విషాదాన్ని మరపించేది హాస్యమే
– ముళ్లపూడి జయంతి సభలో సాహితీవేత్తలు
రాజమహేంద్రవరం కల్చరల్ : మన జీవితాల్లో విషాదాన్ని మరపించే శక్తి ఒక్క హాస్యానికే ఉందని ప్రముఖ గేయకవి మహమ్మద్ ఖాదర్‌ఖాన్ పేర్కొన్నారు. బుధవారం కళాగౌతమి ఆధ్వర్యంలో ప్రకాశం నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాలులో జరిగిన రచయిత ముళ్లపూడి వెంకట రమణ జయంతిసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గురజాడ వెంకట అప్పారావు, భమిడిపాటి కామేశ్వరరావు, ముళ్లపూడి వెంకట రమణలు తెలుగునాట నవ్వులు పండించారని, మాట ‘విరుపు’ ముళ్లపూడి ప్రత్యేకత అని ఆయన వివరించారు. ‘జీవితాన్ని ‘స్కాచి’వడపోశాడు, ‘డబ్బు’ చేశాడు వంటి పదప్రయోగాలతో నూతన ఒరవడిని ముళ్లపూడి ప్రవేశపెట్టారన్నారు. చరిత్ర పరిశోధకుడు వి.వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హాస్యం అపహాస్యం కాకుండా ఉత్తమాభిరుచితో ముళ్లపూడి రచనలు చేశారన్నారు. ఓఎన్‌జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ గుంటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పౌరాణికగాథలను సాంఘిక మూసలోకి తీసుకువెళ్లడం ఒక్క ముళ్లపూడికే చెందిందన్నారు. రామాయణంలో సుందరకాండ అంతా కనిపించే హనుమంతుడు, రామపట్టాభిషేకం అయ్యాక శ్రీరాముడు సీతమ్మతల్లిని అడవులకు పంపించినప్పుడు ఆ తల్లి వెంటే పిల్లవాడిరూపంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడని, లవకుశులతోపాటు సీతమ్మతల్లి యోగక్షేమాలు చూసేవాడని తన చివరి సినిమాలో ముళ్లపూడి చెప్పడం సంప్రదాయ విరుద్ధం కాదని అన్నారు. ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ మాట్లాడుతూ మృదువైన హాస్య, వ్యంగ్య రచనకు ప్రాణం పోసినవాడు ముళ్లపూడి అని పేర్కొన్నారు. ముళ్లపూడి ‘ఋణానందహరి’లో రచించిన ‘ఎవ్వనిచే జనించు ఋణమెవ్వనిచే భ్రమియించు లోకములో..నేను ఋణంబు వేడెదన్’ అన్న పద్యాన్ని వినిపించారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి ముళ్లపూడి జీవితంలో అనుభవించిన కష్టసుఖాలను, ఎత్తుపల్లాలను విశ్లేషించారు. హాసం క్లబ్ కన్వీనర్ డి.వి.హనుమంతరావు మాట్లాడుతూ ముళ్లపూడి స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిని కేవలం హాస్యరచనగా చూడరాదని, అందులో ముళ్లపూడి వేదాంత ధోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముందుగా ముళ్లపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాట్యాచార్యుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, చిత్రకారుడు మాదేటి రవిప్రకాష్, గాంగేయశాస్త్రి, అవధాన అష్టాపద తాతా సందీపశర్మ, రామచంద్రుని మౌనిక, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ, సన్నిధానం శాస్త్రి, మల్లెమొగ్గల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.