‘కటారా’ దోషులకు 25 ఏళ్ల జైలు
నితీశ్ కటారాది పరువు హత్య అని ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
మానవత్వం లేకుండా, పాశవికంగా చంపేశారు
వికాస్, కజిన్ విశాల్, సుఖ్‌దేవ్‌లకు కఠిన శిక్ష అవసరం
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 594 పేజీల సుదీర్ఘ తీర్పులో నితీశ్‌ది పరువు హత్యేనని తేల్చి చెప్పింది. దోషులైన రాజకీయ నేత డీపీ యాదవ్ కుమారుడు వికాస్(39), ఆయన కజిన్ విశాల్(37), మరో అనుచరుడు సుఖదేవ్ పహిల్వాన్(40)లు పకడ్బందీ ప్రణాళికతో, కర్కశంగా హత్య చేశారని, అందుకు వారికి కింది కోర్టు విధించిన 14 ఏళ్ల జైలుశిక్ష సరిపోదని పేర్కొంది. వికాస్, విశాల్‌లకు 25 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. సాక్ష్యాలను నాశనం చేసినందుకు మరో 5 ఏళ్లు జైళ్లోనే గడపాలని పేర్కొంది. చెరో రూ. 50 లక్షలను జరిమానాగా విధించింది. అదే సమయంలో వారికి మరణ శిక్ష విధించాలన్న హతుడి తల్లి అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.
వివరాల్లోకి వెళితే.. డీపీ యాదవ్ కుమార్తె భారతి, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తున్న నితీశ్ కటారాలు ప్రేమించుకున్నారు. వారి కులాలు, అంతస్తులు వేరువేరు. దాంతో ఆ అనుబంధాన్ని అంగీకరించని భారతి సోదరుడు వికాస్.. తన కజిన్ విశాల్, అనుచరుడు సుఖదేవ్‌లతో కలసి 2002 ఫిబ్రవరి 16 రాత్రి ఘజియాబాద్‌లో నితీశ్‌ను కిడ్నాప్ చేసి, అనంతరం దారుణంగా హతమార్చాడు.
దీనిపై కటారా తల్లి నీలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వికాస్, విశాల్, సుఖ్‌దేవ్‌లను అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2008 మే 30న ఢిల్లీ కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఈ ముగ్గురికి మరణశిక్ష విధించాలని కోరుతూ నీలం ఢిల్లీ హైకోర్టుకు అప్పీలు చేశారు. దీంతోపాటు ముగ్గురు దోషులు కూడా అప్పీలు చేసుకున్నారు. వీటన్నింటిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థలోని తప్పుడు విశ్వాసాల పరంగా జరిగిన ‘పరువు హత్య’గా కటారా హత్యను అభివర్ణించింది.
మానవత్వం లేకుండా, పకడ్బందీ ప్రణాళికతో వారు ఒడిగట్టిన ఈ దారుణానికి 14ఏళ్ల జైలుశిక్ష ఏమాత్రం సరిపోదని స్పష్టం చేసింది. వారిలో పశ్చాత్తాపం కనిపించకపోవడం, తాము చట్టాలకు అతీతులమనే భావన, దుందుడుకు ప్రవర్తనను గుర్తించిన కోర్టు.. వారు మరింత ఎక్కువ కాలం జైళ్లో ఉండటం అవసరమంది. వికాస్, విశాల్‌లకు విధించిన యావజ్జీవ శిక్షను 25 ఏళ్లకు, సుఖ్‌దేవ్‌కు 20 ఏళ్లకు పెంచుతూ తీర్పు వెలువరించింది. శిక్షా కాలంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా, హంతకులకు ఉరిశిక్ష విధించాల్సిందేనని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని కటారా తల్లి నీలం చెప్పారు. కోర్టు సూచించిన నష్టపరిహారం తనకు అవసరం లేదని పేర్కొంది.
కోర్టు తీర్పులోని ఇతర అంశాలు..
దోషులు పెరోల్ కోరితే.. నిర్ణయం తీసుకునే ముందు కటారా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలి. వారి అభ్యర్థనలను పరిశీలనలోకి తీసుకోవాలి.
విశాల్, వికాస్‌లు చెల్లించే జరిమానా మొత్తం రూ. కోటిలో(ఒక్కొక్కరు రూ. 50 లక్షల చొప్పున) కేసు నిర్వహణకు రూ. 50 లక్షలను ఢిల్లీ ప్రభుత్వానికి, రూ. 10 లక్షలను యూపీ ప్రభుత్వానికి చెల్లించాలి. మిగతా రూ. 40 లక్షలను కోర్టు ఖర్చులకు గానూ హతుడి తల్లికి ఇవ్వాలి. ఎయిమ్స్ మెడికల్ బిల్లులకు గానూ రూ. 2. 39 లక్షలను వికాస్ ఢిల్లీ ప్రభుత్వానికి చెల్లించాలి.
ఈ కేసు నిర్వహణకు ప్రభుత్వానికైన ఖర్చు రూ. 5.8 కోట్లు. అందులో రూ. 75 లక్షలు దోషుల భద్రతకే ఖర్చయింది. ఈ వివరాలు ప్రజలకు, న్యాయవ్యవస్థలోని విభాగాలకూ తెలియాల్సిన అవసరం ఉంది. తద్వారా కేసుల విచారణలో అనవసర వాయిదా అభ్యర్థనలు తగ్గుతాయి. ప్రతీ కేసు విచారణఖర్చును, పట్టే సమయాన్ని.. గంటలు, నిమిషాల లెక్కన లెక్కించాలి.
వికాస్ మరో 19 ఏళ్లు, విశాల్ మరో 18 ఏళ్లు, సుఖ్‌దేవ్ మరో 16 ఏళ్లు జైల్లో గడపాల్సి ఉంటుంది.