ముద్రగడ భార్యకు శ్వాసలో ఇబ్బందులు
కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టయిన 13 మందిని విడుదల చేయాలన్న డిమాండ్లతో గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి బీపీలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ముద్రగడ వియ్యంకుడు సోమేశ్వరరావు తెలిపారు. సోమవారంతో ముద్రగడ దీక్ష 12వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 10 మందికి బెయిల్ లభించగా, వారిలో 8 మంది మాత్రం జైలు నుంచి విడుదలయ్యారు. మరో ముగ్గురికి ఇంకా బెయిల్ రావాల్సి ఉండగా, ఇద్దరు విడుదల కావాల్సి ఉంది.
మరోవైపు.. ముద్రగడ భార్య పద్మావతికి ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది అయిందని సోమేశ్వరరావు చెప్పారు. వారిద్దరికీ తక్షణం మెరుగైన చికిత్స అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం 13 మందినీ విడుదల చేసి, వాళ్లను తన కళ్లెదుట చూపిస్తే తప్ప దీక్ష విరమించే ప్రసక్తి లేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ సోమవారం బెయిల్ వచ్చి మిగిలిన వారిని కూడా విడుదల చేస్తే.. ముద్రగడ దంపతులు కిర్లంపూడికి వెళ్లి అక్కడే దీక్ష విరమించే అవకాశం ఉంది.