mullapudi
-
రమణీయ శ్రీ రామాయణం
అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే. – ముళ్లపూడి శ్రీదేవి,ముళ్లపూడి వేంకటరమణ సతీమణి బాపు రమణలు రామభక్తులు. బొమ్మలతో, అక్షరాలతో రాముడి ఋణం కొంతైనా తీర్చుకుని వెళ్లిన జంట. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ముళ్లపూడి వెంకటరమణ సతీమణి ముళ్లపూడి శ్రీదేవి. ఎన్నటికైనా వాల్మీకి ఉపమానాలను ఒక పుస్తకంగా తేవాలని నాలుగు దశాబ్దాల క్రితమే ఆలోచన చేశారు రమణగారు. అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పటికి ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. ‘రమణీయ శ్రీ రామాయణం’ పేరున ఈ పుస్తకాన్ని శ్రీదేవి ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను సాక్షితో పంచుకున్నారు ముళ్లపూడి శ్రీదేవి. ఇది ముళ్లపూడి వెంకటరమణగారి కోరిక. అంటే రమణగారు నాకు కలలో కనిపించి రామాయణం రాయమన్నారని కాదు నేను చెప్పేది. రమణగారి చిన్న వయస్సులో – అంటే ఇంకా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడని రోజుల్లో – వాల్మీకి రామాయణాన్ని శ్రీనివాస శిరోమణి తెలుగులో వచనానువాదం చేస్తున్నారు. అది ఆంధ్ర పత్రికలో ఆదివారం సారస్వతానుబంధంలో ప్రచురింపబడేది. తెలుగువారంతా ఆ రామాయణాన్ని ఇష్టంగా భక్తిగా చదివారు. ఆ రోజుల్లో శిరోమణి గారి దగ్గర వెంకటరమణ గారు సహాయకుడిగా పనిచేశారు. ఆ సందర్భంగా అనువాదం కోసం ఎన్నో రామాయణాలు పరిశీలించారు. వాల్మీకి మహర్షి కవిత్వం, ఆయన శైలి, ఆయన భక్తి ఆకళింపు చేసుకున్నారు. రామాయణమన్నా, రాముడన్నా భక్తి తాత్పర్యాలు ఏర్పడ్డాయి. ఆ ఇష్టంతోనే రమణగారు ‘సీతాకల్యాణం’ కథ రాశారు. ‘ఉపమా కాళిదాసస్య’ అని లోకోక్తి. ‘ఉపమా వాల్మీకస్య’ అని రమణగారు అంటారు. వాల్మీకి మహర్షి కథ చెప్పే పద్ధతి చాలా సరళంగా ఉంటుంది. కథ చెప్పేటప్పుడు అలంకారాలు ఎక్కువగా ఉపయోగించడు. కథ సూటిగా సాగిపోతుంది. వర్ణనల విషయంలో మాత్రం వాల్మీకి ఉపమాలంకారాన్ని విరివిగా ఉపయోగించాడు. ఆయా సమయాలలో సందర్భానుసారంగా ఒకటిరెండు ఉపమానాలు చెప్పి ఊరుకోడు. ఒకదాని వెంట మరొకటిగా పుంఖానుపుంఖంగా ఉపమా లంకారాలు గుప్పిస్తాడు. పాఠకుడిని ఊపిరి తిప్పుకోనివ్వడు. వాల్మీకి ప్రయోగించిన ఈ పద్ధతి రమణగారిని ఎక్కువగా ఆకర్షించింది. రమణగారి కథల్లో కూడా ఈ ఉపమానాల ప్రయోగం తరచుగా కనిపిస్తుంది. విశేషమైన ఈ ప్రయోగాన్ని పాఠకులకు అందించాలని రమణగారి కోరిక. వాల్మీకి చెప్పిన రామకథను మళ్లీ చెప్తూ, సందర్భానుసారంగా వచ్చిన ఉపమానాలను యథాతథంగా అమర్చటం సముచితంగా ఉంటుందని నాకు అనిపించింది. నాకు తోచిన పద్ధతిలో రామాయణం చెప్పటానికి పూనుకున్నాను. ఇంత ప్రయత్నానికీ మూలకారణం ముళ్లపూడి వెంకటరమణగారే. రామాయణం