించానని, ఏడాదికి రూ.1కోటి 80లక్షల జీతం అని చెప్పాడు.
అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేసిన ఒక గుర్తింపు కార్డు కూడా అందరికీ చూపించాడు. దీంతో అతడికి చుట్టుపక్కల వారు సన్మానాలు, బహుమానాలు అందజేయడంతో క్యూ కట్టారు. ఒకసారి కమల్పూర్ కు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రభుత్వం తరుపున నిర్వహిస్తున్న కార్యక్రమానికి గౌరవ ప్రదంగా అతడిని కూడా ఆహ్వానించాడు. అక్కడికి ఓ సీనియర్ పోలీసు అధికారి శశికాంత్ శుక్లా కూడా వచ్చారు. అయితే, అన్సార్ ఖాన్ ను శుక్లాను అనుమానించాడు. ఒకసారి ఐడీ కార్డు తీసుకొని రమ్మని అది చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకో అనుమానం వేసి ఎవరికీ తెలియకుండా విచారణకు ఆదేశించాడు. దీంతో అసలు గుట్టు తెలిసింది. అతడు ఓ ఫొటో స్టూడియోకి వెళ్లి ఫేక్ ఐడీ కార్డు తయారు చేయించుకున్నట్లు వెల్లడైంది.