ఒక కొత్త ఉద్దేశంతో చెప్పడానికి ప్రయత్నించాను. అన్నిటికీ వాల్మీకి రామాయణమే మూలం, ఆధారం. అన్ని రామాయణాలతో పాటు ఇదీ మరొక్క రామాయణం. ఇందులో నా సొంత కవిత కొంచెం కూడా లేదు. ఉన్నదంతా వాల్మీకి కవితా సౌందర్యమే. రమణగారు వాల్మీకి రామాయణంలోని ఉపమానాలను అందరికీ ప్రత్యేకంగా చెప్పాలని ఆశించారు. వాల్మీకి ఎంత గొప్పగా, ఎంత అందంగా వాడాడో చెప్పాలనుకున్నారు. ఎలా చెబితే బాగుంటుందా అని ఆచార్య డా. బేతవోలు రామబ్రహ్మం, మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి పెద్దలను అడిగారు. అందరూ ఆలోచన బావుందన్నారు. కానీ ఎలా రాయాలో చెప్పలేదు. దానితో రమణ గారు ఈ అంశాన్ని పుస్తకంగా తీసుకురాలేదు. అప్పట్లో వాల్మీకి ఉపమానాలను నా స్వదస్తూరితో రాసి ఉంచాను. అందువల్ల అది నా మనసులో ఉండిపోయింది. నేను ప్రతి ఉపమానానికి అంకెలు వేసి పెట్టుకున్నాను. మా అమ్మాయి సలహా మేరకు కార్యరూపంలోకి దిగాను. వాల్మీకి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ అర్థంలో ఉపమానాలు చెప్పారో వివరంగా రాసి, నా బ్లాగులో పెట్టాను. మొత్తం రెండు సంవత్సరాల పాటు రాశాను. నేను పూర్తిచేసిన మరునాడు తిరుపతిలో ఉండే కథాప్రపంచం పబ్లిషర్ కిరణ్ ఈ పుస్తకం ప్రచురిస్తానన్నాడు. రామాయణం రాస్తూ నా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడమే కాదు, నా మనసులో నాతోనే ఉన్న రమణ గారి కోరిక నెరవేర్చాను’ అని ముగించారు ముళ్లపూడి శ్రీదేవి. – డా. వైజయంతి పురాణపండ -
విషాదాన్ని మరపించేది హాస్యమే
– ముళ్లపూడి జయంతి సభలో సాహితీవేత్తలు రాజమహేంద్రవరం కల్చరల్ : మన జీవితాల్లో విషాదాన్ని మరపించే శక్తి ఒక్క హాస్యానికే ఉందని ప్రముఖ గేయకవి మహమ్మద్ ఖాదర్‌ఖాన్ పేర్కొన్నారు. బుధవారం కళాగౌతమి ఆధ్వర్యంలో ప్రకాశం నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన రచయిత ముళ్లపూడి వెంకట రమణ జయంతిసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గురజాడ వెంకట అప్పారావు, భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్లపూడి వెంకట రమణలు తెలుగునాట నవ్వులు పండించారని, మాట ‘విరుపు’ ముళ్లపూడి ప్రత్యేకత అని ఆయన వివరించారు. ‘జీవితాన్ని ‘స్కాచి’వడపోశాడు, ‘డబ్బు’ చేశాడు వంటి పదప్రయోగాలతో నూతన ఒరవడిని ముళ్లపూడి ప్రవేశపెట్టారన్నారు. చరిత్ర పరిశోధకుడు వి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హాస్యం అపహాస్యం కాకుండా ఉత్తమాభిరుచితో ముళ్లపూడి రచనలు చేశారన్నారు. ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పౌరాణికగాథలను సాంఘిక మూసలోకి తీసుకువెళ్లడం ఒక్క ముళ్లపూడికే చెందిందన్నారు. రామాయణంలో సుందరకాండ అంతా కనిపించే హనుమంతుడు, రామపట్టాభిషేకం అయ్యాక శ్రీరాముడు సీతమ్మతల్లిని అడవులకు పంపించినప్పుడు ఆ తల్లి వెంటే పిల్లవాడిరూపంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడని, లవకుశులతోపాటు సీతమ్మతల్లి యోగక్షేమాలు చూసేవాడని తన చివరి సినిమాలో ముళ్లపూడి చెప్పడం సంప్రదాయ విరుద్ధం కాదని అన్నారు. ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ మాట్లాడుతూ మృదువైన హాస్య, వ్యంగ్య రచనకు ప్రాణం పోసినవాడు ముళ్లపూడి అని పేర్కొన్నారు. ముళ్లపూడి ‘ఋణానందహరి’లో రచించిన ‘ఎవ్వనిచే జనించు ఋణమెవ్వనిచే భ్రమియించు లోకములో..నేను ఋణంబు వేడెదన్’ అన్న పద్యాన్ని వినిపించారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి ముళ్లపూడి జీవితంలో అనుభవించిన కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను విశ్లేషించారు. హాసం క్లబ్ కన్వీనర్ డి.వి.హనుమంతరావు మాట్లాడుతూ ముళ్లపూడి స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిని కేవలం హాస్యరచనగా చూడరాదని, అందులో ముళ్లపూడి వేదాంత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముందుగా ముళ్లపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాట్యాచార్యుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, చిత్రకారుడు మాదేటి రవిప్రకాష్, గాంగేయశాస్త్రి, అవధాన అష్టాపద తాతా సందీపశర్మ, రామచంద్రుని మౌనిక, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ, సన్నిధానం శాస్త్రి, మల్లెమొగ్గల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా బిర్లా ముళ్లపూడి విగ్రహావిష్కరణ
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత పారిశ్రామికవేత్త, ఆంధ్రాబిర్లా డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు. మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ముళ్లపూడి ఎందరికో మార్గదర్శి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, వి.శివరామరాజు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై భారీ గుంత
భాగ్యనగర్‌కాలనీ: నిత్యం రద్దీగా ఉండే ఉషా ముళ్లపూడి చౌరస్తాలోని జాతీయ రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు త్రీవ అంతరాయం కలిగింది. నాణ్యత కొరవడిన కారణంగా తరచూ రోడ్లు కుంగిపోయి గుంతలు పడుతున్నాయి. ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో అని భయాందోళనతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నెక్లెస్ రోడ్డులో పడిన భారీ గుంత సంఘటన మరవక ముందే ఇక్కడి జాతీయ రహదారిపై గుంత ఏర్పడటంపై ఇటు అధికారులను, వాహనదారులను కలవరానికి గురి చేస్తోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై గుంత ఏర్పడిన సమయంలో వాహనాలు రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. గుంత ఏర్పడిన విషయం తెలుసుకున్న వాటర్‌వర్కు, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. గుంత ఏర్పడటానికి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో ఉషాముళ్లపూడి నుంచి కేపీహెచ్‌బీకాలనీ వైపు గోదావరి ప్రధాన పైపులై వేశారు. పైపులై లీకేజీ కారణంగానే గుంత ఏర్పడి ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా జాతీయ రహదారికి రెండు వైపులా నీటి లీకేజీతో అడుగు భాగం నానిపోయి గుంత పడింది. సంబంధిత అధికారులు పొక్లెయితో మరమ్మతుల చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించారు. -
మరుగున పడ్డ ఎస్వి రంగారావు కథ
అవును. ఆ ఎస్వి రంగారావు గారే. ముళ్లపూడి చేత చతురంగా, క్రూరంగా, భయంకరంగా, విలాసంగా అనే విశేషణాలతో కొనియాడబడ్డ ప్రముఖ నటులు ఎస్.వి.రంగారావు. అయితే ముళ్లపూడి ఈయన సాహిత్యాభిలాషని కూడా గమనించినట్టయితే ఇంకో పన్ అదనంగా పన్నేవారు. ఎస్వి రంగారావు కథలు రాస్తారు అని ఎవరూ ఎక్కడా అనుకోవడం వినలేదు. హటాత్తుగా ఈ కథ కనిపించగానే ఆశ్చర్యం వేసింది. చదివాక ఇంకా ఆశ్చర్యం వేసింది. ఈ కథనంలో స్పష్టతకీ, కథలో పోషించిన ఉత్కంఠకీ, భావవ్యక్తీకరణలో నవ్యతకీ. జనవరి 13, 1960 ఆంధ్రపత్రికలో వచ్చిన ఈ ‘వేట’ని కథ అనుకున్నవాళ్లు ఉన్నారు. వ్యాసం అనుకున్నవాళ్లూ ఉన్నారు. ఎవరు ఎలా అనుకున్నా అందరూ మెచ్చుకోవడం అనేది జరిగిపోయింది. బహుశా బిజీగా ఉండే ఒక నటుడి నుంచి ఇలాంటి సాహిత్యపు తునక ఎవరూ ఊహించి ఉండరేమో. ఇక కథలోకి వస్తే- కథకుడు ఒక ఔత్సాహిక వేటగాడు (రంగారావుగారే). మిత్రులతో పులిని వేటాడ్డానికి అడ్డతీగల అడవుల్లోకి జీపులో ఓ చీకటి రాత్రి ప్రయాణం. ప్రారంభంలోనే చీకటి గురించి, అడవి గురించి ఓ మూడు పేరాల వర్ణన ఉంటుంది. సాధారణంగా ఇలా వర్ణనలతో ప్రారంభమయ్యే కథలు తరువాత చదువుదాం అనిపించేలా ఉంటాయి కాని ఆ చీకటి వర్ణనల్లో ఉన్న భాష తాలూకు మెరుపులో వాటిని చదివించేలా చేస్తాయి. చీకటి పిరికివాడి భయంలా చిక్కగా ఉందట. కడుపులో ప్రమాదాలు దాచి పెట్టుకున్న చీకటి మిణుగురులతో ఇకిలిస్తోందిట. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్‌లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయిట. అలా ఆ ఆటవిక నిశ్శబ్దంలో ప్రయాణిస్తూ ఉండగా వెనక మిత్రుడు ఓ పొడిదగ్గు దగ్గుతాడు. ఊ అన్నాను వెనక్కి తిరక్కుండానే.అబ్బే అన్నాడు అతడు. చలా? ఊహూ భయమెందుకోయ్ అన్నాను భయం అణచుకుంటూ. అతను నవ్వాడు- ధైర్యం తెచ్చుకుంటూ. నాది భయమా? భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి? ధైర్యముంటే అతనెందుకు భయపడాలి? అయినా పులి ఎదురు పడితే ఏమవుతుంది? ట్రిగ్గర్ నొక్కుతాం. ఆ పులికీ, ఈ ట్రిగ్గర్కీ భేటీ కుదరకపోతే? అరక్షణం తర్వాత ఏం జరుగుతుంది? నరాలను మెలిపెట్టే ఆలోచన ఆ క్షణం గురించి. అదే భయం- అదే సుఖం- ఆ క్షణమే స్వర్గం- ఆ క్షణమే భరించరాని నరకం. అదే అంతవరకూ వేటగాడు ఎదురుచూసిన ముహూర్తం.... అని వేటగాడి మనోద్రేకాలని నాలుగు ముక్కల్లో సంక్షిప్తీకరిస్తాడు కథకుడు. ఇంతలో మిత్రుడు సడన్ బ్రేక్ వేస్తాడు. జీప్ హెడ్‌లైట్ కిరణాల చివరి అంచున మసగ్గా ఓ జంతువు కదలిక. కథకుడు ఆలస్యం చేయడు. ఉత్సాహం కొద్దీ గబుక్కున గురి పెట్టి తుపాకీ ట్రిగ్గర్ నొక్కేస్తాడు. ఓ క్షణం నిశ్శబ్దం. అంతలో పెద్ద గర్జన. మిత్రులందరూ వద్దని వారిస్తున్నా వినకుండా జీపు దిగి ఆ జంతువు కనిపించిన చోటికి తుపాకీ పొజిషన్లో పట్టుకొని నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తాడు. పులి చచ్చిందో లేదో తెలీదు. మిత్రులు బ్యాటరీ లైట్‌తో చూపించిన వెలుగు వైపు చూస్తే ఎదురుగా ఓ ఇరవై అడుగుల దూరంలో దెబ్బ తిన్న చిరుతపులి కాచుకుని ఉంది. గుండె ఝల్లుమంది. ఉన్నది ఒకే ఒక గుండు. చావూ బతుకూ పక్కపక్కనే నిలిచిన క్షణం. వెంటనే బాటరీ లైట్ ఆ పులి కళ్ల మీదకి వేసి అది తేరుకునే లోపల గురిపెట్టి కాల్చేస్తాడు. ఇప్పుడు గర్జన లేదు. చిన్న మూలుగు. అంతే. విజయం. అభినందనలు. దుస్సాహసం చేసినందుకు ప్రేమతో నిండిన మందలింపులు. చంపిన చిరుతను వేసుకొని జీపు గ్రామం వైపు బయల్దేరింది. ఇప్పుడు కథకుడి అంతరంగంలో ఏవో ఆలోచనల అలజడి. ఏమిటా ఆలోచనలు? పులికి తనతో శత్రుత్వం లేదు. దాని మానాన అది అడవిలో ఉంది. తనే పులికి శత్రువు. తను నాగరికుడు కాబట్టి. తనకు తెలిసిన వంచనా శిల్పం పులికి తెలియదు. అందుకే తనకి ధైర్యం. అదే అక్కడ పులి కాకుండా తుపాకీతో నిల్చున్న ఒక మనిషిని ఎదుర్కోవాల్సి వస్తే. అప్పుడు ఇంతే ధైర్యం ఉంటుందా? పులిని చంపడం ప్రతీకారమా లేదా తనలోని అహంకారానికి ఉపశమనమా? కథ ముగింపుకు వచ్చేస్తోంది. వాట్ రంగారావు- ఏమిటలా ఉన్నావు? అంటున్నారెవరో. కొత్తగదయ్యా పోను పోను అతనే సర్దుకుంటాడు అంటున్నారింకెవరో. జీపు ఊరి వేపు నాగరికత వేపు సంస్కారం వేపు ముందుకు సాగిపోతోంది. అని కథ ముగిస్తారు రంగారావు చూట్టానికి ఇది మామూలు వేట కథలాగానే ఉన్నా పులిని చంపాక అతడి హృదయంలో కలిగిన అలజడి పాఠకుడిలో కూడా కలగడంలోనే దీని గొప్పతనం ఉంది. పులిని చూసి కాదు భయపడాల్సింది మనిషిని చూశా? నాగరికత అంటే ఏమిటి? ఆటవికం కంటే ఇంకా ఆటవికంగా ఉండటమా? ఎస్ వి రంగారావు పేరిట మరో అయిదు కథలు పాత పత్రికల్లో కనిపిస్తున్నా అవి ఆయన రాసినవేనా అని నిర్థారించుకోవాల్సి ఉంది. వచ్చే నెల- 3న ఆయన జయంతి. 18న ఆయన వర్థంతి. ఈ లోపల తెలుసుకోగలిగితే బాగుణ్ణు. - ఎ.వి.రమణమూర్తి 98660 22150